Harom Hara Movie Review: ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకి హిట్ వచ్చిందా...

ABN , Publish Date - Jun 14 , 2024 | 02:16 PM

సుధీర్ బాబు కథానాయకుడిగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో వచ్చిన 'హరోం హర' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుప్పం కథా నేపధ్యంగా వచ్చిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Harom Hara Movie Review: ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకి హిట్ వచ్చిందా...
Harom Hara Movie Review

నటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాశ్, అక్షర గౌడ, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, కాదంబరి కిరణ్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు

ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథన్

సంగీతం: చైతన్ భరద్వాజ్

నిర్మాతలు: సుమంత్ జి నాయుడు

దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక

విడుదల తేదీ: జూన్ 14, 2024

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

నటుడు సుధీర్ బాబు తన సినిమాల ఫలితం ఎలా వున్నా, వైవిధ్యమైన సినిమాలు చెయ్యాలని తపన పడుతూ వుంటారు. అతనికి అప్పుడెప్పుడో 2017లో 'సమ్మోహనం' అనే సినిమా విజయం సాధించింది. ఆ తరువాత చాలా సినిమాలు విడుదలయ్యాయి కానీ అతనికి పెద్దగా బ్రేక్ మాత్రం ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 'హరోం హర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జ్ఞానసాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకుడు, మాళవిక శర్మ కథానాయిక. ఈ సినిమా అయినా సుధీర్ బాబు కి విజయం ఇచ్చిందో లేదో చూద్దాం. (Harom Hara Movie Review)

haromharareleasepostponed.jpg

Harom Hara Story కథ:

సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) ఒక పోలీటెక్నిక్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటాడు. కుప్పం వూర్లో తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్), అతని సోదరుడు (రవి కాలే), ఇంకా శరత్ (అర్జున్ గౌడ) తమ బలగంతో ప్రజల భూములు కాజేసి, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వుంటారు. అడ్డువచ్చిన వాళ్ళని నరుకుతూ తమకి ఎదురులేదు అనే విధంగా వుంటారు. ఒకరోజు తమ్మిరెడ్డి మనుషులు ఒక యువకుడిని వెంటాడుతూ చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సుబ్రహ్మణ్యం అడ్డుపడతాడు, తన వుద్యోగం పోగొట్టుకుంటాడు. అదే కాలేజ్ లో పని చేస్తున్న టీచర్ (మాళవిక శర్మ) తో ప్రేమలో ఉంటాడు సుబ్రహ్మణ్యం. తన తండ్రి చేసిన అప్పులు తీర్చటం కోసం డబ్బులు గడించాలని, సస్పెండ్ అయిన పోలీసు కానిస్టేబుల్ పళని (సునీల్) తో చేతులు కలిపి ఖాళీగా వున్న ఒక సినిమా థియేటర్ లో గన్స్ తయారు చేసి అవి దొంగచాటుగా అమ్మడం మొదలుపెడతాడు. తన తండ్రిని తమ్మిరెడ్డి మనుషులు కట్టి తీసుకువచ్చి చంపటానికి ప్రయత్నం చేస్తుంటే, సుబ్రహ్మణ్యం వాళ్ళని అడ్డుకుంటాడు, తండ్రిని కాపాడుకుంటాడు. సుబ్రహ్మణ్యం పేరు కుప్పంలో మారుమోగుతోంది, ప్రజలు అతన్ని దేవుడిగా చూస్తూ వుంటారు. రెడ్డి మనుషులు ఎందుకు తన తండ్రిని చంపాలని అనుకుంటారు? దొంగతనంగా గన్స్ ఎక్కడ నుండి తయారవుతున్నాయో తెలుసుకోవడానికి వచ్చిన స్పెషల్ పోలీసు ఆఫీసరు (అక్షర గౌడ) ఏమి కనుక్కుంది? రెడ్డి సోదరులకు, సుధీర్ బాబు కి మధ్య యుద్ధం ఎలా, ఎప్పుడు మొదలయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'హరోం హర' సినిమా చూడాల్సిందే. (Sudheer Babu starrer Harom Hara Movie Review)

