Udvegam Review: కోర్ట్ రూమ్ డ్రామా.. ఉద్వేగం ఎలా ఉందంటే..
ABN, Publish Date - Nov 29 , 2024 | 10:12 PM
త్రిగుణ్ (Trigun) హీరోగా హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి చక్కని అవకాశాలు అందుకుంటున్నా.. ఒకటి రెండు మినహా పెద్దగా విజయం సాధించలేదు. ఎంచుకునే కథలు ఇన్నోవేటివ్‌గా ఉన్నా.. ఎక్కడో మిస్ ఫైర్ అవుతున్నాయి.
సినిమా రివ్యూ: ఉద్వేగం (Udvegam Review)
విడుదల తేది: 29–11–2024
నటీనటులు: త్రిగుణ్,Trigun)దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి (Mahipal Reddy)
త్రిగుణ్ (Trigun) హీరోగా హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి చక్కని అవకాశాలు అందుకుంటున్నా.. ఒకటి రెండు మినహా పెద్దగా విజయం సాధించలేదు. ఎంచుకునే కథలు ఇన్నోవేటివ్‌గా ఉన్నా.. ఎక్కడో మిస్ ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఆయన నటించిన ఉద్వేగం చిత్రంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. కోర్ట్ రూమ్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రమోషనల్ కార్యక్రమాల్లో నమ్మకం వ్యక్తం చేశారు. మరీ చిత్రం ఏ మేరకు విజయం సాధించింది? త్రిగుణ్ నమ్మకం నిజమైందా?
కథ: (Udvegam)
మహీంద్రా (త్రిగుణ్) ఓ న్యాయవాది. క్రిమినల్ కేసులు వాధించడంలో దిట్ట. కేసులుంటే కోర్టుకు వెళ్లడం లేదంటే ప్రియురాలు అమ్ములు (దీప్సిక)తో గడపడం. ఇదే అతని దినచర్య. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో , ఓ గ్యాంగ్ రేప్ కేసు మహీంద్రా దగ్గరకు వస్తుంది. మొదట ఈ కేసు వాదించేందుకు మహీంద్రా నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ కేసును టేకప్ చేస్తాడు. ఆ కేసులో ఏ2 అయిన సంపత్ తరపున వాదించేందుకు మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ప్రత్యర్థుల తరపున వాదించేందుకు సీనియర్ లాయర్ ప్రసాద్(శ్రీకాంత్ అయ్యంగార్) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ రేప్ మహీంద్రా జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? ఫైనల్‌గా ఎవరు గెలిచారు అనేది కుప్తంగా సినిమా కథ.
విశ్లేషణ: (Udvegam Review)
కోర్టు రూమ్ డ్రామాలు తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. ఈ జానర్ సినిమాలో ఎక్కువశాతం హీరో అన్యాయానికి గురైన వారి తరఫునే ఉంటాడు. కానీ ఈ సినిమాలో హీరో బాధిత అమ్మాయిల తరపున కాకుండా నిందితుడి తరపున వాదిస్తాడు. అదే ఈ సినిమాలో కాస్త కొత్త పాయింట్. ఎంచుకున్న పాయింట్‌పై దర్శకుడు బాగానే కసరత్తు చేశాడు. సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉంది. 20 నిమిషాలకు గానీ కథలోకి వెళ్లలేదు. హీరో చేతికి గ్యాంగ్ రేప్ కేసు వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్‌లు ఆకట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాటిక్‌గా, వాస్తవికతకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎదురెదురు పోటాపోటీగా వాదించుకునే శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. ఇ సినిమా నిడివి తక్కువ కావడం సినిమాకు కాస్త ప్లస్ అయింది. లాయర్ మహీంద్రగా త్రిగుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్ర ఫర్వాలేదు. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ర్టీ బాగా కుదిరింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ తన మార్క్ నటనతో అలరించారు. న్యాయనిర్ణేతగా సీనియర్ నటుడు సురేష్ చక్కని నటన కనబర్చారు. ఆయన పాత్ర చక్కని హాస్యాన్ని పంచింది. లాయర్ ప్రసాద్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ పరిధి మేరకు నటించారు. సీనియర్ నటుడు శివకృష్ణ తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చిన్న బడ్జెట్ చిత్రమైనా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తిక్ కొడగండ్ల సంగీతం బాగుంది. జి.వి.అజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవలసింది. అయితే కోర్ట్ రూమ్ డ్రామాను ఇంకా బాగా తెరకెక్కించవచ్చు. దర్శకుడు తన పరిధిలో బాగానే చేశారు. కథ థీమ్ కొత్తదే కానీ తెరకెక్కించే విధానంలో కొత్తదనంగా ఆలోచించి, ఇంకాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కమర్షియాలిటీ జోడించి ఉంటే రిజల్ట్ మరింత బావుండేది.
ట్యాగ్‌లైన్: ఉద్వేగభరిత కోర్ట్ రూమ్ డ్రామా