మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Allu Ramalingaiah: అల్లుకి హాస్యనటుడిగా అవార్డు ఎప్పుడు వచ్చిందో తెలుసా?

ABN, Publish Date - Apr 30 , 2024 | 04:19 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటుల్లో అల్లు రామలింగయ్య ఒకరు. హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన అల్లుకి మొట్టమొదటిసారిగా హాస్యనటుడిగా వరుడు ఎప్పుడు, ఎక్కడ వచ్చిందో తెలుసా?

Allu Ramalingaiah

స్వర్గీయ అల్లు రామలింగయ్య తెలుగు చలన చిత్రసీమలో హాస్యనటుల్లో ఒకరుగా ఎంతో ప్రసిద్దికెక్కారు. వెయ్యికిపైగా చిత్రాల్లో నటించిన అల్లు రామలింగయ్య సుమారు ఐదు దశాబ్దాలపాటు అప్రతిహతంగా తన నటనతో ప్రేక్షకులను రంజింప చేశారు. అల్లు రామలింగయ్య మొదట్లో నాటకాలు బాగా వేస్తూ అలా సినిమాలోకి వచ్చారు. మొదటి సినిమా డాక్టర్ రాజారావు దర్శకత్వంలో వచ్చిన 'పుట్టిల్లు'.

అయితే అల్లు రామలింగయ్యకి మొట్టమొదటిసారిగా హాస్య నటుడిగా అవార్డు ఎప్పుడు వచ్చిందో తెలుసా? అది సినిమాల్లో అనుకుంటున్నారా కాదు, నాటకంలో వేసిన పాత్రకి గాను. 1952లో జరిగిన నాటకాల పోటీల్లో 'కూడు గుడ్డ' అనే నాటకంలో హాస్య పాత్ర వేశారు అల్లు రామలింగయ్య. ఆ నాటకాల పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఎవరొచ్చారో తెలుసా? దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొమాండూరు కృష్ణమాచార్య, దాడి గోవిందరావులు ఈ ముగ్గురూ న్యాయనిర్ణేతలు. వీరు అల్లు రామలింగయ్యకి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డును ప్రకటించారు.

ఆలా మొదటిసారిగా హాస్య నటుడిగా అవార్డు గెలుచుకున్న అల్లు రామలింగయ్య అది తన జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటనగా చెప్పేవారు. ఆ తరువాత సినిమాలలో నటనకి గాను 1975లో కళాసాగర్ (మద్రాసు) వారు అల్లు రామలింగయ్యకి మొదటిసారిగా ఉత్తమ హాస్యనటుడిగా బహుమతి ఇచ్చి సత్కరించింది.

ఈ రెండూ అల్లు రామలింగయ్యకి హాస్యనటుడిగా వచ్చిన సత్కారాలు, అందుకే ముందుగా వచ్చిన ఈ రెండూ ఎప్పుడూ అయన గుర్తుపెట్టుకునేవారు. ఆ తరువాత అల్లు రామలింగయ్యకి ఎన్నో అవార్డులు, పద్మశ్రీ వచ్చాయి. అల్లు రామలింగయ్య స్వర్గస్తులయ్యాక అయన కుటుంబ సభ్యులు అల్లు రామలింగయ్య పేరుపై అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం ఏర్పాటు చేసి, ప్రతి ఏటా అల్లు పేరుమీద చిత్రపరిశ్రమకి చెందిన వారిని సత్కరిస్తూ వుంటారు.

అల్లు వారసత్వం కొనసాగుతూనే వుంది. అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ (Allu Aravind) అగ్ర నిర్మాతల్లో ఒకరుగా వున్నారు, మనవడు అల్లు అర్జున్ (Allu Arjun) అగ్ర నటుల్లో ఒకరు. అల్లు రామలింగయ్య అల్లుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలుగు చిత్రపరిశ్రమకి మెగాస్టార్, ఇంకో మనవడు రామ్ చరణ్ (Ram Charan) అగ్ర నటుల్లో ఒకరుగా చిత్రపరిశ్రమలో వున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 04:19 PM