Pawan Kalyan: ఆ ఆడియో రికార్డు రూపొందించిన కీరవాణికి ధన్యవాదాలు
ABN, Publish Date - Sep 30 , 2024 | 11:57 AM
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారంటే..
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి (MM Keeravani)కి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఓ ప్రకటనను విడుదల చేశారు. తిరుమల మహా ప్రసాదం అయిన లడ్డూ తయారీలో కల్లీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం దేశమంతటా టాక్ నడుస్తోంది. హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు దీనిపై చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఒకవైపు సిట్, మరో వైపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టాయి. ఈలోపు ఈ విషయంలో ఆవేదనతో ఉన్నవారంతా.. ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆవేదన నిమిత్తం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాయశ్చిత్త నిమిత్తం అంతా నారాయణ మంత్రం పఠిస్తున్నారు. అలా నారాయణ మంత్రం పఠించే వారందరి కోసం సంగీత దర్శకుడు కీరవాణి ఓ ఆడియో రికార్డ్ చేశారు.
Also Read- Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ఈ ఆడియో రికార్డ్ చేసిన కీరవాణికి, ఆయన టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో..
‘‘ ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం. కీరవాణిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారు. అందుకు అనువుగా శ్రీ కీరవాణిగారు ఆడియో రికార్డు చేశారు. భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షిత:’’ అని పేర్కొన్నారు.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విషయానికి వస్తే.. ఈ ప్రాయశ్చిత్త దీక్షను ఆయన తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకోనున్నారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. ఈ 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామి దర్శనానంతరం విరమిస్తారు. అనంతరం 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.