కొందరు తెలుగు నిర్మాతల జీవన ధన్యతను మెచ్చుకోవాల్సిందే!
ABN, Publish Date - Jul 08 , 2024 | 08:25 AM
ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజు, సాయి కొర్రపాటి, డాక్టర్ జయరాం రెడ్డి (నాగ్ అశ్విన్ తండ్రి) వంటి ప్రముఖులెందరో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత గ్రంధాలను ఇటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారా.. అటు ఫిలింనగర్లో దైవ సన్నిధానం వంటి ఆలయాల ద్వారా సుమారు దశాబ్ద కాలంగా భక్త బృందాలకు ఎంతో సౌందర్యవంతమైన గ్రంధాలను అందిస్తూనే ఉన్నారు. రాబోయే శ్రావణ మాసానికి సుమారు ఇరవై ఐదు శ్రీమహాలక్ష్మి చిత్రాలతో ఐశ్వర్య ప్రదమైన శ్రీమహాలక్ష్మీ వ్రత శోభగా ఒక అక్షర భారతి మంగళప్రదంగా సినీ రంగానికి అందబోతోంది.
*అశ్వనీదత్, దిల్ రాజు, కొర్రపాటిల పవిత్ర సేవకు జేజేలు!
పురాణపండ శ్రీనివాస్.. ఈ పేరు వినగానే అద్భుతమైన పుస్తకాలు, అసాధారణమైన వాగ్ధాటి, అపురూప సొగసుల భాషా శైలి, నిస్వార్ధ జీవనం, ఎన్నో ఆటుపోట్ల మధ్య కూడా మొక్కవోని ధైర్యం, శ్రమైక జీవన సౌందర్యం ఇవే గుర్తొస్తాయని తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతి గాంచిన సాంస్కృతిక కళా సంస్థల వేదిక త్యాగరాయగాన సభ అధ్యక్షులు, కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు కళా జనార్ధనమూర్తి సుమారుగా నెలకొకసారి హైదరాబాద్‌లో తాను పాల్గొనే ఏదో ఒక వేదికపై చెబుతూనే ఉంటారు.
యూట్యూబ్, వాట్సాప్‌లు మన జీవితాన్ని శాసిస్తున్న ఈరోజుల్లో కూడా ఒక భక్తిపుస్తకాన్ని కన్నార్పకుండా ఎలా చదివించాలో పురాణపండ శ్రీనివాస్‌కే బాగా తెలుసని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, యాదాద్రి డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ కిషన్ రావు ఇటీవల బేగంపేట్ హరిత భావంలో జరిగిన ఒక సభలో పేర్కొనడం గమనార్హం.
నాణ్యతా ప్రమాణాల ముద్రణలోగానీ, మంత్రబలాల వ్యాఖ్యానాలతో కానీ, గ్రంథ ఉచితవితరణలో గానీ రాజీ పడకుండా ఖఛ్చితత్వాన్ని పాటిస్తారు శ్రీనివాస్.
డబ్బు కోసమో, డాబు కోసమో, ధనికుల కోసమో, అధికుల కోసమో బుక్స్ అమ్ముకునే వ్యాపారాత్మక కనికట్టుల ఆత్మవంచనను పురాణపండ శ్రీనివాస్ తన దగ్గరకు చేరనివ్వలేదు కాబట్టే ఉత్తమ ప్రమాణాలతో ఆయన గ్రంధాలు దేశ దేశాల తెలుగు వారికీ చేరుతున్నాయి. అందరూ అద్భుతః అంటున్నారు. కొందరు అసూయపడుతున్నారు కూడా.
ఇదెలా వున్నా తాను చేసే పనిలో వున్న దైవత్వం మాత్రమే ముఖ్యమని శ్రీనివాస్ స్పష్టంగా చెప్పేస్తారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకనూరి ఇనాక్ ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో బాహాటంగానే చెప్పేశారు కూడా!
పురాణపండ శ్రీనివాస్ అనే ఒకే ఒక వ్యక్తి పడే కష్టం చూస్తే మనకు ఖచ్చితంగా కన్నీళ్లొస్తాయి. ప్రముఖ రచయితగా, అద్భుతమైన వక్తగా, మహా ప్రతిభావంతునిగా, నిస్వార్థమైన సేవకునిగా తెలుగు రాష్ట్రాలలో విశేష ప్రాచుర్యం సంపాదించుకున్న పురాణపండ శ్రీనివాస్ ప్రతీ రోజూ కనీసంగా పదిహేను నుండీ.. పద్దెనిమిది గంటల వరకూ పనిచేస్తారని.. అందులో తొంభై శాతం దైవీయ మార్గమే మనకు కనిపిస్తుందని, ఆయనతో పరిచయం వున్న వారెవరైనా ఈ విషయాన్ని హండ్రెడ్ పెర్సెంట్ సమర్థిస్తారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.వి. రమణాచారి ఎన్నో సభల్లో బల్లగుద్ది మరీ చెబుతుంటారు. బంధాల్ని, అనుబంధాల్ని, స్నేహితుల్ని అన్నీ ప్రక్కకు పెట్టేసి పురాణపండ పడుతున్న కష్టం చూస్తే మనకి తీయకుండానే మన కన్నుల లోంచి కన్నీళ్లొచ్ఛేస్తాయి. నో డౌట్.
