Zebra Review: సత్యదేవ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Nov 22 , 2024 | 11:07 PM
ప్రతిభ ఉన్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. అవకాశాలు అందుతున్నాయి.. సినిమాలు చేస్తున్నాడు కానీ కాలం కలిసి రావడం లేదు. అతను అందుకున్న అవకాశాలకు ఇప్పటికే మంచి బ్రేక్ రావాలి కానీ పరాజయాలు వెంటాడుతున్నాయి. చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో నెగటివ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినిమా రివ్యూ: జీబ్రా
విడుదల తేది: 22–11–2024
నటీనటులు: సత్యదేవ్(Satya Dev), డాలీ ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యర్, సునీల్, సత్య తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సత్యం పొన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటింగ్: అనిల్ క్రిష్
నిర్మాత: ఎస్‌ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేశ్ సుందరం
దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ (Zebra movie Review)
ప్రతిభ ఉన్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. అవకాశాలు అందుతున్నాయి.. సినిమాలు చేస్తున్నాడు కానీ కాలం కలిసి రావడం లేదు. అతను అందుకున్న అవకాశాలకు ఇప్పటికే మంచి బ్రేక్ రావాలి కానీ పరాజయాలు వెంటాడుతున్నాయి. చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో నెగటివ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా వల్లే ’జీబ్రా’ (zebra)అవకాశం తెచ్చింది. దీనికి పుష్పలో జాలి రెడ్డి క్యారెక్టర్‌తో పాపులర్ అయిన డాలీ ధనుంజయ తోడవ్వడంతో సినిమాకు హైప్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావడంతో బజ్ మరింత పెరిగింది. అంతే కాదు తన కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ సినిమా అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. మరీ చిత్రం సత్యదేవ్ కోరుకునే బ్రేక్ ఇచ్చిందా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!
కథ: (Zebra movie Story)
సూర్య (సత్యదేవ్) బాట్ అనే బ్యాంక్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేస్తాడు. తన జీతం కూడబెట్టుకొని ఓ సొంత ఇల్లు కొనుగోలు చేసి స్వాతి (ప్రియా భవానీ శంకర్)ని పెళ్లి చేసుకోవాలనేది సూర్య కల. స్వాతి కూడా బ్యాక్ ఉద్యేగే. అనుకోకుండా ఓ రోజు స్వాతి చేసిన చిన్న తప్పు వల్ల ఓ వ్యక్తి వేసిన చెక్ రాంగ్ అకౌంట్‌లో జమ అవుతుంది. డిపాజిటర్ బ్యాంక్ దగ్గరకి వచ్చి ఎలాగైనా తన డబ్బు వెంటనే ఇప్పించాలని గోల చేస్తాడు. విషయం తెలుసుకున్న సూర్య లూప్ హోల్స్‌ని వాడుకొని ఏదోలా ఆ డబ్బుని సరి చేస్తాడు. ఇంతలో ఓ ఐదు కోట్ల రుపాయలు. సూర్య పేరుతో ఉన్న అకౌంట్‌లో జమా అవుతాయి. వెంటనే ఆకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అసలు ఇంత డబ్బు తన పేరుమీద వున్న నకిలీ ఖాతాలోకి ఎలా వచ్చిందో సూర్యకు అంతుచిక్కదు. ఇంతలో ఆది (డాలీ ధనంజయ)అనే గ్యాంగ్ స్టర్ ఆ ఐదు కోట్లు తనవేనని, నాలుగు రోజుల్లో ఆ డబ్బుని తన అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ కావాలని టైమ్ పెడతాడు. తర్వాత ఏం జరిగింది. సూర్య పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసింది ఎవరు? అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయ్యింది? కోట్లకు అధిపతి అయిన ఆది ఆ ఐదు కోట్ల కోసం సూర్య వెంట ఎందుకు పడ్డాడు? అన్నది కథ.
