రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..
ABN, Publish Date - Dec 10 , 2024 | 10:01 PM
ప్రముఖ హాస్య నటుడు రేలంగి వివాహా ఆహ్వాన పత్రికను చూశారా. దాదాపు 91 సంవత్సరాల క్రితపు ఈ వివాహా ఆహ్వాన పత్రిక ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఈ పత్రికను మీరూ చూసేయండి..
నవ్వుల నవాబు రేలంగి ఇప్పటి జనరేషన్‌కి తెలియదేమో కానీ.. ఇంతకు ముందు జనరేషన్‌కి ఆయన ఓ బ్రహ్మానందాన్ని మించిన బ్రహ్మానందం. ఆయన తెరపై ఏం చేయకుండా.. అలా కనిపించి కూడా నవ్వులు పూయించగలరు. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి లెజెండ్స్‌తో నటించిన రేలంగి పూర్తి పేరు రేలంగి వెంకట్రామయ్య. 1910 ఆగస్ట్ 9న తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు, అచ్చయ్యమ్మల దంపతులకు ఒక్కగానొక్క సంతానంగా రేలంగి జన్మించారు. మొదట రంగస్థలంపై నటుడిగా ఎన్నో నాటకాలలో ప్రతిభను కనబరిచిన రేలంగి, 1935లో వచ్చిన ‘కృష్ణ తులాభారం’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి అరంగేట్రమిచ్చారు. సి. పుల్లయ్య ఆ చిత్రానికి దర్శకుడు. ఆ తర్వాత ‘కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు రేలంగి. నటుడిగా నాలుగు దశాబ్దాల పాటు దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఎన్నో మరుపురాని పాత్రలలో నటించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు, అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
ఇక ఆయన వివాహానికి వస్తే.. పైన మీరు చూస్తున్నదే ఆయన వివాహా ఆహ్వాన పత్రిక. 1933లో ఆయనకు వివాహం జరిగింది. ఈ వివాహానికి సంబంధించి చాలా పెద్ద కథే ఉంది. అప్పట్లో రేలంగిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు, రేలంగికి పిల్లనిచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు క్యూ కట్టేవారట. కానీ, తన తండ్రి రామదాసు మాత్రం తనకు తినడానికి గత్యంతరం లేని సమయంలో.. ఎంతగానో గౌరవించి పిల్లనిచ్చిన తన బావమరిది చేబోలు వీరాస్వామి కూతురునే తన కొడుకుకి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటికీ తన బావమరిది వీరాస్వామి బతికి కూడా లేరు.
Also Read- మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్
శుఖలేఖపై కూడా లేటు చేబోలు వీరాస్వామి తనయుడు సాహేబుగారి ప్రథమ సోదరి అని రాసి ఉండటం గమనించవచ్చు. 1933 డిసెంబరు 8వ తేదీన రేలంగి వివాహం పెంటపాడు గ్రామంలోని వధువు స్వగృహంలో జరిగింది. ఇంకా ఈ శుభలేఖలో శుభలేఖను ఎవరికైతే ఇస్తున్నారో.. వారి పేరును పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తెల పేర్లకు పైన రాసి ఇవ్వడం కూడా గమనించవచ్చు. మరి అప్పటి శుభలేఖ.. దాదాపు 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను ఇప్పుడు మీరూ చూసి ఆనందించండి.