ఒకవైపు కలెక్షన్స్ లేక సినిమాహాల్స్ మూత, ఇంకోవైపు 'కృష్ణమ్మ' బ్రేక్ఈవెన్
ABN , Publish Date - May 16 , 2024 | 02:46 PM
ప్రేక్షకులు రాక ఒక పక్క సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ కొన్ని రోజులపాటు మూసివేయాలని సినిమా హాల్ యజమానులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే, ఇంకో పక్క గతవారం విడుదలైన సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని ఆ చిత్ర నిర్వాహకులు చెప్పడం ఆసక్తికరం.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ మూసివేస్తామంటూ ప్రకటనలు వినిపిస్తూనే వున్నాయి. ఇప్పటికే ఆంధ్రాలో, తెలంగాణాలో ప్రేక్షకులు లేక అనేక సినిమా ఆటలు రద్దు చేస్తూనే వున్నారు, కొన్ని సినిమా హాల్స్ ఇప్పటికే మూసేసారు కూడా. ఒక్క సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ కాదు, మల్టీ ప్లెక్స్ లో కూడా పరిస్థితి అలానే వుంది అని చెపుతున్నారు యజమానులు.
అయితే ఒకపక్క సినిమా హాల్ యజమానులు సంక్రాంతికి విడుదలైన సినిమాలలో 'హనుమాన్', తరువాత విడుదలైన 'టిల్లు స్క్వేర్' సినిమాలు తప్ప వేరే ఏ సినిమా కూడా పెద్దగా నడవలేదని చెపుతున్నారు. గత రెండు వారాల్లో విడుదలైన సినిమాల్లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తమ ప్రభావం చూపించలేదని ట్రేడ్ అనలిస్టులు చెపుతున్నారు.
ఇదిలా ఉంటే, సత్యదేవ్ నటించిన సినిమా 'కృష్ణమ్మ' గత వారం విడుదలయింది. ఒక పక్క ఏ సినిమా కూడా సినిమా హాల్స్ లో నడవటం లేదు అని అంటున్న సమయంలో, ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమా ఇప్పటివరకు రూ.5.40 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని, సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిందని చెపుతున్నారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పించారు. వివి గోపాలకృష్ణ ఈ సినిమాకి దర్శకుడు.
ఈ శుక్రవారం మొదలు ఒక పది రోజులు తెలంగాణాలో సుమారు 450 సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ మూసివేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు రాకపోవటం, సినిమా కలెక్షన్స్ కన్నా విద్యుచ్ఛక్తి బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, అందువలన సినిమా హాల్స్ ఇప్పుడు నడవటం కష్టంగా ఉందని, కొన్ని రోజులు మూసి వెయ్యాలని నిర్ణయించమాని చెప్పారు. ఇటువంటి ఈ సమయంలో 'కృష్ణమ్మ' సినిమా బ్రేక్ ఈవెన్ అవటం ఆసక్తికరం.