Allu Aravind vs Krish: 'తండేల్' కథ, 'అరేబియన్ కడలి' కథ ఒకటేనా?
ABN, Publish Date - Mar 20 , 2024 | 02:33 PM
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా 'తండేల్' సినిమా మత్స్యకారులు నేపథ్యంలో వస్తున్న కథ. నిన్న అమెజాన్ ఓటిటి సంస్థ దర్శకుడు క్రిష్ సారధ్యంలో 'అరేబియన్ కడలి' అనే ఒక వెబ్ సిరీస్ కూడా ప్రకటించింది, అది కూడా మత్స్యకారులు నేపథ్యంలో వచ్చే వెబ్ సిరీస్ . ఈ రెండు కథల నేపధ్యాలు ఒకటే అవటం ఆసక్తికరం...
నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి సంస్థ తాము స్ట్రీమింగ్ చెయ్యబోయే సినిమాలను, వెబ్ సిరీస్ లను అలాగే విడుదల కాని కొన్ని పెద్ద తెలుగు సినిమాలను కూడా అవి విడుదలయ్యాక అమెజాన్ లో చూడొచ్చు అని ప్రకటించారు. అలా ప్రకటించిన వాటిలో రెండు ఆసక్తికర వెబ్ సిరీస్ లున్నాయి. అందులో ఒక వెబ్ సిరీస్ 'అరేబియన్ కడలి'. దీనికి క్రియేటివ్ నిర్మాత క్రిష్ జాగర్లమూడి కాగా, ఈ కథని రాసినవాళ్లలో కూడా క్రిష్ వున్నారు. అయితే ఇందులో ఏముంది, క్రిష్ మంచి రచయిత, దర్శకుడు, ఇంకో ఇంటెన్స్ కథ తీస్తున్నారు అని అనుకుంటాం. అయితే ఇక్కడే ఒక చిన్న ఆసక్తికర విషయం వుంది.
అల్లు అరవింద్ సమర్పిస్తూ, బన్నీ వాసు నిర్మిస్తున్న, గీత ఆర్ట్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా 'తండేల్'. ఇందులో నాగ చైతన్య కథానాయకుడు, సాయి పల్లవి కథానాయిక. చందూ మొండేటి దర్శకుడు. అయితే అమెజాన్ తన సామజిక మాధ్యమంలో 'అరేబియన్ కడలి' ప్రకటిస్తూ ఆ వెబ్ సిరీస్ సంక్షిప్త కథని కూడా చెప్పారు. ఆ కథ, ఇప్పుడు అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో వస్తున్న 'తండేల్' సినిమా కథకి కొంచెం అటు ఇటు తేడాలో ఒకేలా ఉండటం విశేషం. 'తండేల్' కథ కూడా శ్రీకాకుళం దగ్గర ఒక వూరిలో వున్న మత్స్యకారులు నేపథ్యంలో సాగే కథ. సముద్రంలో చేపలు పడుతూ దారితప్పి పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళిపోతారు కొందరు మత్స్యకారులు, ఆలా వెళ్ళిన తరువాత ఏమైంది, ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది. 'తండేల్' టీజర్ కూడా ఆమద్యన విడుదలైంది కూడా.
ఇప్పుడు క్రిష్ రాస్తున్న, నిర్మిస్తున్న 'అరేబియన్ కడలి' వెబ్ సిరీస్ కూడా మత్స్యకారులు నేపథ్యంలో సాగే కథ. రెండు గ్రామాలకి చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి దారితప్పి అంతర్జాతీయ ప్రదేశంలోకి వెళ్లి విదేశాల వాళ్లకి దొరికిపోతారు, వీళ్ళని అక్కడ ఖైదు చేస్తారు. కథలు ఒకేలా వున్నాయి కదా, మరి క్రిష్ వెబ్ సిరీస్ 'తండేల్' కన్నా ముందే అమెజాన్ లో స్ట్రీమింగ్ అయితే, 'తండేల్' సినిమాకి అది పెద్ద మైనస్ అని పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది. ఇంచుమించు రెండు కథలూ ఒకేలా వున్నప్పుడు మరి ఈ ఇద్దరూ ఇప్పుడు మాట్లాడుతారా, కథలు మారుస్తారా, లేక అమెజాన్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది కాబట్టి, అదే కథని తీస్తారా. రాబోయే రోజుల్లో వీటి గురించి ఆసక్తికరమైన సమాచారం కోసం చూడండి.
అలాగే అమెజాన్ ఇంకో వెబ్ సిరీస్ కూడా ప్రకటించింది అది 'మట్కా కింగ్'. నాగరాజ్ మంజులే దర్శకుడు, ఇతను ఎక్కువగా మరాఠీ సినిమాలు చేశారు, ఇప్పుడు ఈ 'మట్కా కింగ్' కూడా హిందీ వెబ్ సిరీస్ గా వస్తోంది. కానీ ఇదే వరసలో తెలుగులో 'పలాస' ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పేరు 'మట్కా'. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలెట్టారు, ఈ సినిమా కథ, నాగరాజ్ మంజులే తీస్తున్న 'మట్కా కింగ్' కథ ఇంచుమించు ఒకేలా ఉండటం ఆసక్తికరం. అయితే 'తండేల్', 'అరేబియన్ కడలి' లా రెండు తెలుగు కాకుండా, ఈ రెండు ఒకటి తెలుగు, ఇంకోటి హిందీ. మరి ఈ రెండిటికి ఏమైనా పోలిక ఉందా, లేదా అనేది విడుదల తరువాత చూడాల్సిందే.