Kanguva Review: సూర్య నటించిన యాక్షన్ డ్రామా ‘కంగువా’ ఎలా ఉందంటే...
ABN, Publish Date - Nov 14 , 2024 | 06:49 PM
సూర్య హీరోగా దర్శకుడు శివ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘కంగువా’ . భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే..
సినిమా రివ్యూ: కంగువా (Kanguva Review)
విడుదల: 14–11–2024
నటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ దేవోల్, నటరాజన్, రెడిన్ కింగ్‌స్లే, హరీశ్ ఉత్తమన్, కోవై సరళ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: వెట్రి పళనిస్వామి
సంగీతం: దేవిశ్రీప్రసాద్,
ఎడిటింగ్: నిశాద్ యూసుఫ్,
కథ: శివ, ఆది నారాయణ
నిర్మాణ సంస్థలు: స్టూడియో గ్రీన్ ఫిలింస్, యు.వి.క్రియేషన్స్,
నిర్మాణం: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్;
దర్శకత్వం: శివ.
కోలీవుడ్ స్టార్ సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. ఫాంటసీ యాక్షన్ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. సూర్య ద్విపాత్రాభినయం చేశారు. తొలి టీజర్‌తోనే సినిమాకు మంచి హైప్ వచ్చింది. టాలీవుడ్‌కు ‘బాహుబలి’ ఎలాగో కోలీవుడ్‌కు ‘కంగువా’ అంటూ చిత్ర బృందం ప్రచారం చేయడం, ప్రేక్షకులకు మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తామని సూర్య చెప్పడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకొందా? సూర్య నటన ఎలా ఉంది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!
కథ: (Kanguva Movie Review)
కొన్ని వందల ఏళ్ళ క్రితం సముద్రాన్ని ఆనుకొని ప్రణవ కోన, రుధిర కోన, కపాల కోన, హిమ కోన, చీకటి కోన అని ఐదు ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో కోనకు ఒక్కో పాలకుడు ఉంటాడు. ప్రణవ కోనకి కంగువా (సూర్య) పాలకుడు. చాలా గొప్ప వీరుడు. కపాల కోనకు ఉధిరన్ (బాబీడియోల్) పాలకుడు. సముద్రం మీదుగా ఆ ప్రాంతానికి వచ్చిన రోమన్ చక్రవర్తి ప్రణవ కోనను తన వశం చేసుకోవాలనుకుంటాడు. ఐదు కోనల మధ్య అంతర్ యుద్దం వచ్చేలా ప్రణాళిక రచిస్తాడు. ఇందులో ప్రణవ కోన, హిమ కోన ఒక పక్షం. మిగిలిన మూడు కోనలు మరో పక్షం. అయితే యుద్థం సమీపంలో ఉండగా పలోమా అనే ఓ చిన్నపిల్లాడి కోసం.. ప్రణవ కోనని వదిలి చీకటి కోన అనే చోటుకి వెళ్లిపోతాడు కంగువా. ఇంతకీ ఈ పలోమా ఎవరు? అతని కోసం కంగువా ఎందుకు రాజ్యాన్ని విడిచాడు? మొత్తం ప్రణవ కోన జాతిని అంతం చేయడానికి వచ్చిన కపాల కోన నాయకుడు బాబీ డియోల్ లక్ష్యం నెరవేరిందా? తమ జాతిని రక్షించడానికి కంగువా రణ రంగంలో దిగాడా లేదా? ఇది ఒక కథ.
అయితే.. ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో ఓ బౌంటీ హంటర్. పోలీసులు కూడా చేయలేని పనులు చేసే క్రమంలో జీటా అనే బాలుడిని కలుసుకుంటాడు. ఫ్రాన్సిస్, జీటా కలుసుకోగానే ఇద్దరికీ ఏదో తెలియని సంబంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. జీటా సమస్యలో ఉన్నాడని తెలుసుకున్న అతను జీటాని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు. అసలు జీటాని వెంటాడుతున్నది ఎవరు? ఫ్రాన్సిస్, జీటా, 1070 సంవత్సరాల నాటి ప్రణవకోన యువరాజు కంగువా (సూర్య)కి మధ్య సంబంధం ఏమిటి? అన్నది తెరపైనే చూడాలి.
