ఎన్టీఆర్ విషయంలో మాట మార్చిన కౌశిక్ తల్లి.. ఏమందంటే
ABN, Publish Date - Dec 25 , 2024 | 09:12 AM
నా మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఫీలైనట్టున్నారు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఒక తల్లి మనసును అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ తన కుమారుడి హెల్త్ విషయంలో సాయం చేసిన అందరికీ కౌశిక్ తల్లి సరస్వతి కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. తాను చనిపోయే లోపు ‘దేవర’ సినిమా చూడాలని, అప్పటి వరకు తనని బతికించాలని కోరుకుంటున్నట్లుగా అప్పట్లో ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఎన్టీఆర్ వరకు వెళ్లడంతో వెంటనే ఆయన వీడియో కాల్ చేసి, కౌశిక్‌కు ఏం కాదని, అంతా తను చూసుకుంటానని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ఎన్టీఆర్.. తర్వాత తన కొడుకు కోసం ఏం చేయలేదని, ఎలాంటి సాయం ఆయన నుండి రాలేదంటూ కౌశిక్ తల్లి సరస్వతి సోమవారం మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా మాటలపై ఆమె మరోసారి వివరణ ఇస్తూ.. ఎన్టీఆర్ టీమ్ వాళ్లకి మేమే కౌశిక్ పరిస్థితి ఏంటనేది చెప్పలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read- Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్
మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను మీడియాతో మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ టీమ్ నాకు కాల్ చేసింది. మేం వస్తున్నాం.. మీరు భయపడవద్దు. మీ అబ్బాయిని మేము డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న అనంతరం రూ.12 లక్షల బిల్లు కట్టి, వారే డిశ్చార్జ్ చేయించారు. నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. వాస్తవానికి నేను నెల రోజులుగా మా అబ్బాయి పరిస్థితిని ఎన్టీఆర్ టీమ్ వాళ్లకి చెప్పలేదు. నేను చెప్పి ఉంటే ముందే వారి నుండి సాయం అందేది. నా మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఫీలైనట్టున్నారు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఒక తల్లి మనసును అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సుల వల్లే నా కొడుకు బాగున్నాడు’’ అని చెప్పుకొచ్చారు.
సమయానికి ఎన్టీఆర్ అండ్ టీమ్ పెండింగ్ బిల్ పే చేయడంతో.. తన కుమారుడిని మంగళవారం సాయంత్రం డిశ్చార్జి చేసినట్టుగా తెలుపుతూ.. తన కుమారుడి ఆరోగ్యం విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ‘దేవర’ సినిమా విడుదలకు ముందు తన కుమారుడిని కాపాడాలని, బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కుమారుడి వైద్య ఖర్చులకు ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కోరుతూ మీడియా ఎదుట కౌశిక్ తల్లి సరస్వతి ఎంతగా విలపించిందో అందరికీ తెలిసిందే. తన కుమారుడు చనిపోయేలోపు తన అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చూడాలని కోరినట్లుగా ఆమె తెలపడంతో.. ఎన్టీఆర్ టీమ్ ద్వారా విషయం తెలుసుకున్న తారక్ వెంటనే వీడియో కాల్ చేసి కౌశిక్‌తోనూ, వారి పేరేంట్స్‌తోనూ మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. ముందుగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి.. క్షేమంగా తిరిగిరా.. తర్వాత సినిమా చూద్దాం అంటూ.. కౌశిక్‌లో ధైర్యం నింపారు.