Telugu Cinema Budgets: పరభాషా నటుల పారితోషికం కోట్లకి వెళ్ళింది!
ABN, Publish Date - Apr 29 , 2024 | 12:34 PM
ప్రస్తుతం తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రేక్షకుడు తెలుగు సినిమా చూస్తున్నాడా లేదా అనువాద సినిమా చూస్తున్నాడా అనే సందేహం వచ్చేట్టుగా ఎక్కువగా పరభాషా నటులే తెలుగు సినిమాలో కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తమ పారితోషికాలు పెంచేశారు అని ఒక టాక్ పరిశ్రమలో నడుస్తోంది.
నిర్మాతలు ఒక పక్క తమ సినిమాల బడ్జెట్ లు ఎక్కువైపోతున్నాయి అంటూనే ఇంకో పక్క పరభాషా నటులకి అవసరం లేకపోయినా ఎక్కువ పారితోషికం ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ తమ సినిమా బడ్జెట్ ని పెంచుకుంటూ పోతున్నారు. మళ్ళీ సినిమా ఎక్కువ బడ్జెట్ అయిపొయింది అని వాపోతున్నారు. బడ్జెట్ పెరిగిపోతోంది అనే మాట ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తిన్న టాపిక్.
ఆమధ్య ఒక అగ్ర నిర్మాతని కలిసి ఎందుకు సినిమాలు తీయడం లేదంటూ అని అడిగితే, 'ఏముందమ్మా, కథానాయకుడు, దర్శకుడు పారితోషికాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివలన బడ్జెట్ పెరిగిపోయింది, అందుకనే మంచి కథ వస్తే చిన్న సినిమా తీయాలని చూస్తున్నాను,' అని చెప్పారు పేరు చెప్పడం ఇష్టం లేని అతను. అవును కథానాయకుడు, దర్శకులతో పాటు ఇప్పుడు పరభాషా నటుల పారితోషికం కూడా విపరీతంగా పెరిగిపోయింది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా పరభాషా నటులే కదా అనేది ఇప్పుడున్న తెలుగు సినిమా పరిస్థితి అంటున్నారు. సత్యరాజ్, సముద్రఖని, జయరాం, జయప్రకాశ్, ఎస్.జె. సూర్య, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రిషి, అశుతోష్ రానా, అభిమన్యు సింగ్, మకరంద్ దేశ్ పాండే, జిషు సేన్ గుప్త, సంజయ్ మిశ్రా, ప్రదీప్ రావత్, జోజు జార్జ్, లాల్, జాన్ విజయ్, వీటివి గణేష్, షైన్ టామ్ చాకో, ఇలా ఒకరేమిటి ఎంతోమంది తెలుగులో బిజీగా వుండి వాళ్ళ భాషలో కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ పారితోషికం ఇక్కడ తెలుగులో తీసుకుంటూ వున్నారు. వీళ్ళే కాదు ఈ మధ్య అగ్ర నటులైన సంజయ్ దత్, బాబీ డియోల్, కునాల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఫహాద్ ఫాజిల్ వీళ్ళు కూడా తెలుగులో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీళ్ళ పారితోషికం కూడా కోట్లలో ఉంటోంది అని చెపుతున్నారు.
నిర్మాతలు ఒక పక్క బడ్జెట్ ఎక్కువైందని అంటూనే, వీళ్ళందరికీ పారితోషికాలు ఎక్కువ ఇవ్వడం గమనార్హం. ఆమధ్య ఒక నిర్మాత సరదాగా అన్నారు, 'చాలామంది తమిళ, మలయాళ నటులు ఆధార్ కార్డు చిరునామా హైదరాబాదు కి మార్చుకున్నారు' అని, అంటే వాళ్ళందరూ ఇక్కడే ఎక్కువగా వుంటున్నారు అని అర్ధం.