విశ్లేషణ: (Kanguva review)
వెయ్యి ఏళ్ల కిందట ఓ ప్రాంతంలో ఐదు కోనలు, ఆ ప్రాంతానికి వచ్చిన విదేశీ చక్రవర్తి. కోనల ప్రజలకు, విదేశీ చక్రవర్తికి మధ్య యుద్ధాలు, పునర్జన్మ, మెదడుపై ప్రయోగాలు ఈ నేపథ్యంలో సాగే కథ ఇది. విషయం ఉన్న కథే కానీ తెరకెక్కించే విధానం మిస్ ఫైర్ అయింది. యుద్ధాలు జరుగుతుంటాయి... రక్తం ఏరులై పారుతుంది. శవాలు కుప్పలుగా పేరుకుపోతాయి. కానీ ఏ సన్నివేశం మనసును తాకేలా ఉండదు. ప్రేక్షకుడు పాత్రలో లీనమయ్యే క్యారెక్టర్ ఒకటీ కనిపించదు. ఎప్పటిదో పాంటసీ కథకి, వర్తమాన కాలానికి ముడిపెడుతూ తెరకెక్కించారు. పెద్ద కాన్వస్‌లో రూపుదిద్దుకున్న చిత్రమిది. కథని వర్తమానంతో లింక్ చేసే క్రమంలో మొదటి 25 నిమిషాల సీన్స్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షే. కంగువా అసలు కథ మొదలయ్యాక కూడా ఆ ప్రభావం ఏమీ కనిపించదు. ఐదు కోనల్ని పరిచయం చేస్తూ.. కన్‌ఫ్యూజ్ చేశాడు. ప్రణవ కోన గొప్పదని ఒక్క లైన్‌లో చెప్పి వదిలేశారు. కథ మొత్తం ప్రణవ కోన, కపాల కోనలల గురించి పూర్తి స్థాయిలో పరిచయం చేసుంటే కనెక్ట్ అయ్యేది. అయితే ఈ సినిమా చూసినంత సేపు బాహుబలి లోని కొన్ని పాత్రలు కళ్లల్లో మెదులుతాయి. ద్వితీయార్థం అంతా యుద్దమే నడుస్తుంది. గతానికి, వర్తమానానికి లింక్ చేసిన నడిపిన క్లైమాక్స్ సీక్వెన్స్‌లో రిచ్‌నెస్ ఉంది కానీ.. ఈ సీన్స్ నేచురల్‌గా కాక భారంగా ఉంటాయి. పులోమా, కంగువా మధ్య వచ్చిన సందేశాలు మాత్రం ప్రేక్షకుల్ని అలరిస్తాయి. భావోద్వేగం కూడా అక్కడే పండింది. పులోమా తల్లికి ఇచ్చిన మాట కోసం కంగువా నిలబడే తీరు, అతన్ని కాపాడటం కోసం తీసుకున్న దారి, రుధిరతో పోరాటం సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. మొసలితో చేసిన ఫైట్, హిమకోనలో అమ్మాయిలు చేసిన వార్, క్లైమాక్స్‌లో ఎయిర్ యాక్షన్ ప్రత్యేకంగా చెప్పుకునేలా వుంటాయి.
నటీనటుల విషయానికొస్తే.. సూర్య నటన ఈ సినిమా మేజర్ ప్లస్ అయింది. కంగువా, ఫ్రాన్సిస్ పాత్రలకు న్యాయం చేశారు. యాక్షన్ సీన్స్, భావోద్వేగాలను చక్కగా పండించారు. రుధిర పాత్రలో బాబీ దేవోల్ రౌద్రంగా కనిపించారు, కానీ పాత్ర ఇంకాస్త ప్రాధాన్యం ఉంటే బావుండేది. యోగిబాబు, దిశాపటానీ ఏదో అలా మెరిశారు. కార్తి క్యామియో రోల్‌లో కనిపిస్తాడు. జీటా పాత్రలో కనిపించిన పిల్లాడి పాత్రకు చక్కని ప్రాధాన్యం ఉంది. సాంకేతికంగా సినిమా హైలో ఉంది. గ్రాఫిక్స్, విజువల్ అద్భుతంగా కుదిరాయి. నిర్మాణ పరంగా అత్యంత ఉన్నతంగా ఉంది. వెట్రి కెమెరా పనితనం వెయ్యేళ్ల కిందటి కాలంలోకి తీసుకెళ్లింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది కానీ.. అక్కడక్కడ ఓవర్ సౌండ్‌లా అనిపిస్తుంది. పాటలు సందర్భానుసారంగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో కాస్తజాగ్రత్త తీసుకోవలసింది. త్రీడీలో ఈ చిత్రాన్ని చూడటం కష్టంగా అనిపించింది.
కంగువా కథ బలమైనది.. దర్శకుడి ఆలోచనలో కూడా ఇన్నోవేషన్ ఉంది. కానీ తాను అనుకున్నట్లు తెరపై చూపించలేకపోయాడు. ఈ తరహా చిత్రాలకు కొత్త నేపథ్యం. అదిరిపోయే విజువల్స్ చూపిస్తూ వినోదం, ఎమోషన్స్ పంచాలనుకుంటారు మేకర్స్. వందల ఏళ్ల క్రితం ఫాంటసీ లోకాన్ని చక్కగా ఆవిష్కరించి అందులోకి దర్శకుడు చక్కగా తీసుకెళ్లాడు. కానీ కథని చెప్పడంలోనే దర్శకుడు తడబడ్డాడు. కానీ లార్జర్ దేన్ లైఫ్ తరహా సినిమాని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.