Amaran Review: ‘అమ‌ర‌న్’ మూవీ తెలుగు రివ్యూ.. సాయి ప‌ల్ల‌వి.. సాయి ప‌ల్ల‌వి ఎంత చెప్పినా త‌క్కువే పో

ABN, Publish Date - Oct 31 , 2024 | 07:09 PM

సినిమా విడుద‌ల‌కు ముందే తెలిసిన క‌థ‌తో, శివ కార్తికేయ‌న్‌, సాయి ప‌ల్ల‌వి వంటి ప్ర‌తిభావంత‌మైన క్యాస్టింగ్‌తో మంచి బజ్‌ తెచ్చుకున్న చిత్రం ‘అమ‌ర‌న్‌’. దీపావ‌ళి ప‌ర్వ‌దినాన భారీ పోటీ మ‌ధ్య ఈ రోజు (అక్టోబ‌ర్‌31) న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ప‌దండి.

Amaran Movie Review Poster

సినిమా విడుద‌ల‌కు ముందే తెలిసిన క‌థ‌తో.. శివ కార్తికేయ‌న్‌, సాయి ప‌ల్ల‌వి వంటి ప్ర‌తిభావంత‌మైన క్యాస్టింగ్‌తో మంచి బజ్‌ తెచ్చుకున్న చిత్రం ‘అమ‌ర‌న్‌’. నిజ జీవితంలో జ‌రిగిన ఓ మిల‌ట‌రీ అధికారి క‌థ‌ను తెర‌కెక్కించ‌డం దానిని క‌మ‌ల్ హాస‌న్ రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్‌ , సోనీ పిక్ట‌ర్స్ వంటి ప్ర‌ముఖ సంస్థ‌లు స్వ‌యంగా నిర్మించ‌డంతో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చాలా సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తూ సౌత్ ఇండియా వ్యాప్తంగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న క‌థానాయిక‌ సాయి ప‌ల్ల‌వి సుమారు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ఈ చిత్రంలో న‌టించ‌డం కూడా క్రేజ్‌కు కార‌ణ‌మ‌యింది. దీపావ‌ళి ప‌ర్వ‌దినాన భారీ పోటీ మ‌ధ్య ఈ రోజు (అక్టోబ‌ర్‌31) థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ప‌దండి.

క‌థ‌:

2014లో క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌ను ఎదురించి వీర‌మ‌ర‌ణం పొందిన త‌మిళ‌నాడుకు చెందిన ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ బ‌యోగ్ర‌ఫీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ముకుంద్‌గా శివ కార్తికేయ‌న్‌, ముకుంద్ భార్య ఇందు రెబెకా వ‌ర్గీస్‌గా సాయి ప‌ల్ల‌వి న‌టించింది. ఐదేండ్ల ప్రాయంలోనే మిల‌ట‌రీ మార్చ్‌ను చూసి ఎప్ప‌టికైనా ఆర్మీలో చేరాల‌ని ముకుంద్ లక్ష్యంగా పెట్టుకుని, త‌న గ్రాడ్యుయేష‌న్ టైం నుంచి అందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అదే స‌మ‌యంలో త‌ను డిగ్రీ చ‌దువుతున్న‌ కాలేజీలోకి కొత్త‌గా మ‌ల‌యాళీ అయిన ఇందు రెబెకా వ‌ర్గీస్‌ చేర‌డం, వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం జ‌రిగిపోతాయి. ఆ పై ఆర్మీలో చేరిన ముకుంద్ ఇందును పెళ్లి చేసుకోవ‌డానికి వ‌చ్చిన ఇష్యూ, ఆర్మీలో కెప్టెన్‌గా, క‌మాండ‌ర్‌గా, మేజ‌ర్‌గా ఎద‌గ‌డం.. రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేష‌న్‌పై రావడం జరుగుతుంది. ఈక్ర‌మంలో ఇద్ద‌రు మోస్ట్ వాంటెడ్ తీవ్ర‌వాదుల‌ను అంత‌మొందించి ఎలా అమ‌రుడ‌య్యాడ‌నే నేప‌థ్యంలో సినిమా క‌థ‌ న‌డుస్తుంది.


ఎలా ఉందంటే:

ఈ సినిమాకు ముందు మ‌న తెలుగులో వ‌చ్చిన ‘మేజ‌ర్‌’, ఇంకా చాలా సినిమాల్లో చూసిన క‌థల‌ వంటిదే ఈ చిత్రం కొత్త‌గా చెప్ప‌డానికి ఏముంటుంది.. వాటి త‌ర‌హాలోనే ఇది కూడా ఉంటుందని అనుకునే వారి ఆలోచ‌న‌ల‌కు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఈ ‘అమ‌ర‌న్‌’. సినిమా ప్రారంభ‌మే ఇందు (సాయి ప‌ల్ల‌వి) కోణం నుంచి స్టార్ట్ చేసి చూసే ప్రేక్ష‌కుల‌ను కూడా త‌న‌తో పాటు ఆ క‌థ‌లోకి తీసుకెళ్లి భావోద్వేగ ప్ర‌యాణం చేయించారు. ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్ హంగుల జోలికి పోకుండా అంత స‌హజంగానే చూపించారు. ముఖ్యంగా మిల‌ట‌రీలో సైనికుల ట్రూపింగ్‌, ఉగ్ర‌వాదుల దాడుల స‌మ‌యంలో ఆర్మీకి ఎదుర‌య్యే స‌వాళ్లు, ఇంటి వ‌ద్ద కుటుంబ స‌భ్యుల అనుభ‌వించే క్షోభ‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు తెరకెక్కించారు.

