Rama Naidu: బెంగాలీ సినిమా తీయడం వలన 'జీటీ' ఎక్స్ ప్రెస్ తెనాలిలో ఆగింది, అదెలా అంటే..

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:19 AM

మూవీ మొఘుల్ రామానాయుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే వ్యక్తుల్లో ఒకరు. అటువంటి రామానాయిడు రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళు వున్నారు, అప్పుడు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీని ఎలా కలుసుకున్నారు, ఆమెని రామానాయుడుని ఏమి అడిగారు, ఆమె ఏమని సమాధానం చెప్పారో చదవండి.

Ramanaidu and (inset) Mamata Banerjee

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు వస్తూ వుంటారు కానీ అందులో కేవలం కొంతమందిని మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆలా గుర్తు చేసుకున్న వారిలో మూవీ మొఘల్ రామానాయుడు ఒకరు. తన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి ఎన్నో చిత్రాలు తీయడమే కాకుండా, 60వ దశకంలో స్థాపించిన ఆ సంస్థ ఈరోజుకి విజయవంతంగా వుంది అంటే దానికి రామా నాయుడు చేసిన అవిరళ కృషి అని మాత్రమే చెప్పాలి. ఒక్క తెలుగులోనే కాకుండా, భారతదేశంలో వున్న అన్ని అధికార భాషల్లో సినిమాలు తీసి శెభాష్ అనిపించుకున్నారు. (Do you know how the GT Express made a stop at Tenali Railway Station, it is because of Movie Moghul Ramanaidu)

రామానాయుడు పరిశ్రమకి చేసిన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది, అలాగే ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డుతో కూడా సత్కరించింది. సినిమాల్లో వచ్చిన డబ్బులు రామానాయుడు సమాజసేవకు కూడా ఉపయోగించారు. అటువంటి రామానాయుడు రాజకీయాల్లో కూడా రాణించారు, కానీ కేవలం కొన్ని సంవత్సరాలపాటు వున్నారు, తరువాత రాజకీయాల నుండి వైదొలిగారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అతను పెట్టిన 'జన్మభూమి', 'ప్రజల వద్దకు పాలన' చూసి రాజకీయాలవైపు ఆకర్షితుడనయ్యాను అని చెప్పేవారు రామానాయుడు.

అందుకనే బాపట్ల లోక్ సభ నియోజకవర్గంనుంచి తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసి 1999 ఎన్నికల్లో గెలుపొందారు రామానాయుడు. "అప్పట్లో నేను తెలుగు దేశం పార్టీ నుండి ఎన్నికైనా, అన్ని పార్టీల వాళ్ళతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నేను ఎంపీగా వున్నప్పుడు మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రిగా పనిచేసేవారు. ఒకసారి ఎర్రంనాయుడు గారు నన్ను మమతా బెనర్జీ గారికి పరిచయం చేశారు. ఇతను తెలుగు దేశం ఎంపీ, అలాగే పెద్ద నిర్మాత కూడా," అని నన్ను పరిచయం చేశారు.

వెంటనే మమతా బెనర్జీ ఏమి సినిమాలు తీశారు అని అడిగితే రామానాయుడు తాను ఎన్ని సినిమాలు తీశారో చెప్పారట. "మరి మా బెంగాలీలో కూడా సినిమాలు తీయండి అని మమతా బెనర్జీ, నాకు చెప్పారు. నేను వెంటనే మేడం, నేను బెంగాలీలో కూడా సినిమాలు తీసాను అని ఆమెకి చెప్పి ఆ సినిమాల వివరాలు కూడా చెప్పాను", అని చెప్పుకొచ్చారు రామానాయుడు. "బెంగాలీ దర్శకుడు రితుపర్ణో ఘోష్ దర్శకత్వంలో 'అసుక్' అనే సినిమా ఇంకో సినిమా తీశాను అని మమతగారికి చెప్పాను," అని చెప్పారు రామానాయుడు.

బెంగాలీ సినిమాలు కూడా నాయుడు తీశారు అని చెప్పగానే మమతా బెనర్జీ చాలా సంతోషపడి పోయారు, "ఏమి పనిమీద వచ్చారు" అని నాయుడుని అడిగారు. "మేడం, జీటీ ఎక్స్ ప్రెస్ తెనాలి స్టేషన్ లో ఆగడం లేదు, అక్కడ ఆగేటట్టు చెయ్యండి అని ఆమెని రిక్వెస్ట్ చేసాను. ఆమె వెంటనే తన పిఏ ని పిలిచి జీటీ ఎక్స్ ప్రెస్ అక్కడ ఆగడానికి తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా చెప్పారు," అని రామానాయుడు చెప్పుకొచ్చారు. అప్పటి నుండి జీటీ ఎక్స్ ప్రెస్ తెనాలి లో కొన్ని నిముషాల పాటు ఆగుతూ ఉంటుంది. (Ramanaidu met then Railway Minister Mamata Banerjee and requested her to stop the GT Express at Tenali Railway Station)

దానివలన తెనాలి ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. అంతే కాకుండా, రామానాయుడు తన ఎంపీ నిధుల నుండి కొన్ని కోట్లు వెచ్చించి తెనాలి స్టేషన్ ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాను అని చెపుతూ ఉండేవారు. వివిధ రాజకీయ పార్టీలపై గెలుపొందినా, అందరూ తమ నియోజక అభివృద్ధి కోసం భేషజం లేకుండా పని చేసేవారు అప్పట్లో అనేవారు రామానాయుడు. రాజకీయాలు అప్పట్లో ఆలా ఉండేవి మరి! రెండో సారి రామానాయుడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, తరువాత రాజకీయాల నుండి తప్పుకున్నారు. అయితే సమాజసేవ మాత్రం చేస్తూ ఉండేవారు.

-- సురేష్ కవిరాయని

Updated Date - Jun 26 , 2024 | 10:28 PM