Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ 'వేట్టయన్... ది హంటర్' ఎలా ఉందంటే..
ABN, Publish Date - Oct 10 , 2024 | 04:00 PM
రజనీకాంత్ నటించిన యాక్షన్ చిత్రం 'వేట్టయన్... ది హంటర్' దసరా కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
సినిమా రివ్యూ: వేట్టయన్... ది హంటర్ (Vettaiyan review)
విడుదల తేదీ: 10–10–2024
నటీనటులు: రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, కిశోర్, రితికా సింగ్, దుషారా విజయన్, అభిరామి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్ కథిర్
సంగీతం: అనిరుధ్ (Anirudh)
ఎడిటింగ్: ఫిలోమెన్ రాజ్
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్, సుభాస్కరన్ (Subhaskaran)
దర్శకుడు: టి.జె.జ్ఞానవేల్ (T.E. Gnanavel raja)
'జైలర్'తో సూపర్ సక్సెస్ అందుకున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. తదుపరి చిత్రం 'లాల్ సలామ్' కాస్త నిరూత్సాహ పరిచినా.. అభిమానులకు 'వేట్టయాన్’తో (vettaiyan review) రెట్టింపు ఉత్సాహం ఇస్తానని మాటిచ్చారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఆయన నటించిన ఈ చిత్రానికి 'జైభీమ్' చిత్రంతో ప్రశంసలు అందుకున్న టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. 'గురి పెడితే.. ఎర పడాల్సింటే' అంటూ డైలాగ్‌లతో అలరించిన తలైవా.. భారీ అంచనాల మధ్య వేట్టయాన్‌గా గురువారం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేట్టయాన్ – ది హంటర్ గా వచ్చిన ఈ చిత్రం తలైవాకు హిట్ ఇచ్చిందా లేదా చూద్దాం.
కథ: (Vettaiyan - The Hunter Movie Review)
అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా ఉద్యోగం చేస్తారు. తప్పు చేశారని తేలితే ఎన్‌కౌంటర్ పక్కా. చిన్న పిల్లలకు చదువు ముఖ్యం, అని పేద విద్యార్ధుల పాలిట నిలబడే స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్). తను పని చేసే స్కూలో ప్రాంగణంలో గంజాయి మాఫియా ఉందని తెలుసుకుని ఫవర్‌ఫుల్ ఆఫీసర్ అయిన అదియన్‌కు లేఖ రాస్తుంది. ఆ సమస్య తొలగిపోయి శరణ్యకు ప్రశంసలు దక్కుతాయి. తను కోరుకున్న చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ తనను కిరాతకంగా మానభంగం చేసి చంపుతారు. శరణ్య చావుకి కారణం ఎవరు? నాట్స్ ఇన్‌స్టిట్యూట్‌కి శరణ్య మరణానికి ఉన్న సంబంధం ఏంటి. గుణ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ అదియన్ చేతిలో ఎందుకు ఎన్‌కౌంటర్ అయ్యాడు. దానిపై న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్ -Amitab bachchan)) నేతృత్వంలో విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు. అదియన్ జీవితంలో, శరణ్య మర్డర్ కేసులో బ్యాటరీ అలియాస్ ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా ) ఏసీపీ రూప కిరణ్ పాత్రలు ఏంటి? అన్యాయంగా మరణించిన శరణ్య, గుణలకు న్యాయం జరిగిందా లేదా అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
మానవ హక్కులను కాపాడాలి, నిందుతులకు ఎన్‌కౌంటర్ అనేది సరైన మార్గం కాదు, ప్రతి నిందితుడి వెనుక రెండో కోణం ఉంటుంది దాన్ని పట్టుకోవాలి అన్న అంశం చుట్టూ తిరిగే పోలీస్ స్టోరీ ఇది. అయితే 'జై భీమ్' లాంటి క్లాస్ సినిమా తీసిన టి.జె. జ్ఞానవేల్ మాస్‌కి కేరాఫ్ అయిన రజినీతో ఎలాంటి సినిమా తీస్తారోనని మొదటి నుంచి ప్రేక్షకులు అనుకుంటున్న మాట. ట్రైలర్‌లో యాక్షన్ ఆకట్టుకున్నా సాధారణంగా సాగే పోలీస్ స్టోరీ అనే భావించారు. ఆ తర్వాత కథను ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వైపు మళ్లించాడు. అయితే దాన్ని బేస్ చేసి దర్శకుడు దీనిలో సందేశం ఇచ్చారు. ఈ కథలో శరణ్య మర్దర్ కేస్‌లో మెయిన్ పాయింట్ అని ప్రథమార్థంలో సగం చూసే సరికి 'ఇంతేగా ఇంకేం ఉంది’ అని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ తర్వాత ఇంకేదో ఉందనే విషయం, ఆ మర్డర్ వెనుక పెద్ద కథ, చదువుతో వ్యాపారం చేసే తిమింగలాలు ఉన్నాయని, ప్రస్తుతం స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నారు? విద్య పేరుతో తాము చేస్తున్న వ్యాపారానికి అడ్డొస్తే ఏం చేస్తున్నారు? అనేది మెయిన్ థీమ్ అని ఒక్కొక్కటిగా రివీల్ చేసిన విధానంతో దర్శకుడు కాస్త ఆసక్తి కలిగించారు. శరణ్య మర్దర్ కేసు తెరపైకి వచ్చాక అసలు కథ రివీల్ అయింది. అప్పటి దాకా సినిమా కాస్త స్లోగా సాగింది. స్ర్కీన్‌ప్లేలో వేగం లేదు. ముందు ఏం జరగబోతుందో ఊహించేలా ఉంది. కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా పోలికలు ఉన్నాయి. అధియన్, సత్యదేవ్ పాత్రల మధ్య సంఘర్షణ బలంగా ఉంటుంది అనుకుంటే సాదాసీదాగా సాగించారు.
