Prathinidhi Movie Review: రాజకీయ నేపధ్యంలో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ABN, Publish Date - May 10 , 2024 | 02:52 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడిన ఈ సమయంలో నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి 2' విడుదలైంది. ఈ సినిమా కథ రాజకీయ నేపధ్యం కావటం, ఈ సినిమాతో ప్రముఖ పాత్రికేయుడు మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండటం, ఈ సమయంలో విడుదల కావటంతో ఈ సినిమాపై కొంచెం ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చదవండి.
సినిమా: ప్రతినిధి 2
నటీనటులు: నారా రోహిత్, సిరి లేళ్ల, సచిన్ ఖేడేకర్, ఉదయభాను, దినేష్ తేజ్, అజయ్ ఘోష్, జిషు సేన్ గుప్త, ప్రవీణ్, అజయ్ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని
కథ, కథనం, రచన, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు (Murthy Devagupthapu)
విడుదల తేదీ: మే 10, 2024
రేటింగ్: 2 (రెండు)
-- సురేష్ కవిరాయని
నారా రోహిత్ చాలా కాలం తరువాత అంటే సుమారు నాలుగేళ్ళ తరువాత 'ప్రతినిధి 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకు ముందు అతను చేసిన 'ప్రతినిధి' అనే సినిమా విజయం సాధించింది, విమర్శకుల ప్రసంశలు పొందింది. ఆ సినిమాకి సీక్వెల్ అని కాదు కానీ, అందులో నారా రోహిత్ కామన్ మేన్ అంటూ ముఖ్యమంత్రిని అపహరించి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను సంధిస్తారు. ఆ సినిమా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో రోహిత్ పాత్రికేయుడిగా నటించారు, మొదటి సినిమాలో ఉన్నట్టుగానే రాజకీయ నేపధ్యం తీసుకున్నారు, అందుకని సినిమాకి 'ప్రతినిధి 2' అని పేరు పెట్టారు అనిపించింది. పాత్రికేయుడిగా 30 సంవత్సరాలు అనుభవం వున్న మూర్తి దేవగుప్తపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి కథ, కథనం, రచన కూడా అతనే చేశారు. ఈ సినిమాతో సిరి లేళ్ల అనే అమ్మాయి తెలుగుతెరకు కథానాయికగా పరిచయం అయింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Prathinidhi 2 Story కథ:
ఒక ప్రముఖ పాత్రికేయురాలు (ఉదయభాను) విదేశాలనుండి ఇండియా వచ్చి ఎన్.ఎన్.సి (NNC) అనే ఒక టీవీ ఛానెల్ ప్రారంభించి, అందుకు సరైన వ్యక్తి విలువలకు కట్టుబడే పాత్రికేయుడు చే లేదా చేతన్ (నారా రోహిత్) అని నమ్మి అతన్ని ఛానెల్ సీఈఓ గా నియమిస్తుంది. చే అనే పాత్రికేయుడు సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి, ప్రలోభాలకు లొంగని వ్యక్తి, రాజకీయ నాయకుల అవినీతిని ఈ ఎన్.ఎన్.సి ఛానెల్ ద్వారా ప్రజలకి చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చే వ్యక్తి. ఆర్ధిక మంత్రి (అజయ్ ఘోష్) ని స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసి అతని అవినీతిని బయటపెడతాడు, అలాగే ఉపఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి (పృథ్విరాజ్) అవినీతిని కూడా బయటపెడతాడు. మంచి పాలనాదక్షుడు అని పేరుగాంచిన ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్) ఈ ఇద్దరినీ తమ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఇలా చేస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్యాయత్నం జరుగుతుంది, ముఖ్యమంత్రి వున్న ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తారు, ముఖ్యమంత్రి చనిపోతారు. ఎవరు ముఖ్యమంత్రి ఇంటిపై బాంబు దాడి జరిపారు? అంత మంచివాడిగా పేరుపొందిన ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకుంటారు? ముఖ్యమంత్రి హత్యని పరిశోధించడానికి వచ్చిన సి.బి.ఐ ఆఫీసర్ (జిషు సేన్ గుప్త) ఈ కేసును పరిష్కరించాడా? చే దీనివెనకాల ఎవరున్నారు అనే విషయాన్నీ తన ఛానెల్ ద్వారా బయటపెట్టాడా? చివరికి ఏమైంది అనే విషయం తెలియాలంటే 'ప్రతినిధి 2' ని చూడండి.
విశ్లేషణ:
నారా రోహిత్ ఇంతకు ముందు నటించిన 'ప్రతినిధి' సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. దాదాపు పదేళ్ల తరువాత అదే సినిమా పేరుతో ఈ 'ప్రతినిధి 2' అనే సినిమా వచ్చింది. అందులో కామన్ మేన్ గా కనిపిస్తే, ఇందులో రోహిత్ పాత్రికేయుడిగా నటించారు. దర్శకుడు మూర్తి దేవగుప్తపు అనుభవం వున్న పాత్రికేయుడు, అతని వృత్తిలో అనేకమైన రాజకీయ సంఘటనలు, సామజిక సమస్యలు చూసి వుంటారు, అతను ఈ సినిమాకి కథ రాసుకున్నారు. కథ కొత్తది కాకపోయినా, అతని ఐడియా బాగుంది, కానీ అది వెండితెరపై చూపించడంలో కొంచెం తడబాటు కనిపించింది. ఇది అతనికి దర్శకుడిగా మొదటి సినిమా అయినా, ఇంకా సరైన హోమ్ వర్క్ చేసివుంటే బాగుండేది అనిపించింది.