విశ్లేషణ:

దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో వచ్చిన ఈ 'హరోం హర' అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాకి దగ్గరగా ఉంటుంది. అందులో గంధంచెక్కల దొంగతనంగా అమ్ముతూ, డబ్బులు గడిస్తూ పుష్ప పెద్దవాడైతే, ఇందులో గన్స్ తయారుచేస్తూ వాటిని దొంగతనంగా అమ్ముతూ పెద్దవాడవుతాడు సుబ్రహ్మణ్యం. ఆ సినిమా కూడా చిత్తూరు, తిరుపతి నేపధ్యం అయితే, ఈ సినిమా చిత్తూరు జిల్లాలో కుప్పం నేపథ్యంలో వచ్చిన సినిమా. దానికితోడు గన్స్ తయారుచేస్తూ, దొంగతనంగా అమ్ముతూ, అడ్డువచ్చిన విలన్స్ చంపుకుంటూ పోయే సుబ్రమణ్యాన్ని దేవుడుగా చిత్రీకరిస్తాడు దర్శకుడు. అలాగే సుబ్రహ్మణ్యం తను కాబోయే భార్యకి గన్స్ అమ్మి డబ్బు గడిస్తున్నాను అంటే అది ఆమె సమర్ధించటమే కాకుండా, అది చాల మంచిది అన్నట్టుగా చెప్పించాడు దర్శకుడు. 'కేజీఎఫ్' సినిమా కూడా దర్శకుడిపై బాగా ప్రభావం చూపించినట్టుంది, అందుకని ఆ సినిమా ఛాయలు కూడా ఈ 'హరోం హర' లో కనిపిస్తాయి.

'హరోం హర' సినిమా మొదలవడం ఆసక్తికరంగానే సాగుతుంది, కానీ తరువాత కొన్ని సాగదీత సన్నివేశాలతో నింపేసాడు దర్శకుడు. విలన్ మనుషులతో సుధీర్ బాబు తలపడే సన్నివేశం నుండి కథ కొంచెం వేగం పుంజుకుంటుంది. అయితే దర్శకుడు మొదటి సగం వరకు సినిమాని బాగానే చూపించగలిగాడు. కానీ రెండో సగంలో కథ ఏమి చెయ్యాలో తెలియక, ఎక్కువగా పోరాట సన్నివేశాలపై దృష్టి మరల్చాడు. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసాడు కూడా. ఒక సమయంలో అన్నదమ్ములైన విలన్స్ లో రవి కాలేని చంపటం వరకు బాగానే వుంది, కానీ అక్కడే ఇంకో విలన్ వున్నా అతన్ని వదిలేసాడు, ఎందుకంటే, కథ పొడిగించటం కోసం అన్నట్టు. ఇక అక్కడ నుండి కథ అంతా ఎలా సాగుతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది, అందుకని అంత పెద్దగా ఆసక్తి కలగదు.

haromahara.jpg

చేతిలో పదిరూపాయలు కూడా లేని కథానాయకుడు ఒక్కసారిగా ధనవంతుడు అవటం అనేది ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం ఇప్పటివరకు. అందుకని దర్శకుడు ఇందులో కొత్త పాయింట్ ఏమీ చెప్పలేదు, అదే కథలని తిప్పి తిప్పి తీసాడు, కొంచెం కుప్పం యాస పెట్టాడు అంతే. దర్శకుడు కేవలం సుధీర్ బాబుని ఒక మాస్ అవతార్ లో చూపించాలని ఈ కథని రాసినట్టుగా కనపడుతోంది, కానీ కథలో పట్టు లేదు, కొత్తదనం కనపడదు. ఒక ముగ్గురు విలన్స్ పెట్టి వాళ్ళని కేవలం పోరాట సన్నివేశాల కోసమే వాడుకున్నట్టుగా కనపడింది. భావోద్వేగాలు కూడా అంతగా కనపడవు. తండ్రి, కొడుకు మధ్యలో మంచి సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండేది, కానీ జయప్రకాశ్ తండ్రిగా ఎన్నో సినిమాల్లో చేసి, అదే మూసలో ఇక్కడ కూడా కనిపించారు. (Harom Hara Movie Review)

