ARM Movie Review: టోవినో థామస్ నటించిన యాక్షన్ డ్రామా 'ఎఆర్‌ఎం' ఎలా ఉందంటే..

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:04 PM

మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన యాక్షన్ డ్రామా 'ఎఆర్‌ఎం' ఎలా ఉందంటే..

సినిమా రివ్యూ: ఎఆర్‌ఎం (అజయంతే రంధం మోషణమ్‌ - ARM)
విడుదల తేది:12–9–2024
నటీనటులు: టొవినో థామస్‌, కృతీశెట్టి, ఐశ్వర్యా రాజేశ్‌, సురభి లక్ష్మీ, రోహిణి, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు


సాంకేతిక నిపుణులు:
రచన–స్ర్కీన్‌ప్లే: సుజిత్‌ నంబియార్‌, దీపు ప్రదీప్‌,
సినిమాటోగ్రఫీ: జమన్‌ జె. జాన్‌,
సంగీతం: డిబు నినన్‌ థామస్‌,
ఎడిటింగ్‌: షమీర్‌ మొహ్మద్‌
నిర్మాతలు: లిస్టన్‌ స్టీఫెన్‌, జకారియా, థామస్‌,
తెలుగు విడుదల! మైత్రీ మూవీ మేకర్స్‌
దర్శకత్వం: జతిన్‌ లాల్‌


మలయాళ నటుడు టొవినో థామస్‌ గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై విజయం సాధించగా, చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. లూసిఫర్‌లో మోహన్‌లాల్‌కి తమ్ముడిగా, కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ‘2018’ చిత్రంతో అలరించాడు. 2021లో వచ్చిన 'మిన్నల్‌ మురళీ’ చిత్రంతో మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా టోవినో థామస్‌ (Tovino Thomas) నటించిన కొత్త సినిమా ‘ఏఆర్‌ఎమ్‌’ మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. టొవినో నటించిన 50వ చిత్రమిది. దీని కోసం తెలుగులోనూ ప్రమోషన్స్‌ బాగా చేశారు. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:(Ajayante Randam Moshanam Review)

అజయన్‌ (టోవినో థామస్‌) చియోతికావు ఊరిలో ఓ ఎలక్ర్టీషియన్‌. తన తాత మణియన్‌ చేసిన దొంగతనం తర్వాతి తరమైన అజయన్‌కు చుట్టుకుంటుంది. ఆ కారణంగా అతనికీ, అతని కుటుంబానికి  ఆ గ్రామంలో గౌరవం ఇవ్వరు. ఊరిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు అజయ్‌ని అనుమానిస్తారు. కింజు కేలు (టోవినో థామస్‌) ధైర్య సాహసాలను మెచ్చి ఎడక్కల్‌ మహారాజు బహుమతిగా ఇచ్చిన మహిమాన్వితమైన శ్రీభూతి దీపం (అమ్మవారి ప్రతిమ) అజయ్‌ ఊరిలో ఉంటుంది((ARM Review). ఉత్సవాలు ప్రారంభం కావడానికి పది రోజులు ముందు అమ్మవారి విగ్రహాన్ని ఒకరు దొంగిలిస్తారు. ఆ దొంగతనం అజయ్‌ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తారు. నిజమైన విగ్రహం ఎక్కడ ఉంది? మణియన్‌, కేలు ఏం చేశారు? ఊరిలో అసలు దొంగ ఎవరు? మరో పక్క గ్రామ పెద్ద అయిన పరము నంబియార్‌ కూతుర్ని అజయ్‌ ప్రేమిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న నంబియార్‌ తక్కువ కులస్తుడైన అజయన్‌ తన బిడ్డను ప్రేమించడంపై పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు. ఊరి ప్రజలు  తమను గౌరవంగా చూడాలనే అజయన్‌ తల్లి (రోహిణి) కోరిక నెరవేరిందా? లేదా? ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీగా చేయడానికి సుదేవ్‌ వర్మ (హరీష్‌ ఉత్తమన్‌) ఎందుకు వచ్చాడు? అతని రాకకు కారణమేంటి? అన్నది కథ.