సినిమారంగంలో అనేకమంది ప్రముఖులు ప్రతీ ఏటా శ్రీనివాస్ బుక్స్ కి సౌజన్యం అందిస్తూ ప్రామాణికమైన అపురూప రచనలను, సంకలనాలను ముద్రిస్తూ ఫిలిం నగర్, జూబిలీహిల్స్, బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట తదితర ప్రాంతాలలోని ఆలయాలకు విచ్చేసే వందలకొలది భక్తులకు ఉచితంగా అందించడం విశేషంగానే పేర్కొనాలి.
ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజు, సాయి కొర్రపాటి, డాక్టర్ జయరాం రెడ్డి (నాగ్ అశ్విన్ తండ్రి) వంటి ప్రముఖులెందరో శ్రీనివాస్ పరమాద్భుత గ్రంధాలను ఇటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారా.. అటు ఫిలింనగర్లో దైవ సన్నిధానం వంటి ఆలయాల ద్వారా సుమారు దశాబ్ద కాలంగా భక్త బృందాలకు ఎంతో సౌందర్యవంతమైన గ్రంధాలను అందిస్తూనే ఉన్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కార్యాలయ మేనేజర్ కొలను శేషగిరిరావు ఈ దివ్య గ్రంధాలపట్ల ఎంతో సంస్కార సంపన్నతను ప్రదర్శిస్తూ అనేక ఆలయాలకు, ప్రత్యేక పర్వదినాల సందర్భాల శ్రీకార్యాలకు తానే స్వయంగా వితరణ చెయ్యడం విశేషంగానే చెప్పాలి. కొన్ని సందర్భాలలో శేషగిరిరావే దైవీయ గ్రంధాలను తన కారులో పెట్టుకుని దారిలో అనేకమంది పరిచయస్తులకీ, ఆలయాలకీ స్వయంగా ఇవ్వడం చూస్తే దైవం పట్ల, తాను ఉద్యోగిస్తున్న సంస్థ యజమాని దిల్ రాజు ఎంతో ఖర్చుతో పురాణపండ శ్రీనివాస్ వంటి ప్రతిభావంతుని రచనల్ని బుక్స్‌గా ప్రచురించారని, ఒక్క బుక్ కూడా వృధాకాకుండా యోగ్యులకు చేర్చాలని తపనతో శేషగిరిరావు స్వయంగా శ్రమకోర్చి దైవీయ చైతన్యమున్న చోటికల్లా చేర్చడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
దిల్ రాజు తాను గతంలో నిజమాబాద్‌లో నిర్మించిన అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసే భక్తులకు కూడా గత వైకుంఠ ఏకాదశినాడు వందలకొలది పాకెట్ విష్ణు సహస్ర గ్రంధాలను పంచినట్లు అక్కడి అయ్యవార్లే చెబుతారు. పురాణపండ బుక్స్ నిజామాబాద్ చేర్చడంలో క్రియాశీలక పాత్ర శేషగిరిరావుదేనని ఆలయ సిబ్బంది పేర్కొంటారు.
వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ అయితే మంత్రం వైభవం లాంటి ఇంతటి మహిమోపేత గ్రంధానికి తాను స్పాన్సర్‌ని అనే గర్వం లేకుండా తెలుగు రాష్ట్రాలలో దేవాదాయ శాఖ పరిధిలోని అనేక ఆలయాలకు, ధార్మిక మండళ్లకు స్వయంగా కూర్చుని మరీ కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా పంపడంపట్ల ఈ మంగళ గ్రంథ విలువను ఎంతో భక్తి రసాత్మకంగా చూసేవారాయన. ఇప్పటికీ బెజవాడ దుర్గమ్మ చెంత కొన్ని పారాయణలలో అశ్వనీదత్ గ్రంధాన్నే అయ్యవార్లు అర్చనల్లో ఉపయోగిస్తుండటం కనులముందు కనిపించే సత్యం.
