Deadpool And Wolverine: థియేట‌ర్లలో అద‌ర‌గొడుతున్న ‘డెడ్‌పూల్‌ వోల్వెరిన్‌’.. తెలుగులో అస‌లు మిస్స‌వ‌కండి! ఆ మ‌జాయే వేరు

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:30 PM

మార్వెల్‌ స్టూడియోస్ నుంచి వ‌చ్చిన‌ కొత్త చిత్రం ‘డెడ్‌పూల్‌ వోల్వెరిన్‌’. గ‌త శుక్రవారం (జూలై 26)న అన్ని భాష‌ల్లో విడుదలైన ఈ మూవీ మంచి పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అస‌లిది హాలీవుడ్ చిత్ర‌మా లేక స్ట్రెయిట్ తెలుగు సినిమానా అనే రేంజ్‌లో ఉంది.

Deadpool And Wolverine

మార్వెల్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించిన కొత్త చిత్రం ‘డెడ్‌పూల్‌ వోల్వెరిన్‌’ (Deadpool and Wolverine). షాన్ లెవీ (Shawn Levy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ‌త శుక్రవారం (జూలై 26)న‌ తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదలైన సంగ‌తి తెలిసిందే. తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా మొద‌టి రోజే వరల్డ్‌వైడ్‌గా 100 మిలియన్‌ డాలర్ల మేర కలెక్షన్లు రాబట్టి సంచ‌ల‌నం సృష్టించింది. యాక్షన్‌, కామెడీ సన్నివేశాలు సూపర్బ్‌గా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

హాలీవుడ్‌ నటుడు ర్యాన్ రేనాల్డ్స్ (Ryan Reynolds) డెడ్‌పూల్‌ పాత్రను పోషించగా, హ్యూగ్ జాక్‌మాన్ (Hugh Jackman) వోల్వరిన్‌గా అబ్బురపరిచే నటనతో ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. భారత్‌లో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ఇప్ప‌టికే దాదాపు ఇరూ.40 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టినట్టు సమాచారం. ప్రపంచ స్థాయిలోనూ విడుద‌లైన ప్ర‌తిచోటా ఎలాంటి నెగిటివిటీ లేకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది.


దీంతో విడుదలైన తొలి రోజే మార్వెల్‌ నిర్మాణ సంస్థ గతంలో నిర్మించిన ‘అవెజంర్స్‌: ఎండ్‌గేమ్‌’, ‘స్పైడర్‌మేన్‌: నో వే హోం’ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌ ఇన్‌ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్నస్‌’ చిత్రాల జాబితాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక తెలుగు, తమిళంలోనూ అనువాదం అయిన ఈ సినిమా సౌత్‌లోనూ అద‌ర‌గొడుతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు భ‌లే కిక్ ఇస్తోంది.ఇది అస‌లు హాలీవుడ్ సినిమా కానే కాదు ఫ‌క్తు తెలుగు సినిమా అనేలా డ‌బ్బింగ్‌, డైలాగ్స్ ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ మ‌ధ్య తెలుగులో డ‌బ్ అయి ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిన‌ ప్రేమ‌లు సినిమాలో ఉన్న డైలాగ్స్‌ను మించి ఈ మూవీలో ప్ర‌తి స‌న్నివేశం, డైలాగ్స్ క‌డుపుబ్బా న‌వ్వించేలా ఉన్నాయ‌ని సినిమా ల‌వ‌ర్స్ అభిప్రాయ ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా డెడ్ పూల్ మాట్లాడే ప్ర‌తి మాట‌లో ప్ర‌స్తుతం మ‌న‌ తెలుగులో బాగా వాడుక‌లో ఉన్న‌ ప‌దాలు, మాట‌ల‌ను ఉప‌యోగించ‌డం ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను అందిస్తుంది. కొత్త, కొత్త‌ సూప‌ర్ హీరోల‌ను ఎప్పుడు తీసుకు వ‌స్తారో ఎప్పుడు చంపుతారో తెలియ‌ట్లేదంటూ మార్వెల్స్ నిర్మాత‌ల‌పై, డిస్నీపై సెటైర్లు, డైలాగ్‌లు మంచి న‌వ్వులు తెప్పిస్తాయి.

కాలేజీ యువ‌కుల‌తో స‌మానంగా యువ‌తులు కూడా సినిమాకు వ‌చ్చి ఎంజాయ్ చేస్తున్నారంటే సినిమాలో వినోదం ఎంత ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాదు.. మూవీలో వ‌చ్చే మార్వెల్స్ సూప‌ర్ హీరోల క్యామియోలు ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ఫ్రైజ్ చేస్తాయి. విల‌న్ క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా చూయించ‌డం, ఎక్కువ‌గా టైం ట్రావెలింగ్ నేప‌థ్యం, యాక్ష‌న్ స‌న్నివేశాలు మెస్మ‌రైజ్ చేస్తాయి. ఎక్క‌డా ఎలాంటి అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌న్నివేశాలు లేకుండా అక్క‌డ‌క్క‌డ డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో సినిమా ఆక‌ట్టుకుంటుంది.

Updated Date - Jul 31 , 2024 | 01:37 PM