విశ్లేషణ: (Zebra movie Review)
జీబ్రా కథపై ఉన్న నమ్మకంతో ఐదు నిమిషాల కథను ముందుగానే రిలీజ్ చేశారు చిత్ర బృందం. బ్యాంకు, అందులో ఉండే లూప్ హోల్స్ చుట్టూ సాగే ఐదు నిమిషాల పుటేజ్ నిజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాల్ని ఆధారం చేసుకుని అల్లుకున్న కథ ఇది. దీన్ని గ్యాంగ్‌స్టర్ ప్రపంచంతో లింక్ చేసి భిన్నమైన కథను తెరపై చూపించాలనుకున్నాడు దర్శకుడు. ఇలాంటి కథను గందరగోళం లేకుండా ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా చెప్పాలి. ఈ కథలో మనీ లాండరింగ్, గ్యాంగ్ స్టర్ అనే మరో రెండు కోణాలున్నాయి. బ్యాంక్ రిలేషన్షిప్ మ్యానేజర్ సూర్య తన పాయింట్ వ్యూ నుంచి ఈ కథని ఆసక్తికరంగానే మొదలుపెడతాడు. ముఖ్యంగా చెక్ రాంగ్ డిపాజిట్ చేసిన తీరు, తదుపరి బ్యాంక్ లోని లూప్ హోల్స్‌ని వాడుకొని ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం చూసినప్పుడు దర్శకుడు బ్యాంకింగ్ వ్యవస్థని బాగా అవపోసన చేశాడనిపిస్తుంది. ముందు ఏం జరగబోతోందా అనే ఆసక్తిని క్రియేట్ చేశాడు. గ్యాంగ్‌స్టర్ ఆది, మనీ లాండరింగ్ కోణంలో గుప్తా (సునీల్) పాత్రలు ఎంటర్ అయినతర్వాత కథ కాస్త మందగిస్తుంది. 5 కోట్లు చుట్టూ నడిపిన డ్రామాలో కాన్‌ఫ్లిక్ట్ సరిగ్గా కుదరదు. పరువు అనే ఫీలింగ్‌పై ఆ సంఘర్షణలు నడిపిన అది ఆడియన్స్‌కి ఎక్కదు. రాష్ట్రంలో ఎలక్షన్‌కి సరిపడా డబ్బు ఇవ్వగలిగే గ్యాంగ్ స్టర్ ఆది, కామెడీ విలన్ దగ్గర పరువు పోయిందని ఫీలైపోతూ సూర్య వెంటపడతాడు. ఆ సన్నివేశాలు తెరపై అంత రక్తి కట్టించకపోగా, సిల్లీగా అనిపిస్తాయి. ద్వితీయార్థంలో ప్రేక్షకులకు కిక్ ఇచ్చే హైమూమెంట్స్ పెద్దగా లేవు. ఓ దొంగతనం ఎపిసోడ్‌లో సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచాడు. చివరికి సంపాదించిన డబ్బును బ్యాంక్‌లో పెట్టేందుకు హీరో గ్యాంగ్ పడే కష్టాలను, ఆ ట్విస్ట్‌లతో కథను ముగించిన తీరు బావుంది.
నటీనటుల విషయానికొస్తే (Zebra movie Review) .. సూర్య పాత్రలో సత్యదేవ్ చక్కగా సరిపోయాడు. సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలతో పోల్చుకుంటే కూల్ అండ్ ఫన్ ఫుల్ క్యారెక్టర్ ఇది. గ్యాంగ్‌స్టర్ ఆదిగా డాలీ ధనంజయ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఆ పాత్రను ఇంకాస్త మంచిగా తీర్చిదిద్దే బావుండేది. ప్రియా భవానీ ఎప్పటిలానే పద్దతిగా కనిపించింది. షీలా పాత్రలో జెన్నిఫర్ నార్త్ టచ్‌తో సాగే క్యారెక్టర్. సునీల్ పాత్ర కొత్తగా డిజైన్ చేశాడు. కొన్ని చోట్ల సీరియస్ గా ఇంకొన్ని చోట్ల పిచ్చి లైట్ గా కనిపించే క్యారెక్టర్ అది. సత్యరాజ్ పాత్ర స్ట్టాక్ మార్కెట్ ఎపిసోడ్‌లో కీలకంగా వుంటుంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ చెప్పాలనుకున్న జానర్‌లో కొత్తదనంతో ఉన్నా ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో తడబడ్డారు. హీరో పాత్రను మినహా మరే పాత్రను చక్కగా డిజైన్ చేసుకోలేకపోయారు. రవిబస్రూర్ సంగీతం సోసోగా ఉంది. పాటలు కూడా ఆకట్టుకోలేదు. నిడివి కాస్త తగ్గించాల్సింది. కెమెరా పనితనం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. బ్యాంక్ లూప్ హోల్స్‌ని బేస్ చేసుకొని రాసుకున్న కథలో కొన్ని పాయింట్స్‌ని సరి చేసుకుని తెరకెక్కించి ఉంటే జీబ్రా మరింత థ్రిల్ కలిగించేది.
ట్యాగ్ లైన్: జీబ్రా లైన్స్‌లాగే... లిటిల్ బిట్ కన్‌ఫ్యూజింగ్..