Zendaya: థియేటర్లలోకి.. హాలీవుడ్ స్టార్ ‘జెండయా’ బోల్డ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా
ABN, Publish Date - Apr 24 , 2024 | 11:49 AM
ఎంతోమంది అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ స్టార్ ‘జెండయా’ నటించిన చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఓ హాలీవుడ్ చిత్రం చాలెంజర్స్ (Challengers) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న ఈ సినిమా మరో 2 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రతి వారం చాలా సినిమాలు వచ్చి పోతుంటాయి అలాంటప్పుడు మరి ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే కేవలం కథానాయిక మాత్రమే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజరే ఈ సినిమాపై హైప్ పెరగడానికి ప్రధాన కారణం.
ప్రస్తతం హాలీవుడ్‌ను ఏలుతున్న ఆగ్ర తారలలో ఒకరిగా చిన్న వయస్సులో.. అతి తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్న నటి జెండయా (Zendaya) ఈ సినిమాలో హీరోయిన్. 2017లో వచ్చిన స్పైడర్‌మ్యాన్ హోం కమింగ్ ఆ తర్వాత ఫార్ ఫ్రం హోం, నో వే హోం, డ్యూన్ 1 అండ్ డ్యూన్ 2 వంటి భారీ చిత్రాలలో కథానాయికగా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును దక్కించుకుంది. తనకంటూ సపరేటు ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకుని మిలియన్లలో అభిమానులను సంపాదించుకుంది.
ఇప్పటికే ఈ అమ్మడు నటించిన డ్యూన్ 2 విడుదలై బ్లాక్‌బస్టర్ అవగా ఇప్పుడు తను మెయిన్‌లీడ్‌లో నటించిన రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ‘చాలెంజర్స్’ (Challengers) సినిమా ఈ శుక్రవారం (ఏప్రిల్ 26)న విడుదల కానుంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ ప్రపంచ వ్యాప్తంగా సెన్షేషన్ క్రియేట్ చేసిందంటే అతిశయోక్తి కాదు.
కథనాయిక జెండయా (Zendaya) ఒకేసారి ఇద్దరితో చుంబనాలలో రెచ్చిపోయి నటించిన టీజర్‌ను విడుదల చేయగా ఒక్కసారిగా ఈ సినిమా అందరి అటెన్షన్‌ను తీసేసుకుంది. ఇక అప్పటినుంచి చాలా మంది ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనడంలో అనుమానం లేదు. మరో ముఖ్య విషయమేంటంటే ఈ సినిమా నిర్మాత కూడా జెండయా (Zendaya) కావడం విశేషం.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. టెన్నిస్ ప్లేయర్ అయిన కథానాయిక తాషి డంకన్ (Tashi Duncan) గాయాలతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి ఓ స్టార్ ప్లేయర్ ఆర్ట్ డొనాల్డ్ సన్ (Art Donaldson)ను వివాహం చేసుకుంటుంది. అదే సమయంలో భర్త అతని బెస్ట్ ఫ్రెండ్ పాట్రిక్ జ్వేగ్ (Patrick Zweig)తో ఓ మ్యాచ్‌లో తలపడాల్సి వస్తుంది. అయితే ఆ ఫ్రెండ్ గతంలో కథానాయిక మాజీ ప్రేమికుడవడంతో వీరి ముగ్గురి చుట్టూ కథ రసకందాయంగా సాగుతూ ఆద్యంతం ఆకట్టుకునేలా సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు అశింనంత వినోదాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి.