Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే...
ABN, Publish Date - Jun 14 , 2024 | 11:02 AM
విజయ్ సేతుపతికి ఒక్క తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ అభిమానులు వున్నారు. వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంతుకుంటూ వస్తున్న అతను అతన 50 వ సినిమా 'మహారాజ' తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
నటీనటులు: విజయ్ సేతుపతి, భారతి రాజా, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, మునిష్ కాంత్, నటరాజ్ తదితరులు
ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్
సంగీతం: అజనీష్ లోకనాథ్
నిర్మాతలు: సుదర్శన్ సుందరమ్, జగదీశ్ పళనిస్వామి
రచన, దర్శకత్వం: నిథిలన్ స్వామినాథన్
విడుదల: జూన్ 14, 2024
రేటింగ్: 3 (మూడు)
-- సురేష్ కవిరాయని
భారత దేశంలో విజయ్ సేతుపతి ఉన్నతమైన నటుల్లో ఒకరు. అతను కథానాయకుడిగా మాత్రమే చెయ్యాలి అని కాకుండా, సినిమాలో తనకెటువంటి పాత్ర ఇచ్చినా, ఆ పాత్రకి పూర్తి న్యాయం చెయ్యడమే కాకుండా, అందులో తన ప్రతిభని చూపించగల నటుడు. అటువంటి విజయ్ సేతుపతి తన 50వ సినిమా 'మహారాజ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక్క తమిళంలోనే కాకుండా, విజయ్ సేతుపతికి అన్ని భాషల్లోనూ అభిమానులు వున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ 'మహారాజ' సినిమా ఎలా వుందో చూద్దాం. (Maharaja Movie Review)
Maharaja Story కథ:
మహారాజ (విజయ్ సేతుపతి) చెన్నైకి దగ్గరలో నివసిస్తూ ఉంటాడు, అతని వృత్తి బార్బర్. భార్యని ఒక ప్రమాదంలో పోగొట్టుకుంటాడు, టీనేజ్ లో వుండే కుమార్తె జ్యోతితో తన వృత్తిపై వచ్చే సంపాదనతో జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు అతను తన లక్ష్మిని ముగ్గురు దుండగలు తన ఇంటికి వచ్చి ఎత్తుకుపోయారని పోలీసు స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళతాడు. పోలీసులు లక్ష్మి అంటే అమ్మాయి అనుకుంటారు, కానీ అది ఒక ఇనప డస్ట్ బిన్. ఆ డస్ట్ బిన్ వల్లే తన కుమార్తె సేవ్ అయింది అని, అందుకని అది తన ఇంట్లో ప్రత్యేకమని చెపుతాడు మహారాజ. పోలీసులు మొదట్లో అతన్ని ఒక పిచ్చివాడిగా చూసి, బైటకి పంపడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మహారాజ పోలీసులకి లక్షల రూపాయలు లంచం ఆశ చూపి, ఎలా అయినా తన లక్ష్మిని వెతికి పట్టుకోవాలని ప్రాధేయపడతాడు. నవ్వులాటగా తీసుకున్న పోలీసులు మహారాజ లక్షలు ఆశ చూపించేసరికి, ఆ డస్ట్ బిన్ లో ఇంకేదో రహస్యం వుంది అని పరిశోధనలు మొదలుపెడతారు. ఆ పరిశోధనలో ఏమి తేలింది? మహారాజ ఎందుకు ఆ డస్ట్ బిన్ కోసం అంతగా ప్రాధేయపడతాడు? మహారాజ ఇంటికి వచ్చి అతన్ని కొట్టిన ఆ ముగ్గురు ఎవరు? ఇంతకీ లక్షి వెనకాల వున్న రహస్యం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే 'మహారాజ' సినిమా చూడాల్సిందే. (Vijay Sethupathi starrer Maharaja Movie Review)
విశ్లేషణ:
విజయ్ సేతుపతి ప్రతిభావంతమైన నటుడు, అతను ఎటువంటి సినిమా చేసినా, ప్రేక్షకుల్లో చాల ఆసక్తి ఉంటుంది, ఎందుకంటే అతను వైవిధ్యం వుండే కథలు, పాత్రలను ఎంచుకుంటాడు. ఇప్పుడు ఈ 'మహారాజ' కూడా అటువంటి సినిమానే. ఈ సినిమా ఎక్కువగా కథనంపైనే ఆధారపడి ఉంటుంది. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ కథని విభిన్న తరహాలో తెరపై నేరేట్ చేశాడు. సినిమా చివరి దశకు వస్తూ ఉండేసరికి ప్రేక్షకుడికి ఒక్కసారిగా కథలో విషయం అర్థమై ఆశ్చర్యానికి లోనవుతారు. (Maharaja Movie Review)
మహారాజ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి పోలీసు స్టేషన్ కి రావటం తన లక్ష్మిని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పటం, ఎలా అయినా అది తెచ్చిపెట్టాలని పోలీసు స్టేషన్ లో తిష్ట వెయ్యటం ఇవన్నీ దర్శకుడు బాగా నడిపించాడు. స్టేషన్ లో కొన్ని సన్నివేశాలు సీరియస్ గా వున్నా, చూస్తున్న ప్రేక్షకుడికి చిన్న వినోదం కూడా కనపడుతుంది. అదే సమయంలో సెల్వం (అనురాగ్ కశ్యప్) అతని స్నేహితుడు ఇద్దరూ కలిపి దొంగతనాలు చెయ్యడం, దొంగతనం చేసిన ఇంట్లో వాళ్ళని హత్య చెయ్యడం చూపిస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఒక కౌన్సిలర్ తన కారు సర్వీసింగ్ కి ఇచ్చినప్పుడు ఆ కారులో తన కూలింగ్ గ్లాస్సెస్ మర్చిపోతే అవి మెకానిక్ తీసేశాడు అని ఆ కారు సర్వీసింగ్ చేసే మెకానిక్ ని చితకబాదతాడు. ఆ కళ్లద్దాలు తన భార్యకి ఒక నటుడు బహుమతిగా ఇచ్చినట్టు చెపుతాడు.
ఇలా మూడు కథనాలు దర్శకుడు చూపిస్తూ వుంటారు, ఇంకో పక్క ప్రేక్షకుడికి అసలు ఆ డస్ట్ బిన్ లో ఏముందో అనే ఆసక్తి కనపరుస్తాడు దర్శకుడు. ఆ డస్ట్ బిన్ వెనకాల నిజంగా ఏమైనా కథ ఉందా, లేక అది కేవలం కథకి ఉపయోగపడేట్టు దర్శకుడు వాడుకున్నాడా అన్నది చివరివరకు చూస్తే కానీ తెలియదు. దర్శకుడు సినిమాలో భావోద్వేగాలకు కూడా చాల పెద్దపీట వేశాడు. కథ మామూలుగా వెళుతున్నా, విజయ సేతుపతి, కుమార్తె మధ్య వచ్చే సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగా చూపించాడు. ఈ సినిమాకి కథ, కథనంతో పాటు ఆయా పాత్రల్లో నటులందరూ మంచి నటన ప్రదర్శించడం చాలా హెల్ప్ అయింది అని చెప్పాలి. నేపధ్య సంగీతం ఈ సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది.
హిందీ చిత్రాల దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని ఇందులో ఒక దోపిడీ దొంగగా దర్శకుడు చూపించాడు కానీ, అతనికి బదులు ఎవరైనా తెలుగు, తమిళ నటుడిని తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. విజయ్ సేతుపతి మరోసారి ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, ఈ సినిమా క్రెడిట్ చాలా భాగం దర్శకుడుకి ఇవ్వాలి, ఎందుకంటే అతని కథని నడిపించే తీరు, చెప్పే విధానం ఆసక్తిగా ఉంటుంది. ఛాయాగ్రహణం కూడా బాగుంది. పతాక సన్నివేశాలు అయ్యాక ప్రేక్షకుడికి ఇది ఒక రివెంజ్ కథగా కూడా అనిపిస్తుంది. అలాగే మమతా మోహన్ దాస్ పాత్ర సరిగ్గా చూపించలేకపోయారు దర్శకుడు, అలాగే అక్కడక్కడా కొంచెం సాగదీసే సన్నివేశాలున్నాయి, ఉదాహారానికి స్టేషన్ లో చెప్పిందే చెప్పటం.
ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఉత్తమ నటుడు అని మరోసారి నిరూపించుకున్నాడు. అతన్ని వెండితెరపై చూడగానే ప్రేక్షకుడి మోహంలో ఒక విధమైన చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే అతను తన నటనతో ఆలా మెప్పిస్తాడు, ఈ సినిమాలో కూడా ప్రేక్షకులని నిరాశ పరచకుండా అద్భుతమైన ప్రదర్శన కనిపించాడు. ఇంతకు ముందు 'ఉప్పెన' లాంటి సినిమాలో కథానాయకురాలికి తండ్రిగా నటించి మెప్పించాడు, ఇప్పుడు ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించి మెప్పించాడు. ఒక పక్క అమాయకంగా కనపడుతూనే, ఇంకో పక్క తనకి కోపం వస్తే ఎలా ఉంటుందో కూడా చూపించాడు. అతని 50వ సినిమాగా 'మహారాజ' రావటం అతని కెరీర్ లో ఇదొక మంచి సినిమాగా ఉండిపోతుంది. ఇక టీనేజ్ అమ్మాయిగా వేసిన సచన నెమిదాస్ కూడా చక్కని ప్రతిభ కనపరిచింది. పోలీసు ఆఫీసరుగా నటరాజ్ బాగా చేసి చూపించాడు. ఆ పాత్రలో ఇమిడిపోయాడు. మమతా మోహన్ దాస్, అభిరామి తమ పాత్రల పరిధి మేరకు చేశారు. అనురాగ్ కశ్యప్ కూడా పరవాలేదు అనిపించాడు.
చివరగా, 'మహారాజ' సినిమా అంతా కథనంపైనే (స్క్రీన్ ప్లే) ఆధారపడి తీసిన సినిమా. మొదట్లో నేరేషన్ కొంచెం స్లో గా వున్నా, రాను రాను ప్రేక్షకుడికి ఆసక్తిని పెంచుకుంటూ వెళుతుంది. విజయ్ సేతుపతి నటన, నేపధ్య సంగీతం, పతాక సన్నివేశాలు, ఈ సినిమాకి హైలైట్. సినిమాలో చాలా ఎక్కువ హింస ఉంటుంది, అది తగ్గిస్తే బాగుండేది.