Preminchukundam Raa: జయప్రకాశ్ రెడ్డికి బదులుగా ఆ బాలీవుడ్ నటుడుని అనుకున్నారు, అతనెవరంటే...
ABN, Publish Date - Apr 18 , 2024 | 12:27 PM
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన సంస్థ. ఆ సంస్థ నుండి వచ్చిన సినిమా 'ప్రేమించుకుందాం రా', వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించారు. విజయవంతమైన ఈ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి ఒక కీలక పాత్రలో కనిపిస్తారు, ఆ పాత్ర హైలైట్ అయింది. అయితే అతని ప్లేస్ లో ముందుగా ఒక బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని అనుకున్నారు, కానీ...
వెంకటేష్, అంజలా ఝవేరి నటించిన 'ప్రేమించుకుందాం రా' సినిమా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా. ప్రముఖ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఇది. నిర్మాత డి. రామానాయుడు ఈ సినిమా సమర్పకులుగా ఉంటే, అతని కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. జయంత్ సి పరాంజీ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా 1997, మే 9 న విడుదలై అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్సించబడి వెంకటేష్ ఖాతాలో ఇంకొక పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇప్పుడు ప్రతి తెలుగు సినిమాలోనూ తెలుగు నటులు తక్కువ, మిగతా భాషల నటులు ఎక్కువ. ఒక కథానాయకుడు అతనితో పాటు ఒకరిద్దరు తెలుగు నటులు కనిపిస్తారు, మిగతా అందరూ మలయాళం, తమిళం, హిందీ లేదా కన్నడ, మరాఠీ నటులు వుంటారు. ఇదీ ఇప్పుడున్న పరిస్థితి. అలాగే పారితోషికాలు చుక్కలు అంటుతాయి, అయినా కూడా తెలుగు నటులకి అవకాశం ఇవ్వకుండా పరభాషా నటులనే పెట్టుకోవాలని మన దర్శక, నిర్మాతలు పోటీ పడుతూ ఉండటం విడ్డూరం. ఎందుకు ఇదంతా అంటే, సినిమా బడ్జెట్ కంట్రోల్ లో ఉండాలి అంటూ ఇలా పరభాషా నటులకి ఎక్కువ పారితోషికం ఇస్తున్న నిర్మాతలు మళ్ళీ బడ్జెట్ ఎక్కువయిందని మాట్లాడటం. ఇక కథానాయకుడు, దర్శకుడు, కథానాయకురాలి పారితోషికం గురించి అయితే చెప్పనవసరం లేదు, సినిమా బడ్జెట్ లో 60 శాతం వీళ్ళకే పోతుంది.
ఇప్పుడు మళ్ళీ 'ప్రేమించుకుందాం రా' సినిమాకి వస్తే ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం హిందీ నటుడు ఆమ్రేష్ పురి కావాలని దర్శకుడు అడిగారు అని తెలిసింది. అతనైతేనే బాగుంటుంది అని దర్శకుడు చెపితే, ఆమ్రేష్ పురిని వెళ్లి అడిగితే అతను తన పారితోషికం రూ.40 లక్షలు అని చెప్పారు. ఎందుకు అతనికి అంత పారితోషికం ఇచ్చి తీసుకోవాలి అని వెంటనే నిర్మాత సురేష్ బాబు ఆలోచించారు. అతనికి జయప్రకాష్ రెడ్డి స్ఫురణకు వచ్చారు, వెంటనే ఆమ్రేష్ పురి కి బదులుగా జయప్రకాశ్ రెడ్డి ని తీసుకుందాం అని దర్శకుడికి చెప్పి అతన్ని పెట్టారు. జయప్రకాష్ రెడ్డి పారితోషికం అప్పట్లో చాలా తక్కువ, ఆమ్రేష్ పురి తీసుకున్న దానిలో పది శాతం కూడా ఉండదేమో. అందుకని జయప్రకాష్ ని తీసుకున్నారు, అతని వలన బడ్జెట్ తగ్గింది, ఒక తెలుగు నటుడికి అవకాశం కూడా ఇచ్చినట్లయింది.
ఆ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి పాత్ర చాలా హైలైట్ అయింది. ఆ పాత్రకి అతనే సరిగ్గా సూటయ్యాడు అని ప్రేక్షకులు కూడా కితాబినిచ్చారు. తెలుగు నటుడు ఆలా ఒక రాయలసీమ యాసలో మాట్లాడటంతో ఆ పాత్రని అతను అద్భుతంగా పోషించటమే కాకుండా ఆ తరువాత జయప్రకాశ్ రెడ్డి రాయలసీమ, చిత్తూరు యాసలో ఎన్నో సినిమాలు చెయ్యడమే కాకుండా, క్యారెక్టర్ నటుల్లో ఒక ప్రధాన నటుడు అయ్యారు. ఆ సినిమా జయప్రకాశ్ రెడ్డి కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. ఆలా బడ్జెట్ కంట్రోల్ చేసేవారు అప్పట్లో. ఇప్పుడు సినిమా అంతా కథానాయకుడిపైనే ఎక్కువ ఆధారపడి వుంది అని పరిశ్రమలో అంటూ వుంటారు.