Thiragabadara Saami Review: రాజ్ తరుణ్ హిట్ అందుకున్నాడా లేదా?
ABN, Publish Date - Aug 02 , 2024 | 02:03 PM
ఉయ్యాల జంపాలా', 'కుమారి 21 ఎఫ్', 'సినిమా చూపిస్తా మావ' వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు యువ హీరో రాజ్ తరుణ్. పక్కింటి అబ్బాయి పాత్రలకు కేరాఫ్ అని గుర్తింపు తెచ్చుకున్న ఆయన అవకాశాలు అయితే అనుకుంటున్నారు కానీ సరైన విజయం అందుకోలేకపోతున్నాడు.
సినిమా: 'తిరగబడర సామీ'(Thiragabadara Saami Review)
విడుదల తేది: 2 ఆగస్ట్, 2024
నటీనటులు: రాజ్‌తరుణ్ (Raj Tarun), మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, ప్రగతి, మకరంద్ దేశ్పాం డే, పృథ్వీ, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి, దువ్వాసి మోహన్ తదితరులు.
కెమెరా: జవహర్ రెడ్డి.
సంగీతం: జెబీ, భోలే షావలి,
నిర్మాణ సంస్థ : సురక్ష్ ఎంటర్‌టైనమెంట్ మీడియా
నిర్మాత: మల్కాపురం శివకుమార్
రచన దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
'ఉయ్యాల జంపాలా', 'కుమారి 21 ఎఫ్', 'సినిమా చూపిస్తా మావ' వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు యువ హీరో రాజ్ తరుణ్. పక్కింటి అబ్బాయి పాత్రలకు కేరాఫ్ అని గుర్తింపు తెచ్చుకున్న ఆయన అవకాశాలు అయితే అనుకుంటున్నారు కానీ సరైన విజయం అందుకోలేకపోతున్నాడు. విభిన్న కథలు ట్రై చేస్తున్నా కాలం కలిసి రావడం లేదన్నట్లు ఉంది అతని పరిస్థితి ఉంది. తాజాగా ఆయన నటించిన చిత్రం 'తిరగబడర సామీ’. యజ్ఞం, సౌక్యం, పిల్లా నువ్వు లేని జీవితం’ హిట్ చిత్రాలు తీసిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు, హీరో రాజ్ తరుణ్‌కు ఈ చిత్రంతో దశ తిరిగిందా లేదా అన్నది చూద్దాం. (Thiragabadara Saami Review)
కథ:
గిరి (రాజ్‌తరుణ్) చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై ఓ బస్తీవాసుల సాయంతో ఎదిగిన కుర్రాడు. తప్పిపోయినవాళ్లు, ఇంటి సమస్యలతో ఇంటికి దూరమైనవాళ్లను ఇంటికి చేర్చే పనిని వృత్తిగా ఎంచుకుంటాడు. పెద్ద కుటుంబం కావాలని కోరుకునే అతనికి శైలజా (మాల్వీ మల్హోత్ర) పరిచయం అవుతుంది. చూడగానే అతన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. ఆమె గిరిని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి? కొండారెడ్డి (మకరంద్ దేశ్పాం డే) శైలజను ఎందుకు వెతుకుతాడు. అతనికి, శైలజకు సంబంధం ఏంటి? అన్నది మిగత కథ.
