Breaking News: సినిమాలన్నీ నిరవధికంగా వాయిదా పడే అవకాశం?
ABN, Publish Date - May 22 , 2024 | 03:20 PM
కౌంటింగ్ జరిగే కొన్ని రోజుల ముందు, అలాగే ఫలితాలు వెలువరించిన తరువాత కొన్ని రోజుల వరకు ఆంధ్ర ప్రదేశ్ లో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో, ముందు జాగ్రత్త చర్యగా 144వ సెక్షన్ విధించే అవకాశాలున్నాయని, అందువలన మే 31న విడుదలయ్యే సినిమాలు వాయిదా పడవచ్చని ఒక చర్చ నడుస్తోంది.
రాబోయే మే 31న సుమారు అరడజనుకుపైగా సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. ఒక పక్క సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ కి సరైన ప్రేక్షకాదరణ లేక సినిమా హాల్స్ మూసుకోవాల్సి వస్తోందని థియేటర్ యజమానులు చెపుతున్నారు. ఇంకో పక్క ఒకేసారి మే 31న రోజు చాలా సినిమాలు విడుదలకి పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం, సినిమాలన్నీ నిరవధికంగా వాయిదా పడే అవకాశం వుంది అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. (According to a source, 144 Section may impose in Andhra Pradesh few days before and after counting)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. వైస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం లను ద్వంశం చేసిన వీడియో బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్నికల సంఘం అతనిపై చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే అరెస్టు చెయ్యాలని కూడా పోలీసులకి ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ రోజు ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగి, హింస చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. (If Section 144 implemented in Andhra Pradesh in the coming days, it may affect the upcoming film releases, says source)
తాజాగా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆంధ్రాలో కౌంటింగ్ జరిగే రోజు, ఆ తరువాత కూడా అల్లర్లు జరగ వచ్చని చెప్పినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడా చెదురుమదురు అల్లారు జరిగాయని, కౌంటింగ్ రోజు, ఆ తరువాత కూడా అల్లర్లు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పినట్టుగా చర్చ జరుగుతోంది. అందుకని కౌంటింగ్ జరిగే రెండురోజుల ముందు నుండీ, కౌంటింగ్ అయ్యాక కొన్ని రోజుల వరకు ఆంధ్ర ప్రదేశ్ లో 144 సెక్షన్ విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఆ సెక్షన్ అమలు జరిపితే సినిమా హాల్స్ కూడా మూతపడే అవకాశం ఉందని, అందుకని సినిమాలు ఆడే ప్రసక్తి ఉండదు కాబట్టి, కొన్ని రోజులు సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తోంది.
ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలలో కొన్ని చిన్న సినిమాలు కూడా ఉండటంతో అవి ఒక్క తెలంగాణ ప్రాంతంలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విడుదలవ్వాలని, ఒక్క తెలంగాణా ప్రాంతంలో విడుదల చేస్తే నిర్మాతకి లాభం ఉండదని, రెండు రాష్ట్రాల్లో ఒకేసారి విడుదలైతే బాగుంటుంది అని ఇంకొందరి చర్చ. రానున్న రోజుల్లో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం వుంది అని తెలుస్తోంది.