విశ్లేషణ: (ARM Review)
‘ఏఆర్‌ఎమ్‌’ (అజయంతే రంధం మోషణమ్‌).. కేలు, మణియన్‌, అజయన్‌ ఇలా మూడు తరాలకు లింక్‌ చేస్తూ తీసిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ఇది. కింజ కేలు అనే యోధుడు తను ఉన్న రాజ్యం పరువును నిలబెట్టినందుకు ఆ రాజ్యపు రాజు ఏం కావాలో కోరుకోమనగా, ఎన్నో ఏళ్ల చరిత్ర గత శ్రీభూతి దీపాన్ని తన గ్రామంలో చూడాలని, ఆ గ్రామస్తులంతా ఆ దీపాన్ని దర్శించుకుని పూజించాలని, తన కోరిక మేరకు ఆ విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వాలని ఎడక్కల్‌ మహారాజును కోరడం ఆ విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ విగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్న దానిపై కథ నడుస్తుంది.  కథ ప్రారంభం సింపుల్‌గా ఉంటుంది. కథ ప్రారంభంలోనే కేలు పాత్ర మరణిస్తుంది. అక్కడి నుంచి తర్వాతి తరమైన మణియన్‌, అజయన్‌ మీద కథ నడుస్తోంది. అసలు ఆ విగ్రహాన్ని అతను ఎందుకు దొంగతనం చేశాడు అన్న అంశాలను ఆసక్తికరంగా చూపించారు. కథలో భాగంగా కుల వివక్ష, ఆ రోజుల్లోనే దేవాలయాల్లోకి తక్కువ కులస్తులకు ప్రవేశం లేదన్న అంఽశాన్ని ఈ చిత్రంలో చెప్పారు. దేవాలయంలో ఉన్నది నకిలీ విగ్రహమని తెలుసుకున్న అజయన్‌ ఒరిజినల్‌ విగ్రహం కోసం చేసిన హంట్‌ బావుంది. అయితే హంటింగ్‌ సన్నివేశాలన్నీ బావున్నప్పటికీ తెలుగులో వచ్చిన 'సాహసం’ చిత్రాన్ని పోలి ఉన్నాయి. మణియన్‌, తన మనవడు అజయన్‌... ఇద్దరికీ సమాజం నుంచి ఒకే రకమైన అనుభవాల్ని ఎదుర్కోవడం ఆ రెండు పాత్రల్ని ఒకే ప్రాంతానికి తీసుకొచ్చే సన్నివేశాల్లో రేకెత్తే సంఘర్షణ హత్తుకుంటుంది. ఆ సన్నివేశాల్లో రోహిణి పలికించిన ఎమోషన్స్‌ అద్భుతమనే చెప్పాలి. గ్రామంలో ఓ కుటుంబాన్ని తక్కువ చేసి పరువు తీశారు అంటే ఆ పరువును తెచ్చుకోవడం కూడా బలంగా ఉండాలి. క్లైమాక్స్‌లో ఒరిజినల్‌ విగ్రహాన్ని అవమానానికి గురైన అజయన్‌ తల్లి తీసుకొచ్చి గుడిలో అప్పగించే సన్నివేశాలు తేలిపోయాయి. ఆ సమయంలో బలమైన సంభాషణలు కూడా రాయలేదు. స్ర్కీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడి ప్రతిభ కనిపించింది. కథ స్లో అవుతున్న ప్రతిసారీ మణియన్‌ పాత్రను తెరపైకి తీసుకొచ్చి గూస్‌బంప్స్‌ వచ్చేలా చేశారు.

ఇక నటీనటుల విషయానికొస్తే మూడు తరాల్లో కేలు, మణియన్‌, అజయన్‌గా టొవిన్‌ థామస్‌ వన్‌మెన్‌ షోలా విజృంభించాడు. పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకున్నాడు. మూడు పాత్రల్లో వేరియేషన్స్‌ బావున్నాయి. సినిమా ప్రారంభంలో కేలుగా టోవినో యుద్ధరంగంలో విన్యాసాలు ఆకట్టుకుంటాయి. మూడు పాత్రల్లోనూ మణియన్‌ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది. లక్ష్మీగా కృతి శెట్టి అందంగా కనిపించారు. చోటి పాత్రలో ఐశ్వర్య రాజేశ్‌ క్షణాలే కనిపించినా ఆకట్టుకుంది. మాణిక్యంగా సురభి లక్ష్మి నటన బావుంది. అజయన్‌ తల్లిగా రోహిణి నటన పర్ఫెక్ట్‌ యాప్ట్‌ అయింది.   సురేష్‌గా బసిల్‌ జోసెఫ్‌  క్యారెక్టర్‌ నవ్విస్తుంది. హరీష్‌ ఉత్తమన్‌, మిగతా నటీనటుల పాత్రలు ఫర్వాలేదనిపించాయి. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ఈ చిత్రానికి బలం సంగీతం. దిబు నినన్‌ థామస్‌ సంగీతం, ఆర్‌ఆర్‌ ఆకట్టుకుంది. జోమోన్‌ టి జాన్‌ కెమెరా వర్క్‌ మెయిన్‌ ఎసెట్‌. రాత్రి సన్నివేశాల్లో కూడా బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చాడు. అడవిలో  ఏరియల్‌ షాట్స్‌ బావున్నాయి. సినిమా కలర్‌ థీమ్‌. లైటింగ్‌ పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యాయి. తెలుగు అనువాదం విషయంలో టైటిళ్లు, సైన్‌ బోర్డ్‌ల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవలసింది. దర్శకుడికిది తొలి చిత్రమే అయినా మూడు తరాలు, మూడు పాత్రలను బాగా బ్యాలెన్స్‌ చేశాడు. ఊహకు అందేలా కథనం ఉండటం కాస్త మైనస్‌ అనుకోవచ్చు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. (Ajayante Randam Moshanam Review)
 
ట్యాగ్‌లైన్‌: టొవినో వన్‌మ్యాన్‌ షో

Updated Date - Sep 12 , 2024 | 07:39 PM