‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..’ ఆడియో క్యాసెట్ కోసం పుట్టిన పాటని తెలుసా?
ABN, Publish Date - Feb 18 , 2024 | 02:19 PM
తెలుగువారి సంస్కృతిని... ఒరవడిని ఒడిసిపట్టిన కవి సీతారామశాస్త్రి. 1986లో చిత్రరంగ ప్రవేశం చేసిన సీతారామశాస్త్రి... తెలుగు సినిమా గీతాల చరిత్రలో తనదైన ముద్ర వేయగలిగారు. ఆయన సినీ పాటల ప్రస్థానాన్ని ఆకేళ్ల రాఘవేంద్ర ‘పాట షికారుకొచ్చింది’ పేరిట గ్రంథస్థం చేశారు. దానిలోని కొన్ని ఆసక్తికరమైన వాటిలో నుంచి.. ‘గులాబీ’ మూవీలోని ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావే’ పాట ఎలా పుట్టిందో వివరంగా..
తెలుగువారి సంస్కృతిని... ఒరవడిని ఒడిసిపట్టిన కవి సీతారామశాస్త్రి. 1986లో చిత్రరంగ ప్రవేశం చేసిన సీతారామశాస్త్రి... తెలుగు సినిమా గీతాల చరిత్రలో తనదైన ముద్ర వేయగలిగారు. ఆయన సినీ పాటల ప్రస్థానాన్ని ఆకేళ్ల రాఘవేంద్ర ‘పాట షికారుకొచ్చింది’ పేరిట గ్రంథస్థం చేశారు. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు...
‘గులాబీ’ సినిమా స్ర్కిప్ట్ ప్రకారం మొదట అనుకున్నది నాలుగు పాటలే. మరో వైపు షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకో పది పదిహేను రోజుల్లో రిలీజ్ అనుకున్నారు. సినిమా బిజినెస్‌కు అప్పుడైనా ఇప్పుడైనా అత్యంత కీలకమైనది ఆడియో మార్కెటింగ్. అప్పట్లో ఆడియో క్యాసెట్లు ఉండేవి. క్యాసెట్‌కు ఏ, బీ అని రెండు సైడ్లు ఉంటాయి. పాలిస్టర్ లాంటి సన్నటి ప్లాస్టిక్ ఫిల్మ్ మీద మేగ్నిటిక్ కోటింగ్ ద్వారా పాటల్ని రికార్డ్ చేస్తారు. దాన్ని టేప్‌రికార్డర్ ద్వారా వింటారు. ఏ సైడ్ ఎంత స్పేస్ ఉంటుందో బీ సైడ్ కూడా అంతే ఉంటుంది. ఒక పక్క మూడు లేదా నాలుగు పాటలు ఉంటే.. ఇంకో పక్క కూడా సరిసమానంగా ఉండాల్సిందే. అందుకే ఆ రోజుల్లో దాదాపు ప్రతి సినిమాకూ కనీసం ఆరు పాటలు ఉండేవి. ఒక పాట తక్కువ అయితే ఓ పాటని రిపీట్ చేసేవారు- తప్పనిసరి పరిస్థితుల్లో!
‘గులాబి’ సినిమాకి మరీ బొత్తిగా నాలుగు పాటలే ఉన్నాయి. దాంతో ఆడియో కంపెనీవారు- ‘కనీసం అయిదవ పాట అయినా లేదా ఆరు పాటలు ఉండాల్సిందే’ అని పట్టుపట్టారు. అలా అయిదవ పాట చేయక తప్పనిసరైంది. కానీ మొత్తం సినిమా షూటింగ్ అయిపోయింది. అందుకని అయిదవ పాటని రికార్డ్ చేయించి, ఆడియో క్యాసెట్‌లో మాత్రమే ఇచ్చి, సినిమాలో మాత్రం నాలుగే ఉంచుదాం అని నిర్మాత ఆర్జీవీ, దర్శకులు కృష్ణవంశీ డిసైడయ్యారు.
