పురాణపండ శ్రీనివాస్‌కు కనకదుర్గమ్మ కటాక్షం.. బొల్లినేని కృష్ణయ్యది పూర్వ జన్మ సుకృతం
ABN, Publish Date - Apr 15 , 2024 | 11:35 AM
శ్రీ సీతారామచంద్రుల మహా పుణ్యక్షేత్రమైన ‘భద్రాద్రి’ దర్శన సమయంలో.. ప్రత్యేక దర్శనం టికెట్ కొనుగోలు చేస్తే ‘శ్రీ రామ రక్షా స్తోత్రమ్’, ‘యాదాద్రి’లో స్వామి వారి ‘అభిషేకం’ టికెట్ కొనుగోలు చేస్తే ‘శ్రీ లహరి’ అనే పరమాద్భుతమైన గ్రంధం, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సమక్షంలో దంపతులు కుంకుమార్చన చేసుకుంటే.. కుంకుమతోపాటు ఒక అపురూపమైన ‘సౌభాగ్య’ మంగళ గ్రంధం ఉచితంగా లభించనున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఆలయ సముదాయాల్లో, ఆలయ అధికారుల్లో ఇప్పుడొక సమాచారం పవిత్రంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అంశాన్ని స్థూలంగా, సూక్ష్మంగా స్పష్టంగా భక్తజనంకి తెలియజేయాల్సిన అవసరం ఉందంటున్నారు అర్చక పండితులు. ఇక అంశంలోకి వెళితే... శ్రీ సీతారామచంద్రుల మహా పుణ్యక్షేత్రమైన ‘భద్రాద్రి’ దర్శన సమయంలో.. ప్రత్యేక దర్శనం టికెట్ కొనుగోలు చేస్తే ‘శ్రీ రామ రక్షా స్తోత్రమ్’ (Sri Ramaraksha Stotram) అనే శక్తి సంపన్న స్తోత్ర గ్రంధాన్ని దేవస్థానం ఉచితంగా అందిస్తుంది. శ్రీ రాజ్యలక్ష్మీ సమేతంగా కొలువుతీరిన నరసింహస్వామితో తేజరిల్లున్న ‘యాదాద్రి’లో స్వామి వారి ‘అభిషేకం’ టికెట్ కొనుగోలు చేస్తే ‘శ్రీ లహరి’ (SriLahari) అనే పరమాద్భుతమైన గ్రంధాన్ని దేవస్థాన సిబ్బంది ఉచితంగా బహుకరిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై అగ్ని వర్ణాలతో ప్రకాశిస్తూ భక్త కోటికి అభయాన్నిస్తున్న కనకదుర్గమ్మ తల్లి సమక్షంలో దంపతులు కుంకుమార్చన చేసుకుంటే.. కుంకుమతోపాటు ఒక అపురూపమైన ‘సౌభాగ్య’ (Soubhagya) మంగళ గ్రంధాన్ని భక్తులకు దేవస్థానం కానుకగా ఇస్తుంది.
అయితే ... ఈ మూడు గ్రంధాలకు ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) ఒక్కరే రచనా సంకలనకర్త కావడం గమనార్హం. ఈ మూడిండికీ విఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రమే పర్యవేక్షణా బాధ్యతను స్వీకరించడం వారికున్న దైవీయ స్పృహను, సంస్థ ఆత్మ సమర్పణా భావాన్ని తెలియజేస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో ఈ మంత్ర ప్రసాదాన్ని అందించాలనే సంకల్పం కలిగిన వెంటనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో సంప్రదింపులు జరిపి... రోజుల్లోనే ఆచరణాత్మకంగా మూడు గ్రంధాలను మూడు దేవస్థానాల ద్వారా అందించే భాగ్యం తెలుగు రాష్ట్రాలలో కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnayya)కు దక్కడం కూడా పూర్వ జన్మ సుకృతంగానే చెప్పాలి. వందలకొలది పారిశ్రామికవేత్తలు, రాజకీయ సినీరంగపు పెద్దలున్నా, బడా బడా ధనవంతులున్నా ఈ అద్భుత దేవస్థానాల ద్వారా అధికారికంగా మూడు అమోఘ గ్రంధాలను లక్షల ప్రతులు భక్త జనులకు మూడు దేవాలయాల వివిధ ప్రత్యేక దర్శనాల ద్వారా అందించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ అదృష్టం పూర్వ జన్మ సుకృతంగానే బొల్లినేని కృష్ణయ్య దంపతులని వరించిందని ఆ ఆలయాల ధర్మకర్తలు, పాలకవర్గాలు, అర్చక పండితులు బాహాటంగానే అభినందిస్తున్నారు.
మరొక ముఖ్యాంశమేమంటే .. పురాణపండ శ్రీనివాస్ ఈ మూడు దివ్య గ్రంధాలనూ.. ‘న భూతొ న భవిష్యత్’ అన్నట్లుగా పరమ వైభవంగా, అతిఅరుదైన అద్భుత చిత్రాలతో ... పరమాద్భుతమైన వ్యాఖ్యాన వైఖరీ సొగసులతో రూపు దిద్ది రచనా సంకలనాలు అందచేయడం కేవలం సరస్వతీ దేవి విశేషమైన అనుగ్రహం పురాణపండ శ్రీనివాస్‌కి లభించడం వల్లనేనని కూడా ప్రశంసిస్తున్నారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్.రామారావు (KS Ramarao) ఉగాది ఉత్సవాలలో ఈ సౌభాగ్య అమోఘ గ్రంధాన్ని ఆవిష్కరించి కుంకుమార్చనతో మంత్ర ప్రసాద పధకానికి శ్రీకారం చుట్టగా, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో స్వాతినక్షత్ర ప్రత్యేక పవిత్రోత్సవాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ‘శ్రీ లహరి’ అపురూప గ్రంధాన్ని ఆవిష్కరించి ‘అభిషేకంతో అనుగ్రహం’గా ఈ ఉచిత గ్రంధానికి శ్రీకారం చుట్టారు. ఇక భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర దేవస్థానంలో జరుగుతున్న నవమి ప్రత్యేక వసంతోత్సవాల్లో ఆలయ డిప్యూటీ కలెక్టర్ ఎల్. రమాదేవి ఈ అపూర్వ గ్రంధాన్ని ఆవిష్కరించారు. రామభక్తులకు, దుర్గమ్మ భక్తులకు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులకూ ఇది శుభవార్తేకదా అంటున్నాయి భక్త సమాజాలు.
కొందరు ప్రచురణకర్తలు చవుకబారు పేపర్‌పై ఎక్కువ రేట్లకు వినియోగిస్తున్నారు. ఈ దేవస్థానాల పుణ్యమా అని వేద పాఠశాలల విద్యార్థులకు కొన్నాళ్ల పాటు కొన్ని రకాల బుక్స్ కొనే బాధ తప్పిందని, ఈ పుస్తకాలు మేలిమి విలువల నాణ్యతా పేపర్‌పై ముద్రించడం సంతోషంగా ఉందని ఒక ఆలయ వేదపాఠశాల ప్రధానాచార్యుడు బాహాటంగా చెప్పడం విశేషమే మరి.