NBK: మిథున్ చక్రవర్తికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. బాలయ్య ఏమన్నారంటే..
ABN, Publish Date - Sep 30 , 2024 | 01:55 PM
భారతదేశంలో సినీరంగం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌గా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తిని వరించింది. ఈ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య మిథున్‌కు అభినందనలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..
భారతదేశంలో సినీరంగం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌గా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dada Saheb Phalke) అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)ని వరించింది. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా అధికారికంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్టోబర్ 8న జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్‌లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికైన మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో..
Also Read- Pawan Kalyan: ఆ ఆడియో రికార్డు రూపొందించిన కీరవాణికి ధన్యవాదాలు
‘‘విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. తొలి చిత్రం ‘మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. ముఖ్యంగా ‘డిస్కో డాన్స్’కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు. మిథున్ చక్రవర్తితో నాకు చిత్రబంధం ఉంది- అదెలాగంటే నేను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ‘డిస్కో కింగ్’. ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా ‘డిస్కో డాన్సర్’ ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నాను..’’ అంటూ నందమూరి బాలకృష్ణ ఈ లేఖలో పేర్కొన్నారు.