Rathnam Movie Review: విశాల్ నటించిన సినిమా ఎలా ఉందంటే...
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:58 PM
తమిళ దర్శకుడు హరి అనగానే 'సింగం' సినిమాలు గుర్తుకు వస్తాయి. అటువంటి దర్శకుడు ఇప్పుడు విశాల్ తో చేతులు కలిపి 'రత్నం' అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: రత్నం
నటీనటులు: విశాల్, ప్రియ భవానీ శంకర్, సముద్రఖని, యోగిబాబు, మురళి శర్మ, జయప్రకాశ్, విజయ్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ పేరడి, తులసి తదితరులు
ఛాయాగ్రహణం: ఎం సుకుమార్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండియన్
రచన, దర్శకత్వం: హరి
విడుదల తేదీ: ఏప్రిల్ 26, 2024
రేటింగ్: 2 (రెండు)
-- సురేష్ కవిరాయని
గత వారం చాలా చిన్న తెలుగు సినిమాలు విడుదలయ్యాయి, ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు కానీ, విశాల్ నటించిన తమిళ సినిమా 'రత్నం' అదే పేరుతో తెలుగులోకి అనువాదం అయి విడుదలైంది. విశాల్ అటు తమిళ ప్రేక్షకులకి, ఇటు తెలుగు ప్రేక్షకులకి పరిచయం వున్న నటుడు. ఈ సినిమాకి దర్శకుడు హరి, అతను ఇంతకు ముందు సూర్య కథానాయకుడిగా 'సింగం' పేరుతో మూడు సినిమాలు తీసి అద్భుతమైన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అదీ కాకుండా దర్శకుడు హరి ఇంతకు ముందు విశాల్ తో 'భరణి', 'పూజ' అనే సినిమాలు కూడా తీశారు. (Rathnam Movie Review) విక్రమ్ కథానాయకుడిగా కూడా హరి కొన్ని హిట్ సినిమాలు తీశారు, అందుకని ఈ సినిమాపై ప్రేక్షకులకి కొంచెం ఆసక్తి ఏర్పడింది.
Rathnam Movie Story కథ:
ఈ కథ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ బోర్డర్ దగ్గర జరుగుతుంది. ఎంఎల్ఏ పన్నీరుస్వామి (సముద్రఖని) ని మావయ్య అని పిలుస్తూ అతని దగ్గర పనిచేస్తూ ఉంటాడు రత్నం (విశాల్). ఎంఎల్ఏ అండతో ఎటువంటి పనైనా చెయ్యగల సమర్ధుడైన యువకుడు రత్నం, హత్యలు కూడా చేస్తూ ఉంటాడు, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడు. పోలీసులు చెయ్యలేని పనిని తాము చేస్తున్నామని ఎంఎల్ఏ చెపుతూ ఉంటాడు, రత్నానికి ఎటువంటి ఆపద వచ్చినా రక్షిస్తూ ఉంటాడు. అటువంటి రత్నం ఒకసారి మల్లిక (ప్రియ భవానీ శంకర్) అనే అమ్మాయిని చూసి ఆమెని కొంతమంది రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తే కాపాడుతాడు, ఇక అక్కడ నుండి ఆమెని తనే చూసుకుంటాను అని చెప్పి ఆమెకి కాపలాగా ఉంటాడు. (Rathnam Movie Review) తమిళ నాడులో తిరుత్తరణి ప్రాంతానికి చెందిన లింగం (మురళి శర్మ) అనే రౌడీ మల్లికని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని రత్నం తెలుసుకుంటాడు. లింగం అనేవాడు ఒక నరరూప రాక్షసుడు, ఎన్నో ఘోరాలు చేస్తూ ఉంటాడు. మల్లిక కోసం అటువంటి లింగంతో తలపడటానికి రత్నం సిద్ధపడతాడు. రత్నం తల్లి రంగనాయకి రత్నం చిన్నగా వున్నప్పుడు పోలీసు స్టేషన్ లో ఉరేసుకుని చనిపోతుంది? (Rathnam Review) ఆమె ఎందుకు ఉరేసుకు చనిపోయింది? అసలు ఈ లింగం అనే అతను ఎవరు, ఎందుకు మల్లికని చంపాలని అనుకున్నాడు? మల్లికని ఎందుకు రత్నం కాపాడాలి అనుకున్నాడు, అసలు రత్నంకి, మల్లికకి ఏంటి సంబంధం? వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే 'రత్నం' సినిమా చూడండి.