నటీనటుల విషయానికొస్తే.. రజనికాంత్ నటనకు పేరు పెట్టడం అంత సులభం కాదు. వయసు మీద పడినా ఆయన నటన, మ్యానరిజం, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎలాంటి మార్పు లేదు. రజినీ తెరపై కనిపించిన ప్రతిసారీ లుక్ ఆయనపై తప్ప మరొకరిపైకి వెళ్లదు. అయితే జైలర్‌తో కంపేర్ చేస్తే ఇందులో హీరోయిజం తక్కువే. డాన్స్, ఫైట్స్ విషయంలో కూడా వయసురీత్యా ఆయన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇంట్రడక్షన్ సాంగ్‌లో సింపుల్ స్టెప్పులు వేయించారు. ఫైట్స్‌లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని తీర్చిదిద్దారు. ఆయనకు సతీమణిగా నటించిన మంజు వారియర్ పాత్ర చిన్నదే అయినా పాత్ర మేరకు అభినయించారు. మానవహక్కుల్ని కాపాడే న్యాయవాది సత్యదేవ్‌గా అమితాబ్ బచ్చన్ పాత్రకు వన్నె తెచ్చారు. అదియన్‌కు ఇన్‌ఫార్మర్‌గా బ్యాటరీ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నవ్విస్తూనే కథను ముందుకు నడిపించారు. విద్యను వ్యాపారంగా భావించి, డబ్బే ముఖ్యం అని భావించి ఎంతో మంది యువత మరణాలకు కారణమైన నటరాజ్ పాత్రలో ఇమిడిపోయారు. రజనీకి ధీటైన విలన్‌గా నిలబడ్డారు. రోహిణి, రావు రమేష్, సుప్రీత్ రెడ్డి మిగతా పాత్రధారులు పరిధిమేరకు నటించారు. కిషోర్, రితికా సింగ్ కీ రోల్ పోషించారు. స్కూల్ టీచర్‌గా దుషార విజయన్ పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక విభాగానికి వస్తే.. సినిమాటోగ్రఫర్ ఎస్.ఆర్ కతీర్ క్వాలిటీ ప్రాడక్ట్ ఇచ్చారు. అనిరుధ్ సంగీతం సినిమాకు ఎసెట్. రజనీకాంత్ సినిమాకు ఎలాంటి ఆర్‌ఆర్ బావుంటుందో అలా ఇచ్చాడు. రజనీ ఎలివేషన్ షాట్స్ వచ్చిన ప్రతిసారీ గూస్‌బంప్స్ వచ్చేలా బీజీఎం ఇచ్చాడు. ఆర్టిస్ట్‌ల కాంబినేషన్ నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చేదాకా లైకా ప్రొడక్షన్స్ కాంప్రమైజ్ కాలేదు. ఎడిటర్ ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేసుకుంటే బావుండేది, సినిమా ఇచ్చిన సందేశాలు కాస్త క్రిస్ప్‌గా ఉంటే సినిమా రన్ షార్ప్‌గా ఉండేది. ుగురి పెడితే.. ఎర పడాల్సింటే’, ‘పెళ్ళాం మొగుడు మాట వింటుందా?’ అంటూ రజినీ చెప్పే డైలాగ్‌లు విజిల్స్ వేయిస్తుంది.
మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లో మాస్, మూమెంట్స్, కమర్షియాలిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి చిత్రాలు అరుదు. దర్శకుడు రచన మీద కూడా దృష్టి పెడితే ఆ తరహా చిత్రాలు వస్తాయనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. రజినీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు ప్లస్ అయ్యాయి. దానికి తోడు తలైవా అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. విద్యావ్యవస్థ గురించి ఇచ్చిన సందేశం అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది.
ట్యాగ్‌లైన్: వేట్టయాన్ గురి పెడితే.. ప్రేక్షకులు పడాల్సిందే!