అదే విధంగా ఉగ్ర‌వాదులను మ‌ట్టుబెట్ట‌డానికి మేజ‌ర్ ముకుంద్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి చేసిన‌ పోరాట స‌న్నివేశాలు మ‌నం అక్క‌డే ఉండి చూస్తున్న విధంగా చిత్రీక‌రించారు. మేజ‌ర్‌తో చివ‌రి వ‌ర‌కు ఉండి అమ‌రుడైన విక్ర‌మ్ స‌న్నివేశాలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్ర‌ధానంగా ముకుంద్‌కు పాప పుట్టాక వ‌చ్చే స‌న్నివేశాలు ముకుంద్ చ‌నిపోక‌ముందు త‌న ఫ్యామిలీతో మాట్లాడిన వీడియో కాల్ చూసే ప్రేక్షకులందరికీ కంట‌నీరు తెప్పిస్తుంది. అదేవిధంగా ముకుంద్ మ‌ర‌ణ‌వార్త విష‌యం ఇందుకు తెలిసే సంద‌ర్భం ఎంత‌టి క‌రుకు హృద‌యాల‌నైనా క‌రిగిస్తుంద‌నడంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చేప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ బ‌రువైన హృద‌యంతో బ‌య‌ట‌కు రావడం పక్కా..

ఎవ‌రెలా చేశారంటే..

మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్‌ పాత్ర‌కు శివ కార్తికుయ‌న్ అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోయాడు.. కాదు కాదు ఒదిగిపోయాడు. ల‌వ‌ర్‌గా, భ‌ర్త‌గా, ఆర్మీ ఆఫీస‌ర్‌గా త‌న కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. సాయి ప‌ల్ల‌వి శివ కార్తికేయ‌న్ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ సూప‌ర్‌గా ఉండ‌డ‌మే కాక వారి వారి పాత్ర‌ల్లో జీవించేశారని చెప్పొచ్చు. ఇక సాయి ప‌ల్ల‌వి విష‌యానికి వ‌స్తే.. ఒంటిచేత్తో సినిమా మొత్తాన్ని న‌డిపించిన‌ట్లు అనిపిస్తుంది. త‌ను న‌వ్వితే మ‌నం న‌వ్వ‌డం, త‌ను బాధ ప‌డితే మ‌నం బాధ ప‌డ‌డం, త‌ను ఏడిస్తే మ‌న‌కు ఏడుపు రావ‌డం ఇలా ప్ర‌తీదీ సాయి ప‌ల్ల‌వి ఎమోష‌న్‌ చుట్టే ప్రేక్ష‌కులు న‌డిచారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ముకుంద్ ఇందుతో ఫోన్‌లో మాట్లాడుతూ ఓ ట్ర‌క్‌లో వెళ్తున్న‌ప్పుడు స‌డ‌న్‌గా ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డం, ఫోన్ ఆన్‌లోనే ఉండడంతో గ‌న్‌ల శ‌బ్దాలు, సైనికుల ఆర్త నాదాలు ఇవ్వ‌న్ని వింటూ ఇందు పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి చేసిన న‌ట‌న, పండించిన ఎమోష‌న్స్ న‌భూతో న భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉన్నాయి. ఈ న‌ట‌న‌కు గాను సాయి ప‌ల్ల‌వికి ఒక్క‌టేం క‌ర్మ ప్ర‌తి ఎమోష‌న్‌కు ఓ నేష‌న‌ల్ అవార్డు గానీ అంత‌కుమించి మ‌రే అవార్డు ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా ఇచ్చేయ‌వ‌చ్చు.

అదే విధంగా జీవీ ప్ర‌కాశ్ సంగీతం ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్‌గా నిలిచింది. సినిమాకు ఆయువు ప‌ట్టు అయింది. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు ఉన్న ఒక‌టి రెండు పాటలు కూడా బాగా అమ‌రాయి. ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ పెరియ స్వామి ఎంతో అనుభ‌వం ఉన్న వాడిగా వంద‌ల సినిమాలు తీసిన డైరెక్ట‌ర్‌లా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఓ రియ‌ల్ స్టోరీని ఎక్క‌డా క‌థ ప‌ట్టు త‌ప్ప‌కుండా, ప్రేక్ష‌కుడికి సీటు మీద నుంచి లేచి పోదామ‌నే స‌మ‌యం ఇవ్వ‌కుండా త‌న టేకింగ్‌తో క‌ట్టి ప‌డేశాడు. ముఖ్యంగా క‌శ్మీర్ నేప‌థ్యంలో వ‌చ్చే సినిమాలు, పోరాట దృశ్యాలు హాలీవుడ్ సినిమాల‌ను త‌ల‌పించాయి. ఓ అమ‌ర వీరుడికి ఘ‌న‌మైన నివాళి ఇచ్చాడు దర్శకుడు.

ట్యాగ్‌లైన్: అమ‌ర‌న్.. క‌ళ్లు చెమ‌ర్చున్‌

Updated Date - Oct 31 , 2024 | 07:34 PM