విశ్లేషణ:
దర్శకుడు హరి అనగానే 'సింగం' సినిమాలు మనకి గుర్తుకు వస్తాయి, అలాగే అతను విక్రమ్, విశాల్ తో ఇంతకు ముందు చేసిన సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి, ఇక్కడ కూడా చాలా విజయం సాధించాయి. హరి ఇంతకు ముందు సినిమాల్లో పోరాటాలకు ప్రాధాన్యం వున్నా, దానికి తగ్గట్టుగా కథ కూడా చెప్పేవారు. అందుకే అతని సినిమాలు చాలా వరకు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు ఈ 'రత్నం' సినిమాకి వచ్చేసరికి, దర్శకుడు హరి కేవలం పోరాటాలపైనే దృష్టి పెట్టినట్టుగా కనిపించింది. ఒక సమయం వచ్చేసరికి ప్రేక్షకుడికి విసుగు కూడా పుడుతూ ఉంటుంది, ఎందుకంటే చూసిన పోరాట సన్నివేశమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టుగా ఉంటుంది. (Vishal, director Hari combination movie Rathnam Review) సినిమా మొదలవడం ఆసక్తికరంగా ఉంటుంది, తమిళ నాడు నుండి బయలుదేరిన బస్సుని కొంతమంది దొంగలు దారికాచి బస్సుని ప్రమాదానికి గురిచేసి, బస్సులో బతికున్న ప్రయాణీకులను చంపేసి, బంగారం, డబ్బు దొంగిలిస్తూ వుంటారు. ఇది 1990 దశకంలో జరిగింది అని చెప్పి, పది నిముషాల తరువాత కథని ప్రస్తుత కాలానికి మారుస్తాడు దర్శకుడు.
ఇక ఇక్కడ నుండి రత్నం, అతని మామయ్య పన్నీరుస్వామి మంచి కోసం హత్యలు చెయ్యడంలో తప్పులేదు అనే విధంగా రౌడీలలో మంచి రౌడీగా పోలీసులు చెయ్యలేని పనిని వీరిద్దరూ చేస్తున్నట్టుగా చూపిస్తాడు. తరువాత కథానాయకురాలు ప్రవేశం, ఇక అక్కడ నుండి కథ అటువైపు మళ్లుతుంది. అక్కడ నుండి, రత్నం కథానాయకురాలిని కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎడతెరపని పోరాట సన్నివేశాలతో నింపేసాడు దర్శకుడు. హరి కథపై కొంచెం దృష్టి సారించి పోరాటాలను తగ్గించి ఉంటే బాగుండేది. దానికితోడు యోగిబాబు వినోదం మరీ పాత చింతకాయ పచ్చడిలా వుండి, ప్రేక్షకులకి అంత వినోదాన్ని పంచలేకపోయింది. ప్రేక్షకుడికి విశాల్, ప్రియ భవానీ శంకర్ ల మధ్య కెమిస్ట్రీని దర్శకుడు సరిగ్గా చూపించలేకపోయారు అనిపిస్తుంది. ఎదో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప యోగిబాబు పాత్రని అంతగా వాడుకోలేకపోయాడు దర్శకుడు అనిపిస్తుంది. అయితే సినిమాలో ఒకటే ఆసక్తికరం ఏంటంటే, ట్విస్టులపై ట్విస్టులు ఉంటాయి, కానీ అవి సాగదీసినట్టుగా ఉంటాయి. ఇక ఇటువంటి కథలు చాలానే వచ్చాయి. విపరీతమైన హింసతో కూడిన పోరాటాలు ప్రేక్షకుడికి విసుగుని, అసలసటని తెప్పిస్తాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, నేపధ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే విశాల్ కి ఇటువంటి పాత్రలు కొత్తేమీ కాదు, ఇంతకు ముందు చేశారు. ఇందులో అతని నటన కన్నా, ఎక్కువగా అతను చేసిన పోరాటాలు కనిపిస్తాయి. ఇక ప్రియా భవానీ శంకర్ చాలా అందంగా వుంది, తనకిచ్చిన పాత్రను ఎంతో హుందాగా చేసింది. రెండు పాత్రల్లోనూ ఆమె మెరిసింది, ప్రతిభ కనపరించింది. మురళి శర్మకి ఇది ఇంకొక పాత్ర, అతను అంతగా సూట్ కాలేదు. సముద్రఖని తన పాత్రని బాగా చేశారు, అతనికి పాత్ర నిడివి కూడా ఎక్కువే. యోగిబాబు వినోదం అంతగా పండలేదు. జయప్రకాష్, విజయ్ కుమార్, హరీష్ పేరడి, తులసి ఇలా చాలామంది నటీనటులు తమ పాత్రల పరిధి మేరకి చేశారు. చివర్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా కనిపిస్తారు. దర్శకుడు హరి కథపై కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చే విధంగా ఉండేది.
చివరగా, 'రత్నం' సినిమా దర్శకుడు హరి ఇంతకు ముందు తీసిన సినిమాలతో పోలిస్తే చాలా నాసిరకం కథతో, హింసతో కూడిన పోరాటాలపై ఎక్కువ దృష్టి సారించిన సినిమా ఇది. ఈ సినిమాలో కథ కన్నా, ట్విస్టులు ఎక్కువగా ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి ఉపయోగపడలేదు. విసుగెత్తిపోయే పోరాటాలు తప్ప, విషయం లేని సినిమా ఇది.