Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఈ ట్విస్టేంటి?
ABN, Publish Date - Dec 22 , 2024 | 06:35 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తీసుకుంటుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ సినిమా వాళ్లకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడీ ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేమంటే..
జూబ్లీహిల్స్‌లోని హీరో అల్లు అర్జున్ నివాసంపై గుర్తు తెలియని కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిందెవరనే వివరాలు తెలియాల్సి ఉంది. సంధ్య థియేటర్ వద్ద తోపులాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు నెలకొంటున్నాయి. శనివారం అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం, ఆ సమయంలో అల్లు అర్జున్ వైఖరిని తప్పుపట్టడంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి మాటలను తప్పుడు ఆరోపణలుగా ఖండించేందుకు మీడియా సమావేశం నిర్వహించి ఆయన పేరు ఎత్తకుండా జరిగింది ఇదేనంటూ తన వెర్షన్ వినిపించారు. కట్ చేస్తే.. ఆదివారం పోలీసులు ఎవిడెన్స్‌తో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.
Also Read-Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..
అల్లు అర్జున్ వ్యాఖ్యల నేపథ్యంలో అసలారోజు సంధ్య థియేటర్ వద్ద ఏ జరిగిందో తెలుపుతూ పోలీసులు విడుదల చేసిన వీడియోలో.. అల్లు అర్జున్ చెప్పినదానికి అంతా రివర్స్‌గా ఉంది. దీంతో అల్లు అర్జున్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దశలో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఓయూ జెఎసి విద్యార్థుల పేరుతో కొందరు అల్లు అర్జున్ ఇంటిలోకి చొరబడి.. పూల కుండీలను విరగ్గొట్టారు. అక్కడున్న సిబ్బందిపై చెయ్యి చేసుకుంటూ.. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రేవతి మృతికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేస్తూ.. ఓయూ జేఎసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రేవతి కుటుంబానికి తక్షణమే రూ.కోటి సాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడకు చేరుకుని ఏం జరిగిందనేది అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అనంతరం అల్లు అర్జున్ తన పిల్లలని మామ ఇంటికి పంపించినట్లుగా తెలుస్తోంది.