విశ్లేషణ:
ఫ్యామిలీ, కామెడీ, ఎమోషన్స్ , యాక్షన్ , మెసేజ్ ఇలా పలురకాల అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ కథలు, లవర్ బాయ్‌గా పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన రాజ్ తరుణ్ ఈ సినిమాతో మరోసారి యాక్షన్ జానర్‌ను కూడా ట్రై చేశాడు. దర్శకుడు రవికుమార్ ఎంచుకున్న కథ బాగానే ఉన్నా తెరకెక్కించడంతో తడబాటు కనిపించింది. ఒక వ్యక్తి అన్వేషణతో మొదలైన సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారింది. హీరోయిన్ తో హీరో పరిచయ సన్నివేశాలు ఆసక్తికరంగానే సాగినా ఇద్దరి మధ్య సంభాషణ బోర్ కొట్టించేలా ఉంది. పెళ్లి తంతు, ఆ తర్వాత సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ సమయానికి వాట్ నెక్ట్స్ అనేది ఊహించేలా ఉంది. కొండారెడ్డి అన్వేషణ చేసేది శైలజా (మాల్వీ మల్హోత్ర) కోసమేనని, ఆ తర్వాత కథేంటి అన్నది అప్పుడు రివీల్ చేశారు. మకరంద్ దేశ్పాం డే (Makarandh Desh panday)విలక్షణ నటుడు. ఆయన ఎలాంటి పాత్రలను అయినా చేయగలడు. అయితే ఇందులో కొండారెడ్డి లాంటి పవర్‌ఫుల్ పాత్ర ఇచ్చినా అతనిపై తెరకెక్కించిన సన్నివేశాలు పేలవంగా అనిపించాయి. అతన్ని పాత్రను సరిగ్గా వాడుకుంటే సినిమాకు మంచి మైలేజ్ ఉండేది. అతని చుట్టూ ఉన్న పాత్రధారుల వల్ల అతని పాత్ర కామెడీ అయిపోయింది. ఇదంతా జరిగేది శైలజాకు ఉన్న రెండు వేల కోట్ల ఆస్తి కోసం అని చెప్పిన సన్నివేశాల్లో డెప్ట్ లేదు. ఇదే ఫార్ములాతో ఎన్నో సినిమాలు టాలీవుడ్ తెరపై వచ్చాయి. 'యజ్ఞం’, పిల్లా నవ్వులేని జీవితం’ సౌక్యం లాంటి చిత్రాలు తీసిన రవికుమార్ ఇలాంటి కథ ఎంచుకోవడం ఏంటి అన్న సందేహం రాకమానదు. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే.. సొసైటీలో ఇలా జరుగుతాయా? అన్న అనుమానం వస్తుంది. కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు అంగీకరించేలా లేవు. ఒక భారీ ఫైట్‌తో కథను ముగించారు. అది పర్వాలేదనిపించింది.
ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. రాజ్‌తరుణ్ ఎనర్జీటిక్ హీరో. తప్పిపోయిన వారిని ఇంటికి చేర్చే కుర్రాడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ అతనిలోని యాక్టింగ్ స్కిల్‌ను, ఎనర్జీని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడనిపించింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్ర ఫర్వాలేదనిపించింది. ప్రగతి, రాజా రవీంద్ర, పృధ్వీ పరిధి మేరకు నటించారు. మకరంద్ దేష్ పాండే అనుచరులైన రఘుబాబు అండ్ కో కామెడీ సన్నివేశాలు వెకిలిగా అనిపిస్తాయి. రాధాభాయ్‌గా మన్నారా చోప్రా ఓ పాటకు, అందాల ఆరబోతకే పరిమితమైంది. మిగత ఆర్టిస్ట్‌ల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. పాటలు కూడా ఆసక్తిగా లేవు. అక్కడక్కడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించింది. ఒక గంట 55 నిమిషాల నిడివిలో కూడా ఇంకా కత్తెర వేస్తే బావుండును అనేలా కొన్ని సన్నివేశాలున్నాయి. లాజిక్కులు లేని సన్నివేశాలు ఎన్నో! కెమెరా పనితీరు బావుంది. నిర్మాణపరంగా ఫర్వాలేదనిపించింది.
ఓటీటీలో చిన్న కాన్సెప్ట్ తో తీసిన చిత్రాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పరిమిత వ్యయంతో కూడిన సినిమా చూడాలంటే అందులో ఏదో ఒక కొత్త విషయం ఉండాల్సిందే. అలా అయితేనే ప్రేక్షకుడు థియేటర్లో అడుగుపెడుతున్నారు. కథ, కథనాల్లో కొత్తదనం.. హాస్యం, భావోద్వేగాలు ఉండాలి. తెరకెక్కించే విధానంలో కొత్తదనం చూపించి ఉంటే ఇంకాస్త మంచి మార్కులు పడేవి.