Krishnamma Movie Review: నిజమైన సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఎలా వుందంటే...
ABN , Publish Date - May 10 , 2024 | 04:29 PM
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకులుగా వ్యవహరించిన సినిమా 'కృష్ణమ్మ' ఈరోజు విడుదలైంది. సత్య దేవ్ ఇందులో ప్రధాన పాత్ర వహించారు. వివి గోపాల కృష్ణ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమా కథ నిజమైన సంఘటన ఆధారంగా తీసింది, మరి ఎలా వుందో చదవండి.
సినిమా: కృష్ణమ్మ
నటీనటులు: సత్యదేవ్, అనిత రాజ్, అర్చన, కృష్ణ బూరుగుల, లక్ష్మణ్ మీసాల, నందగోపాల్, రఘు కుంచె తదితరులు
సంగీతం: కాల భైరవ
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి
దర్శకత్వం: వివి గోపాలకృష్ణ
విడుదల తేదీ: మే 10, 2024
రేటింగ్: 2.5
-- సురేష్ కవిరాయని
సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకులుగా ఉండటంతో ఈ సినిమాపై కొంచెం ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రచారాలకి ప్రముఖ దర్శకులు కొరటాల శివ, రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు రావటం, ఈ సినిమా గురించి మాట్లాడటంతో ఈ సినిమాకి కొంచెం బజ్ వచ్చింది. ఈ సినిమాతో వివి గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Krishnamma Movie Review)
Krishnamma Movie Story కథ:
భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్) ముగ్గురూ ఆనాధలు, మంచి స్నేహితులు, విజయవాడలో ఒక బస్తీలో ఉంటూ వుంటారు. భద్ర, కోటి ఇద్దరూ గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమరవాణాలో పాల్గొంటూ డబ్బులు గడిస్తూ ఉంటే, శివ ఒక స్క్రీన్ ప్రింటింగ్ షాపు పెట్టుకుంటాడు. ఈ ముగ్గురిలో శివ అంటే భద్రకి ఎంతో అభిమానం, ప్రేమ, అందుకే శివని ఎవరేమన్నా ఊరుకోడు భద్ర. శివకి మీనా (అనిత రాజ్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది, ప్రేమగా మారుతుంది. మీనా ఒక్క శివకే కాకుండా, మిగతా ఇద్దరి స్నేహితులని ముఖ్యంగా భద్రని అన్నగా భవిస్తూ రాఖీ కడుతుంది. మీనా పరిచయమయ్యాక స్నేహితులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా మానేసి, పద్ధతిగా బతకాలి అనుకుంటారు. ఇంతలో మీనా తల్లికి వైద్యం కోసం డబ్బులు అవసరమై ఈ ముగ్గురూ చివరిసారిగా పాడేరు నుండి విజయవాడకి మాదకద్రవ్యం అక్రమ రవాణాకి ఒప్పుకుంటారు. మార్గమధ్యంలో పాత తగాదాలతో కొందరు ఈ స్నేహితులతో గొడవపడతారు, ముగ్గురూ అరెస్టవుతారు, మాదకద్రవ్యంతో పట్టుపడతారు. అదే సమయంలో ఏసిపి (నందగోపాల్) ఒక కేసులో ఈ ముగ్గురూ అది తామే చేశామని ఒప్పుకుంటే, ముగ్గురినీ విడిచిపెట్టేస్తా అని చెపుతాడు. కేసు ఏమిటనేది తెలియకుండా ఈ ముగ్గురూ ఒప్పుకుంటారు. ఇంతకీ ఏమి కేసు ఈ ముగ్గురిపై పెట్టారు? కేసు విషయాలు తెలిసాక ఈ ముగ్గురూ ఏమి చేశారు? మీనా, ఆమె తల్లి ఏమయ్యారు, ఎక్కడున్నారు? ఈ ముగ్గురికీ ఏమైనా సహాయం అందిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'కృష్ణమ్మ' సినిమా చూడాల్సిందే. (Satya Dev starrer Krishnamma Movie Review)
విశ్లేషణ:
దర్శకుడు వివి గోపాలకృష్ణ ఒక నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనట్టుగా కనపడుతోంది. ఈ కథ ఒక ముగ్గురు అనాధ స్నేహితులు కథ. సినిమా మొదలుపెట్టడం ఈ ముగ్గురిలో ఇద్దరు స్నేహితులు అడవిలాంటి ఒక ప్రదేశంలో వాదులాడుకోవటంతో మొదలవుతుంది. తరువాత కథ గతంలోకి వెళుతుంది. ముగ్గురి స్నేహితులు, వాళ్ళ స్నేహబంధం, వాళ్ళు చేసున్న పని, అలాగే ఆ బస్తీలో వాళ్ళు తాగి తందనాలాడటం లాంటివి, అవసరమైనప్పుడు మాదకద్రవ్యాల అక్రమరవాణా, ఇవన్నీ చాలాసేపు దర్శకుడు చూపిస్తూ అసలు కథలోకి రావటానికి టైము తీసుకున్నాడు.
