Kalatapasvi Viswanath: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అనుకున్నారు, డ్రాప్ అయ్యారు ఎందుకో తెలుసా...
ABN, Publish Date - Feb 17 , 2024 | 09:53 AM
కళాతపస్వి కె విశ్వనాధ్ ఎప్పుడూ బయోపిక్ చెయ్యలేదు, కానీ ప్రముఖ గాయనీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తీయాలని అనుకున్నారు. టైటిల్ కూడా ఖరారు చేశారు, ఆమె పాత్రకి అప్పట్లో ఒక అగ్ర నటిని కూడా అనుకున్నారు, కానీ చిరవి నిముషంలో డ్రాప్ అయ్యారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిశని మార్చిన దర్శకుల్లో కె విశ్వనాధ్ ఒకరు. తెలుగు సినిమా ఖ్యాతిని తన సినిమాలతో ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి కళాతపస్వి కె విశ్వనాధ్. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం, స్వర్ణ కమలం, శ్రుతిలయలు, ఒకటేమిటి అయన తీసిన సినిమాలు అన్నీ గొప్ప చిత్రాలుగా ప్రశంసించబడ్డాయి. అలాగే అతని సినిమాలకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అతని సినిమాల్లో విశేషం ఏంటంటే అతను తన కథలని ఎక్కడి నుండో కాపీ కొట్టడం కానీ, లేదా ఇంకో భాష నుండి తీసుకోవటం కానీ చేసేవారు కాదు, సమాజం నుండి పుట్టిన కథలనే తీసుకునేవారు.
నా చుట్టూ ఏమి జరుగుతోంది, అలాగే సమాజంలో ఏమి జరుగుతోంది అనే విషయంపై ఎప్పుడూ దృష్టి పెట్టేవాడిని, అందులోంచి పుట్టినవే నా కథలు అని ఎప్పుడూ చెపుతూ వుంటారు విశ్వనాధ్. అందుకే అతని సినిమాల్లో కొన్ని పాత్రలు చూస్తే అవి మనం మన పక్కింట్లోనో, మనఇంట్లోనో చూస్తున్నట్టుగా ఉంటుంది. నా సినిమాల్లోని చాలా పాత్రలు నేను చూసినవాళ్ళనుంచి స్ఫూర్తి పొందినవే అని చెప్పేవారు విశ్వనాధ్.
తన సినిమాలతో సమాజాన్ని ఎదో ఉద్దరించాలని అనుకోలేదు ఎప్పుడూ, కానీ తాను కొన్ని పద్ధతులు, నీతులు సినిమాలు తీసేటప్పుడు పెట్టుకున్నాను అని, అవి ఫాలో అవుతాను అని చెప్పేవారు విశ్వనాధ్. తన విధానం ఏంటంటే, ఒకరికి సహాయం చెయ్యకపోయినా, వారికి హాని చెయ్యకుండా ఉంటే చాలు, ఆ సూత్రంతోటే తన సినిమాలు అన్నీ తీసేవాడిని అని చెప్పేవారు. విశ్వనాధ్ ఆలా తనకి తాను విధించుకున్న కొన్ని నియమ నిబంధనలవలన అతని సినిమాలు ఎన్నో విజయం సాధించాయి ప్రపంచస్థాయిలో ప్రసంశలు పొందాయి.
అయితే విశ్వనాధ్ కి బయోపిక్ సినిమా తీయాలంటే చాలా భయం అని చెప్పారు. ఎందుకంటే ఆ సినిమా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి, కానీ ఫిక్షన్ వుండకూడదు, అందుకనే తీయడానికి సంకోచించాను అని చెప్పేవారు. అప్పట్లో అతను ప్రముఖ గాయనీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి మీద ఒక బయోపిక్ తీయాలని సంకల్పించారు. ఆమె పాత్ర కోసం నటి రాధికని కూడా అనుకున్నారు కానీ ఆ బయోపిక్ తీయలేదు. ఎందుకంటే అందులో ఏమైనా వాస్తవాలు మిస్ అవుతామో అని భయం వేసి తీయలేదు అని చెప్పేవారు. ఆ సినిమాకి టైటిల్ కూడా 'విదుషీమణి' అని కూడా విశ్వనాధ్ గారు అనుకున్నారు. కానీ చివరి నిముషంలో డ్రాప్ అయిపోయారు.