CMRF: చంద్రబాబుకు బాలయ్య.. రేవంత్‌కు బాలయ్య కుమార్తె చెక్కులు అందజేత

ABN, Publish Date - Sep 13 , 2024 | 06:45 PM

తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వాల పిలుపు మేరకు పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిన విరాళాలను.. ప్రకటించిన వారు అందజేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య చంద్రబాబుకు, ఆయన కుమార్తె రేవంత్ రెడ్డికి చెక్కులు అందజేశారు.

Balakrishna and Tejaswini

తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వాల పిలుపు మేరకు పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ప్రకటించిన విరాళాలను ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందించే క్రమంలో సెలబ్రిటీలు ఇరు రాష్ట్రాల సీఎంలను కలుస్తున్నారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)ను పలువురు ప్రముఖులు కలిసి విరాళాలను అందజేసిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం బాలకృష్ణ‌‌ (Balakrishna)తో పాటు యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ఉన్నారు. బాలయ్య ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించిన రూ. 50 లక్షల చెక్‌ని సీఎం చంద్రబాబుకి అందజేయగా.. సిద్దు, విశ్వక్సేన్ వారు ప్రకటించిన విరాళాలను బాలయ్య సమక్షంలో చంద్రబాబుకు అందజేశారు.

Also Read- Devara: ‘దేవర’పై అంచనాలు తప్పాయా.. యుఎస్‌కు వెళ్లిపోతున్న తారక్..

ఇక బాలయ్య తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిన రూ. 50 లక్షల చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)కి.. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అందజేశారు. వరద బాధితులకు అండగా బాలయ్య రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం తేజస్విని (Tejaswini) అందజేశారు. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. బాలయ్యను, ఆయన కుమార్తెను అభినందించారు.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా విరాళాలు అందించిన వారిని అభినందించారు. ‘‘ముంచెత్తిన వరదలతో సర్వం కోల్పోయిన బాధిత ప్రజలను మళ్ళీ సాధారణ స్థితికి తీసుకువచ్చి, అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కష్టాల నుండి వరద బాధితులను గట్టెక్కించే వరకు మన ప్రభుత్వం విశ్రమించబోదు. తోచిన సాయంతో ముందుకు రావాలని ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను..’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు 50లక్షల రూపాయల విరాళం అందించారు. బాలకృష్ణ గారి తరపున వారి కూతురు తేజస్విని గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగారు అభినందించారు. సీఎం గారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిగారు, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డిగారు ఉన్నారు..’’ అని తెలంగాణ CMO పేర్కొంది.

Also Read- Devara: డబ్బులిచ్చి ‘జై’ కొట్టించుకున్నారా..

Also Read- Mathu Vadalara 2 Review: శ్రీసింహా నటించిన కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా 2' ఎలా ఉందంటే 

Read Latest Cinema News

Updated Date - Sep 13 , 2024 | 06:45 PM