పదవులకి రాజీనామా చేసిన సిద్ధిఖీ.. రంజిత్
ABN, Publish Date - Aug 26 , 2024 | 05:57 AM
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వెలువడినప్పటినుంచి.. పలు దర్శక, నిర్మాతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న...
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వెలువడినప్పటినుంచి.. పలు దర్శక, నిర్మాతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక నిర్మాతలు తమ పదవులకి రాజీనామా చేశారు. మలయాళ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధిఖీ లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే బెంగాలి నటి శ్రీలేఖ మిత్ర.. తనతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
‘‘నటి శ్రీలేఖ నాపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. నిజానికి ఈ విషయంలో అసలు బాధితుడ్ని నేను. నాపై వస్తున్న ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొని.. నా తప్పు లేదని నిరూపించుకుంటా’’ అని ఓ టెలివిజన్ చానల్‌కు పంపిన ఆడియో రికార్డ్‌లో పేర్కొన్నారు.
సిట్ ఏర్పాటు
మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ విషయాలపై విచారణ చేయడానికి ఓ స్పెషల్ కమిటీని కేరళ ప్రభుత్వం నియమించింది. దీనిపై విచారణ జరిపి వీలైనంత తొందరలో నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.