మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vidya Vasula Aham Movie Review: రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన ఈ సినిమా ఎలా వుందంటే...

ABN, Publish Date - May 17 , 2024 | 06:46 PM

రాహుల్ విజయ్, శివాని జంటగా 'విద్య వాసుల అహం' సినిమా ఆహా ఓటిటిలో ప్రసారం అవుతోంది. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Vidya Vasula Aham Movie Review

సినిమా: విద్య వాసుల అహం

నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ, కాశీ విశ్వనాథ్, రాజశ్రీ నాయర్ తదితరులు

సంగీతం: కళ్యాణి మాలిక్

ఛాయాగ్రహణం: అఖిల్ వల్లూరి

నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట

దర్శకుడు: మణికాంత్ గెల్లి

విడుదల: ఆహా ఓటిటిలో (మే 17)

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

ప్రేక్షకులు సినిమా హాల్స్ కి రావటంలేదని సింగల్ స్క్రీన్ సినిమా హాల్స్ కొన్ని రోజులపాటు మూసివేయాలని అనుకుంటున్న ఈ సమయంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటిటిలోనే విడుదలవుతున్నాయి. అలా విడుదలైన సినిమానే 'విద్య వాసుల అహం'. మణికాంత్ గెల్లి దర్శకుడు కాగా ఈ సినిమా ఆహా ఓటిటి లో విడుదలైంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Vidya Vasula Aham Story కథ:

విద్య (శివాని రాజశేఖర్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తూ ఉంటుంది, వాసు (రాహుల్ విజయ్) ఒక మెకానికల్ ఇంజనీర్. ఇద్దరికీ పెళ్లంటే ఇష్టం లేదు, ఇంట్లో తల్లిదండ్రులు చెపుతున్నా దాటవేస్తూ వుంటారు. ఒక గుడిలో స్వామిజీ (తనికెళ్ళ భరణి) పెళ్లిపై చెప్పిన ప్రవచనం ఇద్దరూ కాకతాళీయంగా వింటారు, అప్పుడు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. విద్య తన పెళ్లికి ఎలాంటి వరుడు కావాలో కొన్ని ప్రశ్నలతో ఒక జాబితా తయారు చేసి, అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వరుడిని చేసుకుంటానని చెపుతుంది. వాసు మార్కులు ఎక్కువ తెచుకోవటంతో అతన్ని చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు, ఇంతవరకు బాగానే వుంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. హానీమూన్ కి డబ్బులు లేవు, అప్పులు చేసి వెళ్లొద్దు అనుకున్న ఈ జంట, విద్య ఫోనులో ఆమె దాచుకున్న డబ్బుల మెసేజీలు వాసు చూస్తాడు, వాటి గురించి అడుగుతాడు. అవి తనవని, రాబోయే కాలానికి సేవ్ చేశానని చెపుతుంది. ఇక అక్కడ మొదలవుతుంది వాళ్ళిద్దరి మధ్య తగాదా, అక్కడ నుండి వాళ్ళ అహం ఎంతవరకు దారితీసింది, కథ ఎటు తిరిగింది తెలుసుకోవాలంటే 'విద్య వాసుల అహం' సినిమా చూడండి.

విశ్లేషణ:

దర్శకుడు మణికాంత్ గెల్లికి బాపు గారి దర్శకత్వంలో వచ్చిన 'మిష్టర్ పెళ్ళాం' బాగా చూశాడు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా భర్త అహంకారంతో ఉద్యోగం ఊడగొట్టుకుంటే, అంతవరకు ఇంటికే పరిమితమైన భార్య ఉద్యోగం చెయ్యడమే కాకుండా, భర్తని ఒక సంఘటన నుండి కాపాడుతుంది కూడా. అయితే ఈ 'విద్య వాసుల అహం' సినిమా కూడా కొంచెం 'మిష్టర్ పెళ్ళాం' సినిమా కథలానే అనిపిస్తుంది. దానికితోడు 'మిష్టర్ పెళ్ళాం' సినిమాలో వైకుంఠం నుండి కథ ప్రారంభం అయినట్టుగానే, ఇందులో కూడా వైకుంఠం, విష్ణుమూర్తి, లక్ష్మి దేవి, నారదుడు అలానే కథ మొదలవుతుంది. అందులోలానే ఈ సినిమాలో కూడా మధ్యలో మళ్ళీ వైకుంఠం సన్నివేశాలు ఇవన్నీ ఉండటంతో ఆ సినిమా ప్రభావం దర్శకుడిపై బాగానే వుంది అనిపిస్తుంది.

