Bharateeyudu 2 Review: శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ 'భారతీయుడు 2' మెప్పించిందా లేక...

ABN, Publish Date - Jul 12 , 2024 | 01:14 PM

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించింది. అదే జంట ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకి సీక్వల్ గా 'భారతీయుడు 2' గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాల ఎలా వుందో చదవండి

Bharateeyudu 2 Movie Review

సినిమా: భారతీయుడు 2

నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, బాబీ సింహ, ఎస్.జె. సూర్య, వివేక్ తదితరులు

సంగీతం: అనిరుద్ రవిచందర్

ఛాయాగ్రహణం: రవి వర్మన్

నిర్మాతలు: సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్

రచన, దర్శకత్వం: ఎస్ శంకర్

విడుదల తేదీ: జులై 12, 2024

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

తమిళ దర్శకుడు ఎస్ శంకర్ సినిమా అంటేనే సినిమా ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అతను ఒక సామాజిక సమస్యని తీసుకొని, ఆ సమస్యని వ్యాపారాత్మకమైన అంశాలు జోడించి తన సినిమాలో చూపిస్తూ వుంటారు. అతని సినిమాలు 'జెంటిల్ మాన్', 'ప్రేమికుడు', 'భారతీయుడు', 'జీన్స్', 'ఒకే ఒక్కడు', 'బాయ్స్', 'అపరిచితుడు', 'శివాజీ', ఇలా అన్ని సినిమాలలో ఒక సామజిక సమస్యని ఎట్టి చూపుతూ వ్యాపారాత్మక అంశాలు జోడించి ప్రేక్షకులని రంజింప చేసాడు. అలాంటి సినిమాలలో 'భారతీయుడు' ఒకటి. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 28 సంవత్సరాల క్రితం వచ్చింది, అప్పట్లో సంచలనం సృష్టించింది. అవినీతిని అంతమొందించే సేనాపతిగా కమల్ హాసన్ అద్భుతమైన నటన కనపరిచారు. ఇప్పుడు ఆ 'భారతీయుడు' కి సీక్వల్ గా 'భారతీయుడు 2' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్, బాబీ సింహ, సముద్రఖని లాంటి నటులు వున్నారు. కమల్ హాసన్ సేనాపతి పాత్రలో భారతీయుడుగా ఈసారి ఏమి చేశారు, శంకర్ ఎలా సినిమా తీశారు, ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం. (Bharateeyudu Review)

Bharateeyudu 2 కథ:

చిత్ర (సిద్ధార్థ్) తన టీముతో బార్కింగ్ డాగ్స్ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటాడు. ఇందులో అవినీతి చేస్తున్న అధికారుల గురించి తనదైన శైలిలో కార్టూన్స్ రూపంలో చూపిస్తూ చాలా పాపులర్ అవుతూ వుంటారు. అలాగే అవినీతి అధికారులను అరెస్టు చెయ్యాలని తన టీము సభ్యులతో ధర్నాలు కూడా చేస్తూ ఉంటాడు. అయితే పోలీసులు వీళ్ళని లెక్క చెయ్యకుండా పక్కన పడేస్తారు, ఒకసారి అరెస్టు చేస్తారు. ఇక చేసేది లేక ఈ అవినీతి అంతమొందాలంటే భారతీయుడు (కమల్ హాసన్) మళ్ళీ రావాలని ఒక హ్యాష్ టాగ్  మొదలుపెట్టి వైరల్ చేస్తారు. చిత్ర స్నేహితుడు ఒకరు భారతీయుడుని తైపీ నగరంలో చూశానని చెపుతాడు. అక్కడ భారతీయుడు (కమల్ హాసన్) ఒక వ్యాపారవేత్త (గుల్షన్ గ్రోవర్) న్యూ ఇయర్ క్యాలండర్ కోసం కొంతమంది మోడల్స్ తో సముద్రంలో చిత్రీకరణ చేస్తూ ఉంటాడు. అవినీతిపరుడైన ఆ వ్యాపారవేత్తని భారతీయుడు చంపేస్తాడు. అక్కడనుండి మొదలవుతుంది అవినీతిపరులపై భారతీయుడు వేట. ఇక తాను భారతదేశం వెళ్లాల్సిన పరిస్థితి ఆసన్నమైందని చెపుతాడు. చిత్ర టీము చేసిన యూట్యూబ్ వీడియోలు అన్నిటినీ చూస్తున్నాను అని చెపుతాడు. ఇక్కడ ఇండియాలో సిబిఐ అధికారి ప్రమోద్ (బాబీ సింహ) భారతీయుడుని ఇండియా వస్తున్నాడని తెలుసుకొని విమానాశ్రయంలో కాపు కాస్తాడు. ఇక ఇక్కడ నుండి భారతీయుడు, సిబిఐ అధికారి, అవినీతిపరుల మధ్య సాగే ఆటలు ఎలా సాగుతాయి? భారతీయుడు చివరికి పోలీసుల చేతికి చిక్కుతాడా? చిత్రకి తన తండ్రి గొప్ప నిజాయితీపరుడైన విజిలెన్సు అధికారి (సముద్రఖని) అని నమ్మకం, అతను అనుకున్నట్టుగానే తండ్రి అంత నిజాయితీపరుడా? చిత్ర కుటుంబం ఎందుకు అతన్ని చీదరించుకుంది? రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'భారతీయుడు 2' చూడాల్సిందే. (Bharateeyudu2 Movie Review)