ఇప్పుడు ఎక్కువ సినిమాల్లో చివర్లో ఒక పెద్ద గన్ తో కనిపించే కథానాయకుడు విలన్స్ ని ఆ గన్ తో కాల్చటం అనేది పరిపాటి అయిపొయింది, ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా అలానే కనపడతారు. పైగా కొత్తగా తయారు చేసే ఈ గన్స్ కి పేర్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, కృష్ణ అని ఆ అగ్రనటుల పేర్లు పెడతారు, ఇంకో వెరైటీ గన్ కి జ్యోతి లక్ష్మి అని పేరు పెడతారు. సినిమాలో పెద్దగా విషయం లేనప్పటికీ చైతన్ భరద్వాజ్ నేపధ్య సంగీతం ఈ సినిమాని ముందుకు నడిపిస్తుంది. అలాగే ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది, అందమైన లొకేషన్స్ చూపించారు. ఈ సినిమాలో హింస మరీ ఎక్కువయింది, తలలు నరకటం, మొండాలు చూపించడం తగ్గిస్తే బాగుండేది. ఇప్పుడు చాలా సినిమాల్లో అదొక ఫ్యాషన్ అయిపొయింది. అసలు మనం ఎటు పోతున్నామో కూడా అర్థం కాకుండా పోతోంది, ఈ హింసాత్మక సన్నివేశాలు చూస్తుంటే. కృష్ణ గారి అభిమానులను అలరించడానికి ఆగిపోయిన సినిమా థియేటర్ పై కృష్ణగారి 'అగ్నిపర్వతం' కట్ అవుట్ కనిపిస్తూ ఉంటుంది.

haromharamalavika.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు ఒక మాస్ అవతార్ లో కనపడతారు, అతని బాడీ, అతని ఫిజిక్ చూపించడానికి ఈ సినిమా ఉపయోగపడింది. పోరాట సన్నివేశాల్లో బాగున్నారు, అతని పాత్రని సంఘర్షణలతో కూడి బలంగా రాసి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో హైలైట్ మాత్రం సునీల్ అనే చెప్పాలి. చాలా కాలం తరువాత సునీల్ మొదటి నుండి చివరి వరకు కథానాయకుడితో సమానంగా ఈ సినిమాలో కనపడతాడు, మంచి నటనని ప్రదర్శించాడు. అతను చాలా అనుభవం వున్న నటుడు కావటం, ఈ పాత్ర అతనికి కొత్తగా ఉండటం, అతను ఆ పాత్రని చాలా బాగా చెయ్యడం బాగుంది. అతని కెరీర్ లో ఈ పళని పాత్ర మంచిది అవుతుంది. మాళవిక శర్మ చాలా అందంగా వుంది, బాగా చేసింది, కానీ ఆమెని కొంచెం ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. జయప్రకాశ్ కి ఇలాంటి పాత్ర చెయ్యడం మామూలే, ఆ యాస అతనికి సూట్ కాలేదు. అర్జున్ గౌడ, రవి కాలే, లక్కీ లక్ష్యం అందరూ విలన్స్ గా కనపడతారు. కాదంబరి కిరణ్, వడ్లమాని శ్రీనివాస్ ఇంకా చాలామంది నటులు కనపడతారు.

చివరగా, 'హరోం హర' సినిమాలో సుధీర్ బాబుని ఒక మాస్ అవతార్ లో చూపించాడు దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా. హింసాత్మకంగా వుండే పోరాట సన్నివేశాలు చాలా వున్నాయి, ముందు బెంచీల్లో కూర్చున్న వాళ్ళకి ఇటువంటి యాక్షన్ సరిపోతుందేమో. కథలో కొత్తదనం లేదు, ఏమి జరుగుతుందో ముందే ఊహించుకోవచ్చు, రెండో సగం దర్శకుడు సరిగ్గా రాసుకోలేకపోయాడు, పూర్తిగా సాగదీశాడు.

Updated Date - Jun 14 , 2024 | 02:16 PM