అక్కడక్కడా కొన్ని కొన్ని సన్నివేశాలు తప్పితే, సినిమా అంతా ఆసక్తికరంగా నడపడంలో దర్శకుడు మూర్తి కొంచెం విఫలం అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే పాత్రికేయుడి స్ట్రింగ్ ఆపరేషన్స్, సిబిఐ పరిశోధన, హై కోర్టు జడ్జి ఇచ్చిన ఉత్తర్వు, లాయరు సప్తగిరి సిల్లీ కామెడీ సన్నివేశాలు అన్నీ దర్శకుడు మూర్తి అనుభవ రాహిత్యాన్ని చెపుతున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలను మరీ సినిమాటిక్ గా చూపించేసారు దర్శకుడు. ఒక ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇల్లుని బాంబులతో పేల్చడం అంత సులువైన పనా? సిబిఐ ఆఫీసర్ పరిశోధన చాలా సిల్లీ ఉంటుంది, అవన్నీ మరీ అతిగా చూపించారు, నిజంగా సిబిఐ పరిశోధన అంటే అలా ఉంటుందా? హై కోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులను పట్టుకొని వచ్చిన లాయరు కమెడియన్ గా కనపడతాడా? అదే లాయరు ఛానెల్ ఆఫీస్ లోకి వచ్చి, ప్రత్యక్ష ప్రసారానికి అడ్డు తగిలి కామెడీ చేస్తాడా? ఇంత అనుభవం వున్న మూర్తిగారు ఇలాంటి చిన్న చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో తెలియలేదు. గవర్నరు ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించే ఆ సన్నివేశం అయితే మరీ సినిమాటిక్ అనిపిస్తుంది.
కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఓటు యొక్క ఆవశ్యకత, రాజకీయ వ్యవస్థ ఒక మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తుంది చెప్పే విధానం బాగుంది. సినిమాలో ఇలాంటి మాటలు బాగానే రాసారు కానీ, సినిమాని ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో కథనం సరిగ్గా లేదని అనిపిస్తోంది. మధ్యలో ఒక పాటని రోహిత్, సిరిలపై బలవంతంగా పెట్టారు అనిపిస్తుంది, అది అనవసరం. అలాగే కథానాయకుడి గతం గురించిన సన్నివేశాలు కొంచెం భావోద్వేగంగా వాటిపై ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సన్నివేశాలు చాలావరకు మరీ సినిమాటిక్ అయిపోవటం, కథలో గంభీరత లోపించడంతో సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గిపోవడానికి అవకాశం వుంది. దర్శకుడు మూర్తి మంచి కథని చెప్పాలని అనుకున్నారు, కానీ కొంతవరకే సఫలం అయ్యారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే, నారా రోహిత్ చాలా విరామం తరువాత పాత్రికేయుడిగా ఈ సినిమాలో కనిపించారు. అతను తన పాత్రని బాగానే చేశారు, కానీ అతని పాత్రని ఇంకా బలంగా రాసివుంటే బాగుండేది. ఉదయభాను కూడా చాలా కాలం తరువాత కనిపించారు, ఆమె పరవాలేదు బాగా చేశారు. సచిన్ ఖేడేకర్ ముఖ్యమంత్రి పాత్రలో బాగున్నారు. అజయ్ ఘోష్, పృథ్విరాజ్ రాజకీయనాయకుల్లా కాకుండా కమెడియన్స్ గా కనిపించారు. సిరి లేళ్ల ఐఏఎస్ ఆఫీసరుగా బాగున్నారు, కానీ ఆమె పాత్రకి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. జిషు సేన్ గుప్త పరవాలేదు, దినేష్ తేజ్, అజయ్ తన పాత్రలకి తగ్గట్టుగా చేశారు. ప్రవీణ్ కెమరామెన్ గా కాకుండా, కమెడియన్ గా కనిపించాడు. నేపధ్య సంగీతం సినిమాలో సన్నివేశాలని ఆసక్తిరేకెత్తించడంలో అంతగా ఉపకరించలేదు. ఛాయాగ్రహణం పరవాలేదు. మాటలు బాగున్నాయి.
చివరగా, పాత్రికేయ వృత్తిలో ఉంటూ దర్శకత్వం చేపట్టిన మూర్తి దేవగుప్తపు తన మొదటి సినిమాని కొంచెం నిజమైన సంఘటనలకు దగ్గర ఉండేవిధంగా ఈ కథని మలిస్తే సినిమా చాలా ఆసక్తికరంగా వచ్చి ఉండేది అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు సినిమాటిక్ గా ఉండటం, కొన్ని సన్నివేవాలు అసలు లాజిక్ లేకుండా ఉండటంతో ఈ సినిమా ఒక మామూలు సినిమాగా తయారైంది. మొదటి సినిమా 'ప్రతినిధి' చూసినవాళ్లు, ఈ 'ప్రతినిధి 2' చూసి పెదవి విరుస్తారు, నిరాశ పడతారు అనే చెప్పాలి.