విశ్లేషణ:

దర్శకుడు శంకర్ సినిమా అనగానే ప్రేక్షకుడు చాలా పెద్దగా, గొప్పగా ఆశిస్తాడు. సినిమాలో చాల గొప్ప విషయం ఉంటుందని అనుకుంటాడు. ఇంతకు ముందు అతను చేసిన సినిమాలే అందుకు నిదర్శనం, అందుకే అతని సినిమాలపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఈసారి 28 ఏళ్ల క్రితం తీసిన 'భారతీయుడు' సినిమాకి సీక్వల్ గా ఇప్పుడు 'భారతీయుడు 2' తీసాడు. ముందు సినిమాలో చెప్పినట్టుగానే, ఈ సినిమాలో కూడా లంచం నేపధ్యంగా, అవినీతిపైనే యుద్ధాన్ని ప్రకటించాడు. (Kamal Haasan and Shankar combination Bharateeyudu 2 Review)

ఇంతవరకు బాగానే వుంది. కానీ శంకర్ ఈసారి ఈ సినిమాకి ఇంకో సీక్వల్ కూడా వుంది అని ప్రకటించేశాడు. అది 'భారతీయుడు 3' గా 2025లో వస్తోంది అని. అయితే ఇలా సీక్వల్స్ గా తీస్తున్నామని ముందుగానే ప్రకటించడంతో శంకర్ ఈ 'భారతీయుడు 2' లో తను అనుకున్నది కొంచెం చెప్పలేకపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా పాత్రలను అసంపూర్ణంగా వదిలేశాడు. అదీ కాకుండా ఈ సినిమాలో ప్రీచింగ్ ఎక్కువయిపోయింది. 'భారతీయుడు' సినిమాలో సేనాపతి అవినీతి పరులను అంతమొందించే విధానం ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకేస్తుంది. ఆ సినిమాలో అతని కుటుంబానికి జరిగిన అన్యాయం, భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ 'భారతీయుడు 2' కి వచ్చేసరికి మాత్రం యాక్షన్ కి బదులు, భారతీయుడు చెప్పే సోది ఎక్కువయిపోయింది. అది కొంచెం ప్రేక్షకులకి అసహనంగా ఉంటుంది. దానికితోడు సినిమా మూడు గంటల నిడివి ఉండటం కూడా ఆ అసహనం ఎక్కువవడానికి తోడవుతుంది. భావోద్వేగాలు కనిపించవు, సినిమాలో రాబోయే సన్నివేశాలని ప్రేక్షకుడు ముందుగానే ఊహించే విధంగా ఉంటడం వలన ఆసక్తి తగ్గిపొతుంది.

సినిమా మొదలవడం బాగానే మొదలుపెట్టారు, హెల్త్ ఇష్యూ, ఎడ్యుకేషన్ విభాగాల్లో అవినీతి వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాలు బాగా చెప్పారు. కానీ భారతీయుడు వచ్చి ఈ అవినీతి పరులని ఎలా సమాజానికి చూపిస్తాడు, ఎలా వాళ్ళని దోషిగా నిలబెడతారు అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు, కానీ దర్శకుడు ఆ సన్నివేశాలన్నీ చాలా చప్పగా తీసేశాడు. ముందుగా చెప్పినట్టుగా ప్రీచింగ్ తో పాటు, చాలా సన్నివేశాలని సాగదీశాడు కూడా. శంకర్ సినిమా అనగానే ప్రేక్షకుడు ఒక గొప్పదైన (grandeur) సన్నివేశాలు ఆశిస్తాడు, కానీ సినిమాలో ఎక్కడా అవి కనిపించవు. రెండో సగంలో ఒకటి రెండు భావోద్వేగ సన్నివేశాలు తప్పితే అంత ఆకట్టుకునే సన్నివేశాలు లేవనే చెప్పాలి. 28 ఏళ్ల క్రితం 'భారతీయుడు' సినిమా తీశాడు అంటే అది అప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. లంచగొండితనంపై ఆ సినిమా అప్పట్లో సంచలనం అయింది.