ఈమధ్యనే ఒక చిన్న నిర్మాత ఒక సినిమా ప్రారంభించారు, అందులో సత్యరాజ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అతనికి రోజుకి రూ. 10 లక్ష పారితోషికం, ఇది కాకుండా అతని మిగతా ఖర్చులు వగైరా ఇంకో లక్ష రూపాయలు. ఇప్పటికి అతనికి సుమారు రెండు కోట్లు వరకు ఆ చిన్న నిర్మాత ఇచ్చారు అని ఒక టాక్ నడుస్తోంది, ఇంకా సత్యరాజ్ పాత్ర చిత్రీకరణ చాలా వుంది అని కూడా తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు ఆ నిర్మాతని తనకి సత్యరాజ్ మాత్రమే కావాలని పట్టుపడితే, అందుకు ఆ నిర్మాత సత్యరాజ్ ని పెట్టారని ఒక వార్త. ఈ లెక్కన అతని సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలవుతుంది అనేది నిర్మాత చేతుల్లో అయితే మాత్రం లేదు అని అంటున్నారు.
ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క సత్యరాజ్ మాత్రమే కాదు, తెలుగు నిర్మాత, దర్శకులకి ఎందుకో మొదటినుండీ పరభాషా నటులంటేనే ఎక్కువ మోజు అని చెప్పొచ్చు. వాళ్లలో చాలామంది డబ్బింగ్ చెప్పరు, మళ్ళీ వేరే డబ్బింగ్ ఆర్టిస్టుని పెట్టుకొని, అతనికి కూడా పారితోషికం ఇచ్చుకోవాలి. ఇలా పరభాషా నటుడిని పెట్టుకుంటే ఖర్చెక్కువ తప్పితే, సినిమాకి ఎటువంటి ఉపయోగం ఉండదు అని పరిశ్రమలో అంటున్నారు. కథలో దమ్ముంటే ఏ నటుడుని పెట్టుకున్నా సినిమా నడుస్తుంది అని ఈమధ్యన ఎన్నో చిన్న సినిమాలు నిరూపించాయి అని కూడా అంటున్నారు. పరభాషా నటులు అందరూ మంచి ప్రతిభ కలవారే, కానీ ఇప్పుడు తెలుగులో బిజీ గా వున్న పరభాషా నటులు వాళ్ళ భాషలో ఎందుకు మరి నటించడం లేదు? ఎందుకు వారి స్వంత భాషలో నిర్మాతలు, దర్శకులు వీళ్ళని పెట్టుకోవటం లేదు? అనే విషయం కూడా చర్చ నడుస్తోంది.
ఒకప్పుడు ఎస్వి రంగారావు, గుమ్మడి, రాజనాల, కాంతారావు, సత్యనారాయణ, ముక్కామల, త్యాగరాజు, రావు గోపాల రావు, నాగ భూషణం, జగ్గయ్య, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, రేలంగి, రాజబాబు, సాక్షి రంగా రావు, పీ ఎల్ నారాయణ ఇలా ఎంతోమంది తెలుగు నటులు ఉండేవారు. తెలుగు సినిమా చూస్తున్నాం అనే అనుభూతి ప్రేక్షకుడికి ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు నటులే కనిపించడం తక్కువ, అందుకే తెలుగు సినిమా చూస్తున్నాం అనే భావన రాదు. ఎందుకంటే తెలుగు నిర్మాతలకి, దర్శకులకి, కథానాయకులకు ఇప్పుడు 'పాన్ ఇండియా' అంటూ పరభాషా నటులని పారితోషికం ఎక్కువిచ్చి తీసుకుంటున్నారు అని వార్త. కానీ కథ బలంగా ఉంటే ఏ భాషలోనైనా ఆడుతుంది అని ఈమధ్యనే ఎన్నో సినిమాలు నిరూపించాయి. తెలుగులో ఎంతోమంది క్యారెక్టర్ నటులున్నారు, కానీ నిర్మాతలు పరభాషా నటులకి ఇస్తున్న పారితోషికంతో సగం ఇవ్వడానికి కూడా బేరాలు ఆడతారు. 'కొత్త టాలెంట్ ని పరిచయం చేసే ఉద్దేశం మన దర్శక నిర్మాతలకి కొరవడింది' అని పేరు చెప్పని ఒక నిర్మాత అనడం విడ్డూరం.