Akhanda: బాలకృష్ణ, బోయపాటి 'అఖండ 2' నిర్మాత అతనేనా?
ABN, Publish Date - Feb 07 , 2024 | 10:51 AM
బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న 'అఖండ 2' సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఉండొచ్చు అని ఒక టాక్ నడుస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది అని కూడా అంటున్నారు
నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో 'అఖండ' సినిమాకి సీక్వెల్ తీస్తాము అని ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడు ఉండొచ్చు, నిర్మాత ఎవరు అనే విషయం మాత్రం అధికారికంగా తెలియలేదు. కానీ 'అఖండ' కి సీక్వెల్ ఉంటుంది అనే విషయం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఎవరు నిర్మాత అనే విషయం చూచాయగా తెలియవచ్చింది అని అంటున్నారు.
కొన్ని రోజుల క్రితం గీతం ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తమ బ్యానర్ లో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నారు అని ప్రకటించారు. అయితే అప్పుడు అందరూ అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉంటుంది అని అనుకున్నారు. ఎందుకంటే బోయపాటి, అల్లు అర్జున్ ఇంతకు ముందు 'సరైనోడు' అనే ఒక పెద్ద విజయవంతమైన సినిమా చేశారు. మళ్ళీ ఆ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చు అని అనుకున్నారు.
కానీ ఆ సినిమా అల్లు అర్జున్ తో కాదు, నందమూరి బాలకృష్ణ తో 'అఖండ' పార్టు 2 అని అంటున్నారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ఆహా ఛానెల్ కోసం ఒక రియాలిటీ షో 'అన్ స్టాపబుల్' చేసిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సారధ్యంలో వున్న ఈ ఛానల్ కి బాలకృష్ణ షో వలన ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అప్పటి నుండి అల్లు అరవింద్, బాలకృష్ణ మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది అనే విషయం కూడా తెలిసిన విషయమే. ఈ స్నేహబంధంతోనే బోయపాటి, బాలకృష్ణ సినిమాని అల్లు అరవింద్ తమ నిర్మాణ సంస్థలో చెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న సినిమా తరువాత ఉండొచ్చు అని కూడా అంటున్నారు.