అయితే శంకర్ అదే లంచం, అదే అవినీతిపై ఇప్పుడు పెద్ద స్కేల్ లో చెప్పాలని అనుకున్నాడు, కానీ పూర్తిగా విఫలం అయ్యాడు అనే చెప్పాలి. దానికితోడు చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా అనిపించాయి. ఎక్కడా సహజత్వం కనిపించదు. శంకర్ సినిమాలో వుండే అద్భుతమైన ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాలో లోపించాయి. అవన్నీ మామూలుగా వున్నాయి. రెండో సగంలో వచ్చే ఆ ఛేజింగ్ సన్నివేశం మరీ సాగదీసేశాడు. వెరసి శంకర్ 'భారతీయుడు 2' ఒక మామూలు సినిమా అయిపొయింది. ఈ సినిమా చూసి ఆందోళన పడాల్సింది ప్రేక్షకులతో పాటు, ఇంకొక నిర్మాత అయిన దిల్ రాజు. ఎందుకంటే అతను శంకర్ తో 'గేమ్ చెంజర్' అనే సినిమా చేస్తున్నారు. అది కూడా లంచగొండితనం, అవినీతిపైనే పోరాటం. ఈ సినిమా చూశాక సగటు సినిమా ప్రేక్షకుడికి ఆ సినిమా ఎలా వుండబోతోంది అనే ఆందోళన మొదలైంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే కమల్ హాసన్ వివిధ రూపాల్లో వైవిధ్యంగా కనపడతారు. అతని గొంతు రకరకాలుగా వుంది. కొన్ని సార్లు సూటయింది, కొన్నిసార్లు ఏదోలా వుంది. సిద్ధార్థ్ ఒక యూట్యూబర్ పాత్రలో మంచి నటన కనపరిచాడు. రెండో సగంలో అమ్మ పోయినప్పుడు చేసే సన్నివేశంలో బాగా చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర అంతగా లేదు. ప్రియా భవానీ శంకర్ తన పాత్రకి తగ్గట్టుగా చేసింది. బాబీ సింహా సిబిఐ అధికారిగా బాగున్నాడు. సముద్రఖని పాత్రలో కొత్తదనం లేదు. ఎస్.జె.సూర్య కేవలం రెండు మూడు సన్నివేశాలకు పరిమితం. జాకిర్ హుస్సేన్, పీయూష్ మిశ్రా ఇంకా చాలామంది నటీనటులు కనపడతారు, అందరూ తమ పాత్రల పరితది మేరకి చేశారు.

చివరగా, 'భారతీయుడు 2' సినిమా శంకర్ సినిమాలపై పెంచుకున్న అంచనాలకి తగినట్టుగా లేకపోవటం కొంచెం నిరాశ పరుస్తుంది. 'భారతీయుడు' సినిమా అనేది ఒక సంచలనం అప్పట్లో, అది ఆలా వదిలేసి శంకర్ వేరే కథని సినిమాగా చేస్తే బాగుండేదేమో, కానీ అదే సినిమాకి సీక్వల్ గా తీసి, ఇందులో కథని మరీ సినిమాటిక్ గా తీసేసి చూపించేసాడు. మళ్ళీ దీనికి మూడో పార్టు కూడాను. రెండో పార్టు చూశాక, మూడు పార్టు కూడానా అని ప్రేక్షకుడు పెదవి విరుస్తూ బయటకి వస్తాడు. శంకర్ తన మేజిక్ టచ్ కోల్పోయారా అని అనిపిస్తుంది ఈ సినిమా చూసి, మరి తెలుగు ప్రేక్షకుల్లో ఆందోళన ఏంటంటే, శంకర్ రామ్ చరణ్ తో చేస్తున్న 'గేమ్ చెంజర్' పరిస్థితి ఎలా ఉంటుందో? చూడాలి మరి!

Updated Date - Jul 12 , 2024 | 05:04 PM