Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ.. ప్రయత్నం ఫలిస్తుందా

ABN, Publish Date - Oct 08 , 2024 | 10:12 PM

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుకుంటానని నటుడు షాయాజీ షిండే ‘మా నాన్న సూపర్‌హీరో’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టేజ్‌పై అలా అన్నారో లేదో.. ఆయనకి అపాయింట్‌మెంట్ వచ్చేసింది.

AP Deputy CM Pawan Kalyan and Sayaji Shinde

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అపాయింట్‌మెంట్‌ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుకుంటానని నటుడు షాయాజీ షిండే (Sayaji Shinde) ‘మా నాన్న సూపర్‌హీరో’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టేజ్‌పై అలా అన్నారో లేదో.. ఆయనకు పవన్ కళ్యాణ్‌ నుండి అపాయింట్‌మెంట్ వచ్చేసింది. దేవాలయాల్లో ప్రసాదంతోపాటు భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని, తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నానని కింగ్ నాగార్జునకు ‘బిగ్‌బాస్‌ సీజన్‌-8’ స్టేజ్‌పై షాయాజీ షిండే తెలిపారు. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి తెలియజేయాలని అనుకుంటున్నానంటూ షాయాజీ చెప్పడం, అందుకు నాగార్జున.. ఆయన వరకు అవసరం లేదు.. ఆయన ఫ్యాన్స్‌కు చేరినా చాలు.. మీ ప్రయత్నం ఫలించినట్లే అని అన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్‌కే కాదు.. డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌కే విషయం చేరింది. వెంటనే పిలుపు వచ్చింది.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ అయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే.. అది కూడా ప్రసాదంగా భావించి భక్తులు పెంచుతారని, పచ్చదనం పెరుగుతుందనే తన ఆలోచనను డిప్యూటీ సీఎంకు షాయాజీ షిండే ఈ భేటీలో తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో షాయాజీ షిండే భేటీ అయిన ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.


అసలేం జరిగిందంటే..

బిగ్ బాస్ స్టేజ్‌పై నటుడు షాయాజీ గురించి సుధీర్‌బాబు (Sudheer babu) మాట్లాడుతూ.. ఖాళీ ప్రదేశం కనపడితే చెట్లు నాటతారని హోస్ట్‌ నాగార్జునతో (Biggboss 8)అన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన నాగార్జున మొక్కలు నాటడం వెనుక ఉన్న కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. అందుకు కారణం తెలుపుతూ.. ‘‘మా అమ్మగారు 97లో కన్ను మూశారు. ఆమె బతికి ఉన్నప్పుడు ఒక విషయం అడిగా ‘అమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది. కానీ, నేను నిన్ను బతికించుకోలేను. నేనేం చేయను’ అని బాధపడ్డాను. వెంటనే మరొక విషయం ఆమెకు చెప్పా. మా అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాలను తీసుకుని, ఇండియా మొత్తం నాటుతానని అన్నాను. నేను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను ఇస్తాయి. పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మ తర్వాత నాకు భూమాత కూడా అంతే గుర్తొస్తుంది. సాధారణంగా దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రసాదాలు పంచుతారు. ప్రసాదంతోపాటు ఒక మొక్కను ఇస్తే బాగుంటుంది. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుడిని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో మూడు దేవాలయాలలో నేను ఈ విధానం మొదలుపెట్టాను. అయితే, అందరికీ కాకుండా ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదంలాగా వీటిని ఇస్తారు..’’ అని షాయాజీ షిండే చెప్పుకొచ్చారు. మరి ఈ ఆలోచనను పవన్ కళ్యాణ్ ఎంత వరకు తీసుకెళతారనేది చూడాల్సి ఉంది.

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2024 | 10:12 PM