పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు?
ABN, Publish Date - Jul 30 , 2024 | 04:35 AM
తమిళ చిత్ర పరిశ్రమ సోమవారం సమావేశమై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. వీటిల్లో ప్రధానమైంది, తెలుగు నిర్మాతలు సాహసించి తీసుకోలేనిది ఏమిటంటే .. ఇకపై హీరోలు, హీరోయిన్లకు...
తమిళ చిత్ర పరిశ్రమ సోమవారం సమావేశమై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. వీటిల్లో ప్రధానమైంది, తెలుగు నిర్మాతలు సాహసించి తీసుకోలేనిది ఏమిటంటే .. ఇకపై హీరోలు, హీరోయిన్లకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వకూడదన్నది. కొంతమంది నటీనటులు, టెక్నీషియన్లు నిర్మాతల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలకు డేట్స్ ఇవ్వకుండా ఆ తర్వాత ఒప్పుకొన్న చిత్రాలకు వర్క్ చేస్తున్నారు. ఇకపై అలా కాకుండా మొదట ఎవరివద్ద అడ్వాన్స్‌లు తీసుకున్నారో వారి షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనాలి. తమిళంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయగలరేమో కానీ తెలుగులో సాధ్యమయ్యే పనేనా అనే చర్చ తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైంది.
ఎందుకంటే ప్రముఖ సంస్థలు పెద్ద హీరోలకు అడ్వాన్సులు ఇవ్వడం, వారు తీసుకోవడం సహజంగా జరిగేదే. ఇలా అడ్వాన్స్ ఇచ్చిన వెంటనే ఆ సినిమా మొదలవుతోందా అంటే చాలా సందర్భాల్లో లేదనే చెప్పాల్సి ఉంటుంది. కథ కుదరకో, కాంబినేషన్ సెట్ అవకో సినిమాలు ప్రారంభం కావడానికి లేట్ కావచ్చు. ఆ లేట్ అనేది నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. ఏళ్ల తరబడి వెయిట్ చేసినా చివరకు జరగని సందర్బాలు ఉన్నాయి కూడా. ఈ లోపు అన్నీ సెట్ అయిన వేరే సినిమా మొదలుపెట్టేస్తుంటారు హీరోలు. హీరోలకు ఇచ్చిన అడ్వాన్సులకు వడ్డీలు కడుతూ లోలోపల బాధ పడుతుంటారు తప్ప బయటకు వ్యక్తం వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పటికైనా హీరోగారు కరుణించి డేట్స్ ఇవ్వవచ్చనే ఓ ఆశ వారిని సంవత్సరాల తరబడి వెయిట్ చేసేలా చేస్తుంటుంది. అలాగే ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఓ వారం రోజుల పాటు షూటింగ్ చేసో, లేక కొంత భాగం షూట్ చేసిన తర్వాత ఆ సినిమాను అలా పక్కన పెట్టేసి మరో కొత్త చిత్రం చేసే హీరోలు తెలుగు చిత్రపరిశ్రమలోనూ ఉన్నారు. ఇలాంటి విషయాలపై తెలుగు చిత్ర పరిశ్రమ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడిస్తుంటుంది కానీ అవి ఆచరణకు దూరంగానే ఉంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తమిళ నిర్మాతలమండలి తీసుకున్న నిర్ణయాలు రేకెత్తిస్తున్నాయి. తెలుగులో కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నిర్మాతల మనసులో ఉంది కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు?
తమిళ నిర్మాతల మండలి నిర్ణయాలు ఇవే
అధ్యక్షుడు ఎన్.మురళి నేతృత్వంలో సభ్యులు సోమవారం వివిధ సంఘాలకు చెందిన నిర్వాహకులు, ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
ఆగస్టు 16 తర్వాత కొత్త సినిమాల షూటింగ్ మొదలు పెట్టకూడదు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలన్నీ అక్టోబరు 31 లోపు పూర్తి చేయాలని ఆయా చిత్ర బృందాలకు సూచించింది.
పెండింగ్‌లో ఉన్న చిత్రాలు, ఇచ్చిన అడ్వాన్స్‌లపై నివేదిక అడిగిన నిర్మాతల మండలి.
నవంబరు ఒకటినుంచి ఎలాంటి సినిమాల చిత్రీకరణ చేపట్టకూడదు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తయి విడుదలకు నోచుకోని చిత్రాల పరిస్థితి ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాలేవీ చిత్రీకరణ మొదలుపెట్టకూడదు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు జీతభత్యాలు పెంచుకుంటూ పోతున్నారని, ఖర్చులకు ఒక విధానమంటూ లేకపోయిందని, ఈ అంశాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మాతలమండలి అభిప్రాయపడింది. వీటిని క్రమబద్దీకరించడంతో పాటు సరైన ప్రణాళికతో ముందుకుసాగాలని, అందువల్ల నవంబరు ఒకటో తేదీ నుంచి ఏ ఒక్క సినిమా షూటింగ్ జరగరాదని తీర్మానించింది.
అగ్రనటులు నటించే కొత్త చిత్రాలను ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలకు ఇవ్వాలని తీర్మానించింది.
ఆంధ్రజ్యోతి, చెన్నై