Vidudala Part2: విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 2’ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Dec 20 , 2024 | 08:19 PM
‘విడుదల పార్ట్ 1’కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘విడుదల పార్ట్ 2’. వెట్రిమారన్ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..
సినిమా రివ్యూ: విడుదల పార్ట్-2
విడుదల తేది: 20–12–2024
నటీనటులు: విజయ్‌సేతుపతి, మంజు వారియర్, సూరి, కన్నడ కిషోర్, గౌతమ్ మేనన్, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మేనన్, బోస్ వెంకట్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.వేల్‌రాజ్
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: చింతపల్లి రామారావు
దర్శకత్వం: వెట్రిమారన్
విజయ్ సేతుపతి కథ ఎంపిక వినూత్నంగా ఉంటుంది. సెలెక్టివ్‌గా వెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన ‘మహారాజా’ విజయోత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం ‘విడుదల పార్ట్ 2’. గతంలో సూపర్ హిట్టైన ‘విడుదల పార్ట్ 1’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. వెట్రిమారన్ దర్శకుడు. పార్ట్ 2లో దర్శకుడు ఏం చెప్పారు. సినీ ప్రియులను ఏమాత్రం ఈ సినిమా అలరించిందో చూద్దాం.
కథ:
కానిస్టేబుల్ కుమరేశన్ (సూరి) ఇచ్చిన క్లూతో ప్రజాదళం నాయకుడు, నక్సల్ పెరుమాళ్ అలియాస్ మాస్టార్ (విజయ్ సేతుపతి)ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ‘విడుదల 1’ చిత్రం ముగిసింది. అక్కడి నుంచే రెండో పార్ట్ కథ మొదలైంది. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు పెరుమాళ్ జమిందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాల్ని అడ్డుకునే క్రమంలో దళ నాయకుడిగా ఎలా మారాడు? ఈ ఉద్యమ ప్రయాణంలో మహాలక్ష్మి (మంజు వారియర్)తో పరిచయం, ప్రేమ తనని ఎటువైపు నడిపించింది. అహింసను ఇష్టపడే పెరుమాళ్ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? నీతి నిజాయితీలతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించే పెరుమాళ్‌ను పట్టించినందుకు కానిస్టేబుల్ సూరికి ఎలాంటి ఫలితం దక్కిందనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
విశ్లేషణ:
‘విడుదల పార్ట్ 1’కు కొనసాగింపుగా దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి భాగం సూరి కోణంలో సాగితే రెండో పార్ట్ పెరుమాళ్ ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో సాగింది. పోలీసు కస్టడీలో ఉన్న ఆయన డీఎస్పీ సునీల్‌కు తన కథ చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అప్పట్లో జమిందారీ వ్యవస్థ అణగారిన వర్గాల్ని ఎలా దోచుకుంది? ఎలాంటి అకృత్యాలకు పాల్పడిందనేది కరప్పన్ అనే కుర్రాడి ఎపిసోడ్‌తో చూపించారు దర్శకుడు వెట్రిమారన్. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టార్‌గా ఉన్న పెరుమాళ్‌ను ఉద్యమం వైపు అడుగులు వేయించేలా చేసిన ఎపిసోడ్ ఇందులో ముఖ్యమైన అంశం. కమ్యునిస్టు ఉద్యమాలు ఎలా మొదలవుతాయి? వారి పంథా, సిద్థాంతం ఏం చెబుతుంది? ఈ ఉద్యమ ప్రయాణంలో కుటుంబాల్ని పణంగా పెట్టి ఉద్యమకారులు చేసే పోరాటాన్ని చాలా లోతుగా, వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయాణంలో మహాలక్ష్మితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం నుంచి కథ నెమ్మదిగా సాగుతుంది. విరామానికి ముందు తన మిత్రుడు కె.కె హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు పెరుమాళ్ కత్తి పట్టి తన ఉద్యమాన్ని హింసాత్మక బాట పట్టించడం.. ఈ క్రమంలో ఆ హత్యకు పాల్పడిన జమిందారుల్ని, అధికారుల్ని తను వేటాడి చంపే తీరు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ద్వితీయార్థమంతా కథ దాదాపుగా వర్తమానంలోనే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబోడిచేలా ఉండటంతోపాటు హృదయాన్ని బరువెక్కిస్తాయి. పెరుమాళ్‌ను అడవి గుండా సరిహద్దు చెక్‌పోస్ట్‌కు తరలించే క్రమంలో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు ఒకవైపు.. అతన్ని తప్పించేందుకు ప్రజాదళం సభ్యులు వేసే పైఎత్తులు మరోవైపు చూపిస్తూ ద్వితీయార్థం సాగుతుంది. అయితే కథలో ఊహించని మలుపులేవీ కనిపించకపోవడంతో.. కథనమంతా నెమ్మదిగా అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. పోలీసులకు, దళ సభ్యులకు మధ్య కాల్పుల ఎపిసోడ్ విసుగు తెప్పిస్తుంది. అయితే పతాక సన్నివేశాల్లో ఇంటెన్సిటీ ఉంటుంది. కాకపోతే పార్ట్ 3 కోసం కథను అసంపూర్ణంగా క్లోజ్ చేయడం అంత సంతృప్తిగా లేదనిపిస్తుంది.
Also Read-UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పెరుమాళ్‌గా నేచురల్‌గా నటించారు. ఆద్యంతం నటనతో మెప్పించారు. వన్ మ్యాన్ షో అన్నట్లు సహజమైన నటనతో విజృంభించారు. ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఆయన పాత్రలోని వీరత్వం పతాక స్థ్థాయిలో కనిపిస్తుంది. జమిందారీ కుటుంబంలో పుట్టినా అణగారిన వర్గాల కోసం పోరాడే యువతిగా మహాలక్ష్మిగా మంజు వారియర్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్‌తో ఆమె లవ్ ట్రాక్ చాలా బావుంది. కుమరేశన్ పాత్రలో సూరి నటన ఆకట్టుకున్నా.. ఈ కథలో ఆ పాత్రకు సరైన ఇంపార్టెన్స్ దక్కలేదు. పతాక సన్నివేశాల్లో తన నటన మనసుల్ని హత్తుకుంటుంది. గౌతమ్ మేనన్, కన్నడ కిషోర్, రాజీవ్ మేనన్ తదితరులు బాగానే చేశారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం ఎసెట్‌గా నిలిచింది. నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ. వేల్‌రాజ్ విజువల్స్ సినిమాకి ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బావున్నాయి. వెట్రిమారన్ రాసుకున్న కథను వాస్తవికంగా కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు బాగుంది కానీ కథనం స్లోగా ఉండటంతో కాస్త విసుగు కలిగిస్తుంది.