ఇక సినిమా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య చూపించిన తగాదా కొంచెం బలమైనదిగా చూపిస్తే బాగుండేది. భర్తకి డబ్బులు ఇవ్వను అని చెప్పిన భార్య, భర్తకి పేటిఎం ద్వారా డబ్బులు వెయ్యడం, భార్య దగ్గర డబ్బులు తీసుకోను అని చెప్పిన భర్త, భార్య డబ్బులు వెయ్యగానే పొంగిపోయి ఆ డబ్బులు వాడుకోవటం చూస్తే నిజంగానే ఇద్దరికీ అహం ఉందా, పోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పేరు కూడా 'విద్య వాసుల అహం' అని పెట్టారు. కథ పాతది, కథనం కూడా అంత ఆసక్తికరంగా వుండకపోవటంతో ఇదొక మామూలు సినిమా అని తెలిసిపోతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయి, శివాని, రాహుల్ విజయ్ మధ్య కెమిస్ట్రీ బాగుంది, వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.

కొన్ని సన్నివేశాల్లో రెండర్థాలు వచ్చే మాటలు కూడా పెట్టాడు దర్శకుడు. సినిమా చూశాక ఇది కేవలం ఓటిటి కోసమే తీసిన సినిమా అనేట్టుగానే వుంది. మధ్యలో విద్య వాసుల మధ్య కొన్ని రొమాంటిక్ అదే మసాలా సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇద్దరి అహం ని దర్శకుడు ఇంకా బలంగా చూపించి, కథపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో విద్య వాసుల జంట తప్పితే, మిగతా పాత్రలు, తల్లిదండ్రుల పాత్ర కేవలం నామమాత్రంగా వున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే వాసుగా రాహుల్ విజయ్ బాగా మెప్పించాడు. అతను తన నటనలో పరిణితి చూపించాడు, అలాగే ఈ సినిమాలో చాలా చలాకీగా కనిపిస్తూ సహజంగా నటించాడు. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే అతని నటనలో చాలా ఈజ్ వుంది. శివాని రాజశేఖర్ విద్యగా చాలా బాగా నటించింది, ఆమె నటనలో సహజత్వం వుంది. ఆమె అందంగా వుంది, అలాగే ఈ సినిమాలో తాను గ్లామర్ పాత్రలు కూడా చేస్తాను అని చెప్పకనే చెప్పింది. కాశీ విశ్వనాధ్, రవి వర్మ, రాజశ్రీ నాయర్ అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు. వైకుంఠం సన్నివేశాలు వినోదాత్మకంగా బాగున్నాయి. అందులో అవసరాల, అభినయ, శ్రీనివాస్ రెడ్డి (మీసాల నారదుడుగా) ఆ సన్నివేశాలని బాగా పండించారు. కళ్యాణి మాలిక్ సంగీతం బాగుంది, ఛాయాగ్రహణం కూడా పరవాలేదు.

చివరగా, 'విద్య వాసుల అహం' సినిమా బాపుగారి 'మిష్టర్ పెళ్ళాం' సినిమా కథకి పోలికగా ఉంటుంది, అయితే ఈ సినిమాని సరదాగా ఇంట్లో కాలక్షేపం కోసం ఒకసారి చూసుకోవచ్చు. రాహుల్ విజయ్, శివానిల నటన, వారిమధ్య వచ్చే కెమిస్ట్రీ ఈ సినిమాలో ప్రధానమైన అంశం. దర్శకుడు ఆ అహం వెనక ఒక బలమైన కారణం చూపించి, కథపై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.

Updated Date - May 17 , 2024 | 07:11 PM