ఈ స్నేహితుల మధ్య నడిచే ఈ సన్నివేశాలు అన్నీ ప్రేక్షకుడు ఊహించినట్టుగా ఉంటాయి, మామూలుగా ఉంటాయి. ఎప్పుడైతే విరామం ముందు ఈ సినిమాలో అసలు విషయం దర్శకుడు బయట పెట్టాడో అప్పటి నుండి కథ ఆసక్తికర మలుపులు తిరుగుతూ ఉంటుంది. పోలీసులు ఒక తప్పుడు కేసులో ఎలా కొంతమంది అమాయకులను ఇరికిస్తారు, ఏ విధంగా నిస్పక్షపాతంగా జరగాల్సిన కేసును, పదోన్నతి, పరపతి లాంటి అంశాలతో అమాయకులైన సామాన్యులను దోషులుగా చిత్రీకరిస్తారు అనేది దర్శకుడు వ్యాపారాత్మక విలువలతో కాకుండా కొంచెం గంభీరంగా, తీవ్రమైన సన్నివేశాలతో చూపించాడు. (Popular director Koratala Shiva presented this Krishnamma movie which is released today)
అలాగే ఇందులో నటీనటుల నటన ఈ సినిమాకి ఒక ఆయువుపట్టుగా ఉంటుంది అని చెప్పాలి. చాలా సన్నివేశాలు సహజంగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కథలో కీలకమైన మలుపు బయటపడిందో అప్పుడు ప్రేక్షకుడికి ఆసక్తి కలుగుతుంది, అయితే దర్శకుడు ఆ తరువాత స్నేహితులు ఎలా పగ తీర్చుకున్నారు అనే విషయంపై అంతగా దృష్టి పెట్టలేకపోవటం, ఆ సన్నివేశాలు మామూలుగా ఉంటాయి. సినిమా ప్రారంభంలో ముగ్గురి స్నేహితులమధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతలా కనిపిస్తాయి. దానికి బదులు రెండో సగంలో స్నేహితులు ఎలా పగ తీర్చుకున్నారు అనేదానిపై కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఆసక్తికరంగా ఉండేది అనిపిస్తుంది. అలాగే శివ, మీనా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలని కొంచెం ఎలివేట్ చేసుంటే బాగుండేది. స్నేహితుల మధ్య సన్నివేశాలు మామూలుగా దర్శకుడు చూపించేశాడు, కొంచెం భావోద్వేగం ఉండివుంటే ఇంకా బాగుండేది.
పతాకసన్నివేశాలు కూడా ప్రేక్షకుడు ఊహించినట్టుగానే ఉంటాయి, దర్శకుడు తొందర తొందరగా తీసెయ్యాలి అన్నటుగా అవి కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు చాలా బాగా చూపించాడు, ముఖ్యంగా ఏసీపీ ముగ్గురి స్నేహితులని అర్థరాత్రి నాలుగురోడ్ల కూడలికి తీసుకెళ్లడం, అక్కడ జరిగిన సంఘటన చాలా బాగుంది. కాల భైరవ నేపధ్య సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి. విరామం తరువాత ఇదొక ప్రతీకార నేపథ్యంలో వచ్చిన సినిమాగా అనిపించినా, దర్శకుడు సహజ సిద్ధంగా తీసినందువలన కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. కథనం చాలా మెల్లగా ఉంటుంది, అలాగే చాలా సన్నివేశాలు సాగదీసేశాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే సత్యదేవ్ నటన ఈ సినిమాలో హైలైట్ అని చెప్పాలి. సత్యదేవ్ ప్రతిభ గల నటుడిగా ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు, ఈ సినిమాలో మరోసారి తన ఇంటెన్స్ నటనతో ప్రేక్షకులని అలరించాడు. భద్ర పాత్రలో మమేకమయ్యాడు, ముఖ్యగా రెండో సగంలో అతను కళ్ళలో చూపించిన క్రౌర్యం, నటన పతాకస్థాయిలో ఉంటుంది. అలాగే మిగతా ఇద్దరి స్నేహితులు లక్ష్మణ్ మీసాల, కృష్ణ బూరుగుల కోటి, శివలుగా ఆ పాత్రల్లో ఇమిడిపోయారు. మీనాగా అనితరాజ్ బాగుంది, ఆమె పాత్రని కొంచెం పొడిగిస్తే బాగుండేది. ఏసీపీగా నంద గోపాల్ నటన ఇంకో హైలైట్ అని చెప్పాలి. అర్చన పాత్రకి అసలు ప్రాముఖ్యం ఇవ్వలేదు, ఆమెని ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మాటలు బాగున్నాయి, ఛాయాగ్రహణం బాగుంది. (Krishnamma Movie Review)
చివరగా, 'కృష్ణమ్మ' సినిమా ఒక ప్రతీకార కథ. అనాథలైన ముగ్గురి స్నేహితులను తాము చెయ్యని నేరంలో ఇరికించి జైలుశిక్ష వేస్తె వాళ్ళు బయటకి వచ్చి ఎలా పగ తీర్చుకున్నారు అనే విషయం సహజసిద్ధంగా ఉండేట్టు చూపించాడు దర్శకుడు. అక్కడక్కడా సాగదీతలు, నెమ్మదిగా కథ సాగుతున్నా, విరామం ముందు, తరువాత వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సత్యదేవ్ నటన హైలైట్ అని చెప్పాలి.