మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rama Naidu: వెంకటేష్ నటుడు కావటానికి కృష్ణ కారణం, అదెలా అంటే...

ABN, Publish Date - Mar 26 , 2024 | 02:18 PM

వెంకటేష్ దగ్గుబాటి 'కలియుగ పాండవులు' సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. అతని తండ్రి, నిర్మాత అయిన రామానాయుడు వెంకటేష్ ఆ సినిమాలో నటించడానికి సూపర్ స్టార్ కృష్ణ కారణమంటారు. అదెలా అంటే...

File picture of Venkatesh and Ramanaidu

ఒక్కోసారి ఒక నటుడు చెయ్యాల్సిన సినిమా ఎందుకో ఆ నటుడు చెయ్యలేక పోతాడు, ఆ సినిమా వేరేవాళ్లకి వెళుతుంది. చలనచిత్ర పరిశ్రమలో ఇది పరిపాటి. ఆలా చేసిన ఆ నటులు ఒక్కసారిగా స్టార్స్ గా కూడా ఎదిగిపోతారు. ఉదాహరణకి 'తొలిప్రేమ' సినిమా ముందుగా సుమంత్ చెయ్యాల్సింది, కానీ ఎందుకో అతను చెయ్యలేదు, ఆ తరువాత అదే సినిమాని పవన్ కళ్యాణ్ చేశారు. అది చాలా పెద్ద విజయం సాధించి పవన్ కళ్యాణ్ కి మొదటి విజయం అందించటమే కాకుండా స్టార్ ని చేసింది ఆ సినిమా.

ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో వున్నాయి చలనచిత్ర పరిశ్రమలో. అలాంటిదే ఇంకొకటి వెంకటేష్ దగ్గుబాటి సినిమా ఆరంగేట్రం కూడా. అనుకోకుండా అలా జరిగిపోయింది. నిర్మాత డి రామానాయుడు సూపర్ స్టార్ కృష్ణతో సినిమా చెయ్యాల్సి వుంది, అందుకు కృష్ణ కూడా రామానాయుడికి తేదీలు ఇచ్చారు. రామానాయుడు కథని పరుచూరి సోదరులతో రాయించారు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావుని దర్శకుడిగా కూడా అనుకున్నారు.

కృష్ణ కథానాయకుడిగా సినిమా ఓపెనింగ్ చేద్దామని అనుకున్నారు. "కృష్ణ ఆ సినిమా ఇంకో నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు (పాండవవనవాసం నిర్మాత)తో కలిపి నన్ను నిర్మించామన్నారు. నేను అలా చెయ్యను, నేను ఒక్కడినే ఆ సినిమాకి నిర్మాతగా చేస్తాను, వేరే వాళ్ళతో కలిపి చెయ్యను అని చెప్పాను కృష్ణకి. దానికి కృష్ణ సరే ఇంకోసారి చూద్దాం అని ఆ సినిమా చెయ్యలేదు," అని రామానాయుడు చెప్పారు.

మరి సినిమా కథ, దర్శకుడు రెడీగా వున్నాయి, ఏమి చేద్దాం కొత్తవాళ్లతో వెళదామా అని రామానాయుడు పరుచూరి సోదరులను, దర్శకుడిని అడిగారు. వాళ్ళు సరే అన్నారు. అప్పుడు వెంకటేష్ అమెరికాలో ఎంబిఏ పూర్తి చేసి వున్నారు. "నేను వెంటనే వెంకటేష్ కి ఫోన్ చేసి, ఏమి చేస్తున్నావ్ అని అడిగా, అతను అక్కడ థియేటర్ లో చేరాను అని చెప్పాడు. మరి సినిమాలు చేస్తావా, ఆసక్తి ఉందా అని అడిగా, వెంకటేష్ వుంది అని చెప్పగానే, ఇండియా వెంటనే రమ్మన్నాను, అలా కృష్ణ చెయ్యాల్సిన సినిమాలో వెంకటేష్ ని పెట్టి చేసాను," అని రామానాయుడు చెప్పారు. అదే 'కలియుగపాండవులు' సినిమా, వెంకటేష్ చిత్రపరిశ్రమలోకి ఆరంగేట్రం చేసింది ఆలా.

ఆ సినిమా వెంకటేష్ కథానాయకుడిగా అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి, ప్రేక్షకుల అభిమానము, ముఖ్యంగా మహిళా అభిమానులు ఎక్కువగా వున్న నటుడు అయ్యారు. అదే సినిమాతో ఖుష్బూ కూడా కథానాయికగా ఆరంగేట్రం చేశారు. ఆ సినిమా విజయం సాధించి పెట్టింది. ఇది జరిగింది 1986లో. ఆ సినిమా ఆగస్టు 14, 1986న విడుదలైంది. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా పరిశ్రమలో సెటిల్ అయ్యారు.

-- సురేష్ కవిరాయని

Updated Date - Mar 27 , 2024 | 12:45 PM