The Shameless కేన్స్ చిత్సోత్సవాల్లో భారతీయ సినిమాకు పురస్కారం!
ABN, Publish Date - May 25 , 2024 | 05:13 PM
ఫ్రాన్స్ లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. శనివారంతో ఈ వేడుక ముగుస్తోంది. ఈ వేడుకలో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించారు
ఫ్రాన్స్ లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (77 Cannes Film Festival) అట్టహాసంగా జరుగుతోంది. శనివారంతో ఈ వేడుక ముగుస్తోంది. ఈ వేడుకలో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా (anasuya sen gupta) చరిత్ర సృష్టించారు. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ఉత్తమ నటిగా కేన్స్ వేదికపై అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారామె! బల్గేరియన్ దర్శకుడు కాన్స్ట్టాంటిన్ బొజనోవ్ తెరకెక్కించిన ‘ది షేమ్‌లెస్’ (The Shameless) అనే చిత్రానికి గానూ ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఇందులో ‘రేణుక’ అనే సెక్స్ వర్కర్ పాత్ర పోషించారు. ఈ సినిమాను భారత్, నేపాల్‌లో నెలన్నర రోజులపాటు చిత్రీకరించారు. తాజాగా జరుగుతున్న కేన్స్ ఉత్సవానికి ఈ చిత్రం ఎంపికయింది. ఈ వేడుకల్లో దీన్ని ప్రదర్శించగా.. వీక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కింది.
ఈ చిత్రంలో అనసూయ.. ‘రేణుక’ అనే వేశ్య పాత్ర పోషించారు. ఢిల్లీలోని ఓ బ్రోతల్ హౌస్‌లో పోలీసును చంపి రేణుక పారిపోతుంది. మరో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ 17ఏళ్ల దేవికతో ఆమె ప్రేమలో పడుతుంది. అడ్డంకులను అధిగమించి వీరిద్దరూ తమ జీవితాలను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథా నేపథ్యం.
కోల్‌కతాకు చెందిన అనసూయ కొన్నేళ్ల నుంచి సినీ రంగంలో ఉన్నారు. ముంబయిలో ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించేవారు. దర్శకుడు బొజనోవ్ ఆమెకు ఫేస్బుక్ స్నేహితులు. ఓ సందర్భంలో ఆడిసన టేప్ పంపమని అనసూయకు చెప్పారు. అది నచ్చడంతో ‘ది షేమ్‌లెస్’లో అవకాశమిచ్చారు. అలా నటిగా వెండితెరకు పరిచయమైన అనసూయ తొలి ప్రయత్నంలోనే కేన్స్‌లో అవార్డు అందుకోవడం విశేషం.