RGV: వర్మకు నోటీసులు..
ABN, Publish Date - Nov 13 , 2024 | 10:33 AM
సోషల్ మీడియాలో అనుచిత కామెంట్స్ చేసిన వారిని, మరీ ముఖ్యంగా ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో కొందరు కావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారిపై అసభ్యకర పోస్ట్‌లు చేసిన వారందరి లిస్ట్ తీసి.. పోలీసులు వేట మొదలెట్టారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆర్జీవీ వంతు కూడా వచ్చేసింది. వర్మ కోసం పోలీసులు వేట మొదలెట్టారు. అసలు విషయంలోకి వస్తే..
ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం కూడా వర్మకు ఆన్ లైన్‌లో నోటీసులు పంపారని తెలుస్తోంది. ఈ నోటీసులను వర్మ అందుకున్నారు. ఆయన నోటీసులు అందుకుంటోన్న ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read-Prabhas: పెళ్లిపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు
‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల పోలీసులను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ విషయంలో సీరియస్‌గా మూవ్ అవుతున్నారు. పోలీసులు ఇంకా వైసీపీ ప్రభుత్వమే అన్నట్లుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ.. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేసిన వారందరిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ వేశారు. అంతే అప్పటి నుంచి పోలీస్ వ్యవస్థ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి ఫ్యామిలీ సభ్యులపై అనుచిత పోస్ట్‌లు పెట్టిన వారి లిస్ట్ తీసి మరీ అరెస్ట్‌లకు సిద్ధమైంది. ఆ క్రమంలోనే ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఇక అతనిపై పోలీసుల వేట ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.