ఇకపోతే.. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సుమారు ఎనభైకి పైగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామివార్ల చిత్రాలతో పురాణపండ శ్రీనివాస్ ద్వారా అందించిన అపురూప మహా గ్రంథ పేటిక ‘శరణు.. శరణు’ గ్రంధాన్ని తిరుమల తిరుపతిలలోని అన్ని విభాగాల ఉద్యోగ పండిత అర్చక వర్గాలకు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ, ధర్మప్రచార పరిషత్‌లలోని యావత్తు ఉద్యోగ బృందాలకీ బహూకరించడం ఆనాడు సాయి కొర్రపాటి, పురాణపండ శ్రీనివాస్ పేర్లు చర్చనీయాంశమవ్వడం ఇక్కడ పేర్కొనాలి. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహాక్రతువుగా కోట్ల రూపాయలతో నిర్వహించిన శ్రీ చండీమహాయాగంలో పాల్గొన్న ఋత్వికులకోసం సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ ‘న భూతో న భవిష్యత్’ అన్నట్లు వేల శోభలతో అమ్మవార్ల ప్రత్యేక సంచిక ‘అమ్మణ్ణి’ నాడే కేసీఆర్ కుటుంబీకుల్నీ వందలమంది ఋత్వికుల్నీ ఆశ్చర్యపరిచిందని ఈనాటికీ పండితవర్గాలు చెబుతుంటాయి. ఇక వారాహి చలన చిత్రం చరిత్రలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అందించిన సుమారు ఐదు వందల ఆంజనేయస్వామి వార్ల వర్ణమయ చిత్రాలతో మంత్రభరితంగా ప్రామాణికంగా రూపొందించిన ఆంజనేయ ఉపాసనా విశేష గ్రంధం ‘నన్నేలు నాస్వామి’ని న్యూఢిల్లీలో సాయి కొర్రపాటి, పురాణపండ శ్రీనివాస్‌లను అభినందిస్తూ భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించడం ఒక బంగారు మైలురాయిగానే చెప్పక తప్పదు.
ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా రంగంలో కనీసం ఏడెనిమిదిమంది నిర్మాతలు, ఐదారుగురు దర్శకులు శ్రీనివాస్ పవిత్ర సంపదను పంచడానికి వెనుక క్రియాశీలక పాత్ర ధరించిన వారే!
తెలుగు చలన చిత్రాల నిర్మాతలు తాము నిర్మాతల్లా కాకుండా కాకుండా దైవ భక్తుల్లా కూడా ఈ చక్కని గ్రంధాలను ఉచితంగా అందించడంతో.. ‘ఈ పుణ్యాలే మిగులుతాయని’ విఖ్యాత నటులు కోట శ్రీనివాసరావు పేర్కొనడాన్ని స్పుటమైన, ప్రస్ఫుటమైన సత్యంగానే ఒప్పుకోవాలి.
రాబోయే శ్రావణ మాసానికి సుమారు ఇరవై ఐదు శ్రీమహాలక్ష్మి చిత్రాలతో ఐశ్వర్య ప్రదమైన శ్రీమహాలక్ష్మీ వ్రత శోభగా ఒక అక్షర భారతి మంగళప్రదంగా సినీ రంగానికి అందబోతోంది.
పురాణపండ శ్రీనివాస్ కలం నుండి వేవేలుగులతో ఆవిష్కృతమయ్యే ఈ లక్ష్మీప్రదమైన సంచికను మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ద్వారా ఎంతోమందికి అందించే ప్రయత్నాన్ని జనార్ధనమూర్తి చేయడానికి ముందుకురావడం అభినందనీయమని ఫిలింనగర్ వర్గాలు హర్షిస్తున్నాయి.
ఏదేమైనా సినెమా రంగంవరకూ ఆధ్యాత్మిక గ్రంధాలంటే పురాణపండ శ్రీనివాస్‌కే ఎక్కువమంది అగ్ర తాంబూలమనేది వివాదాలకు అతీతంగా అందరూ ముక్తకంఠంతో ఒప్పుకునే, కనులముందు కనిపించే సత్యం.
పురాణపండ శ్రీనివాస్ పరమరమణీయ మహా మంగళ గ్రంధం ‘శ్రీపూర్ణిమ’ను గత సంవత్సరం దివంగత విఖ్యాత దర్శకులు కె.విశ్వనాధ్ శ్రీకార్యంరోజున స్మృతి పరిమళంగా కుటుంబీకులు పంచడాన్ని విఖ్యాత నటులు రచయిత తనికెళ్ళ భరణి ‘జీవన ధన్యత’గా పేర్కొనడం రసజ్ఞులు గమనించదగ్గ పవిత్రమైన అంశం.