అప్పటికే ‘‘ఏ రోజైతే నిను చూశానో’’ పాట మేల్ వాయిస్‌లో ఉంది. ఇదే మాదిరి ట్యూన్‌తో ఫిమేల్ వెర్షన్‌లో ఇంకో పాట చేస్తే- అయిదవ పాటగా జరిగినదంతా ఆయనకు చెప్పి కొంచెం తొందరగా ఇవ్వమని అన్నారు. ఆయన ఒక రాత్రంతా మేలుకొని రాసిన ఆ పాట
‘‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు వుంటాను ప్రతి నిమిషమూ నేను.. నడిరేయిలో నీవు.. నీదురైన రానీవు.. గడిపేదెలా కాలము.. పగలైనా కాసేపు పని చేసుకోనీవు.. నీ మీదనే ధ్యానము’’.. కావలిసినవారు ఏ మాత్రం దూరంగా ఉన్నా ఎలా పలకరిస్తామో.. కలవరిస్తామో అలాగే రాశారు. ఒక కన్నె మనసు ప్రియుడి తలపుల్లో ఎలా తల్లడిల్లుతుందో అచ్చం అలాగే ఉందీ పాట.
ఆ పాటని ఎవరి చేత పాడించాలీ అన్న ప్రశ్న ఎదురైంది కష్ణవంశీకి. ఎందుకంటే అప్పటికే ఆ సినిమాలో శశిప్రీతమ్, సురేష్ పీటర్స్, సుచిత్ర కృష్ణమూర్తి, హరిహరన్, గాయత్రి, మనోలాంటి కొత్త గొంతుకలతో పాడించారు. ఒక్క మనో తప్ప వీళ్లంతా తెలుగువారు కూడా కాదు. ఇపుడు సినిమాలో కూడా ఉండని ఈ పాటని- పరభాషా గాయనితో పాడించేంత ఖర్చు పెట్టాలా? అందుకని అప్పటికి ఇంకా సింగర్‌గా ఎదగని, కోరస్‌లు మాత్రమే పాడుతూ ఉన్న సునీత ఉపదృష్ట అనే 17 ఏళ్ల అమ్మాయి చేత పాడించారు. సీతారామశాస్త్రి రెమ్యునరేషన్ కాకుండా- ఈ పాట మొత్తం రికార్డింగ్‌కు అయిన ఖర్చు కేవలం ఏడు వేల రూపాయలే! ఈ నాటికీ ఈ పాట సూపర్‌హిట్.
మూలం ఎక్కడుంది? సీతారామశాస్త్రి అందించిన లిరిక్‌లో ఉంది. మామూలు పాటే కదా అని వదిలేద్దాం అని అనుకోకుండా మనసుపెట్టి మంచి పాట ఇచ్చారు. నిజానికి ఈ పాట సినిమాలో ఉండదని తెలుసు. కేవలం ఆడియో క్యాసెట్ కోసమే అని తెలుసు.. అయినా మెమొరబుల్ సాంగ్ రాశారు. ప్రేమలో ఉన్నవారికి ప్రియుడి తలుపు, పిలుపు ఎక్కడ ఉన్నా తరుముతూనే ఉంటాయి. అందుకే ఈ పాట ఇప్పటికీ ఆడపిల్లల మనసుల్లో నిలిచిపోయింది. ఇలాంటివి చూస్తేనే అనిపిస్తుంది సీతారామశాస్త్రి ‘సాంగ్ మేకర్’ అని!
పాట షికారుకొచ్చింది
రచయిత: ఆకేళ్ల రాఘవేంద్ర
ప్రతులకు: 8897826108
ఇవి కూడా చదవండి:
====================
*Allu Arjun: 1, 2, 3.. పుష్ప కథను కొనసాగించాలనుకుంటున్నాం..
****************************
*Chiranjeevi: నా జీవన రేఖ.. భార్య సురేఖకు చిరు బర్త్‌డే విశెస్
*****************************
*Gaami: ఆసక్తికరంగా ‘గామి’ క్యారెక్టర్స్ టీజర్.. విశ్వక్ సేన్‌కే సమస్య!
******************************