A Quiet Place: సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే అదిరిపోయే థ్రిల్లర్.. సీక్వెల్ వచ్చేస్తోంది
ABN, Publish Date - Feb 08 , 2024 | 05:47 PM
2018లో ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన చిత్రం ఏ క్వైట్ ఫ్లేస్ సినిమాకు ఫ్రీక్వెల్ ఏ క్వైట్ ప్లేస్: డే వన్ తెరకెక్కగా విడుదలకు రెడీ అయింది ఈ రోజు (గురువారం) ట్రైలర్ విడుదల చేశారు.
మరో ఆసక్తికరమైన సీక్వెల్ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. 2018లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన చిత్రం ఏ క్వైట్ ప్లేస్ (A Quiet Place). అపోకలిప్టిక్, సైన్స్ ఫిక్షన్, హర్రర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి అదిరిపోయే థ్రిల్‌ను ఇచ్చింది. మరలా 2020లో దీనికి సీక్వెల్ ఏ క్వైట్ ప్లేస్ పార్ట్2 (A Quiet Place Part II) రిలీజై మంచి విజయం సాధించింది. మళ్లీ మూడేండ్ల తర్వాత ఈ సినిమాకు ఫ్రీక్వెల్ ఏ క్వైట్ ప్లేస్: డే వన్ (A Quiet Place: Day One) తెరకెక్కగా విడుదలకు రెడీ అయింది. తాజాగా ఈరోజు (గురువారం) సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ఏ క్వైట్ ప్లేస్: డే వన్ (A Quiet Place: Day One) ట్రైలర్‌ను చూస్తుంటే అంతకుమించి అనేలా ఉన్నది. మొదటి రెండు పార్ట్‌లను మరిపించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్స్‌తో మైండ్ బ్లోయింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక కథ విషయానికి వస్తే.. అంతరిక్షం నుంచి కొన్ని క్రీచర్స్ భూమి పైకి వచ్చి సర్వ నాశనం చేస్తుంటాయి. చిన్న సౌండ్ వినిపించినా, చీమ చిటుక్కుమన్నా వారిని చంపేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ ఫ్యామిలీ వీటి నుంచి తప్పించుకుని ఎలా సర్వైవ్ అయింది అనేది రెండు భాగాలలో చూపించారు.
అయితే త్వరలో విడుదల కానున్న మూడవ భాగం ఏ క్వైట్ ప్లేస్: డే వన్ (A Quiet Place: Day One) ఫ్రీక్వెల్‌గా రానుండడం విశేషం. అసలు క్రీచర్స్ భూమి మీదకు ఎలా వచ్చాయి, అవి భూమి మీదకు వచ్చిన మొదటి రోజు ఏం జరిగింది, మానవాళిపై, నగరాలపై అవి దాడి చేసి ఎలా సర్వ నాశనం చేశాయనే కథ నేపథ్యంలో అదిరిపోయే గ్రాఫిక్స్‌తో తీర్చిదిద్దారు.
మొదటి రెండు భాగాలకు ప్రముఖ డైరెక్టర్, నటుడు జాన్ క్రాసిన్స్కి (John Krasinski) రచన, దర్శకత్వం చేయడంతో పాటు తన భార్య హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎమిలీ బ్లంట్ (Emily Blunt)తో కలిసి కీలక పాత్రల్లో నటించారు.
ఇక రానున్న మూడోవ భాగం ఏ క్వైట్ ప్లేస్: డే వన్ (A Quiet Place: Day One) మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు. రెండు భాగాల్లో ఉన్న నటులు కాకుండా లుపిటా న్యోంగో (Lupita Nyong'o), జోసెఫ్ క్విన్ (Joseph Quinn) అలెక్స్ వోల్ఫ్ (Alex Wolff) వంటి నటులతో ఈ చిత్రాన్ని రూపొందించగా.. రెండో భాగంలో ఉన్న జిమోన్ హౌన్సౌ (Djimon Hounsou) ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
అయితే.. పారామౌంట్ పిక్చర్స్ (Paramount Pictures) నిర్మించిన ఈ చిత్రాన్ని 2023లో మార్చి 31న, సెప్టెంబర్ 22 తేదీల్లో.. 2024లో మార్చి 8న విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ అవన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు ఈ జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.