Citadel Review: సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఎలా ఉందంటే 

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:11 AM

రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. వినూత్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ‘ఫ్యామిలీమ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లతో అలరించిన ఈ దర్శక ద్వయం వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా ‘సిటడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌ను తెరకెక్కించారు.

రివ్యూ: సిటడెల్‌: హనీ బన్నీ (Citadel Review)
ఓటీటీ: అమేజాన్‌ ప్రైమ్‌
నటీనటులు: వరుణ్‌ ధావన్‌, సమంత, కేకే మేనన్‌, సికందర్‌ ఖేర్‌, సిమ్రన్‌, షకీబ్‌ సలీమ్‌ తదితరులు


సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రపీ : జోహాన్ హెర్లీన్  

మ్యూజిక్: సచిన్ జిగర్, 

రచన: సీత.ఆర్‌ మేనన్‌, రాజ్‌ అండ్‌ డీకే

నిర్మాణం: అమెజాన్ ప్రైమ్ ఇండియా 

దర్శకత్వం: రాజ్‌ అండ్‌ డీకే (Raj and Dk)


రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. వినూత్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ‘ఫ్యామిలీమ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లతో అలరించిన ఈ దర్శక ద్వయం వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా ‘సిటడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌ను తెరకెక్కించారు. యాక్షన్‌ డ్రామా, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌ అనుకుని హనీ పాత్ర కోసం సమంతను సంప్రదించే సమయానికి ఆమె మయోసైటిస్‌తో బాధపడుతోంది. ఆ ఆఫర్‌ను తిరస్కరించినా దర్శకులు మాత్రం ఆమెపై పూర్తి నమ్మకం ఉంచి ఆమె కోలుకునే వరకూ ఎదురుచూశారు.. మరి దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే సమంతపై ఉంచిన నమ్మకం నిజమైందా? ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌–2 తర్వాత సమంత నటించిన సిరీస్‌ ఈ సిరీస్‌ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అన్నది చూద్దాం.  



కథ: (Citadel Honey bunny)

హనీ (సమంత-Samantha)) నైనిటాల్‌లోని ఓ కాఫీ షాప్‌లో వర్క్‌ చేస్తుంటుంది. ఆమెకు నదియా అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన హనీని ఓ వ్యక్తి ఫాలో అవుతుంటాడు. అది గమనించి అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో హనీ దొరికిపోతుంది. ఏదోలా అక్కడి నుంచి తప్పించుకునితన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోతుంది. హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొందరు వ్యక్తులు అక్కడికి కూడా వస్తారు. మరోవైపు చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం విదేశాల్లో ఉన్న బన్నీ (వరుణ్‌ ధావన్‌)కి తెలుస్తుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు పయనమవుతాడు. అసలు హనీ వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు?  ఆమె గతం ఏంటి? భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు హనీని, తన బిడ్డ నదియాను బన్నీ కలిశాడా? ప్రైవేటు సీక్రెట్‌ ఏజెన్సీ నాయకుడు గురు (కేకే మేనన్‌) ఒకవైపు,  ‘సిటడెల్‌’ టీమ్‌ మరోవైపు వెతుకుతున్న అర్మార్డ్‌ అనే వస్తువు ఏంటి? చివరకు అది ఎవరి వశమైంది అన్నది ఇతివృత్తం. సిటాడెల్‌ సిరీస్‌ ఆరు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్‌ అయింది.


1 డాన్సింగ్‌ అండ్‌ ఫైటింగ్‌
2 తల్వార్‌
3 స్పైగేమ్‌
4 హోమ్‌
5 ట్రైయిటర్‌
6 ప్లే

ఇలా ఆరు టైటిళ్లతో విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉందో చూద్దాం.


ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్‌ను రెండు పార్టులుగా డివైడ్‌ చేశారు. ఒకటి 1992లో మరొకటి 2000 సంవత్సరంలో జరుగుతున్నట్లు చూపిస్తూ నాన్‌–లీనియర్‌ స్ర్కీన్‌ప్లేతో స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం జరిగే కథ, పాత్రలకు ఉన్న ప్లాష్‌ బ్యాక్‌ ఏంటనేది ఒకదానితో ఒకటి కనెక్ట్‌ చేసినా, ఎక్కడా కన్‌ఫ్యూజ్‌ లేకుండా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించారు. మొదటి రెండు ఎపిసోడ్‌లలో సిరీస్‌లోని కీలక పాత్రలు వారి నేపథ్యాలు, అసలు కథేంటి అనేది పరిచయం చేశారు. ఈ రెండు ఎపిసోడ్స్‌ లెంగ్త్‌తో ఎక్కువ అయినట్లు అనిపించింది. 80–90ల కాలంలో సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉండేదనే విషయాన్ని హనీ పాత్రతో చూపించారు. ఉన్నతమైన రాజ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అయినా, సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధించేవార వంటి విషయాలను చర్చించారు. అయితే భావోద్వేగాలు పలికించాల్సిన సమయంలో ఎక్కడా భావోద్వేగం లేదు. కట్టుబాట్లను తెంచుకుని మహిళా సాధికారిత దిశగా అడుగులు వేసిన యువతిగా హనీ క్యారెక్టర్‌ బావుంది.

తర్వాత మూడో ఎపిసోడ్‌ నుంచే అసలు కథేంటనేది మొదలవుతుంది. ప్రపంచాన్ని, దేశంలో అగ్ర నేతలను సైతం శాసించే శక్తిగల అర్మార్డ్‌ వస్తువును దక్కించుకోవడానికి గురు టీమ్‌ ప్రయత్నాలు చేయడం, వాటిని ‘సిటడెల్‌’ బృందం అడ్డుకోవడం కొత్తగా అనిపించలేదు. రెగ్యులర్‌ రొటీన్‌ రివేంజ్‌లాగే అనిపించింది. అక్కడక్కడా ఆసక్తిగా సాగింది. ఈ క్రమంలో సాదారణ యువతిగా ముంబయి వచ్చిన హనీ ఏజెంట్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులు, ఆమె తీసుకున్న శిక్షణ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. తదుపరి ఎపిసోడ్‌లో  కథ బెల్‌గ్రేడ్‌ సిటీకి షిఫ్ట్‌ అయిన తర్వాత అందరూ వెతుకుతున్న అర్మార్డ్‌ శక్తి ఏంటి? దాంతో ఏం చేయవచ్చు? అన్న ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. దాని ప్రభావం ఏంటో ఎగ్జాంపుల్‌ చెప్పి ఉంటే ఇంకాస్త ఆసక్తి రేకెత్తించేది. ఈ అర్మార్డ్‌ను దక్కించుకోవడానికి హనీ, బన్నీలు ఆడే గేమ్‌ ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సాగిపోతుంది. డాక్టర్‌ రఘును (తలైవాసల్‌ విజయ్‌) బన్నీ హత్య చేయడంతో కథ టర్న్‌ అవుతుంది. అప్పటివరకూ మంచి కోసం ప్రయత్నిస్తున్నారనుకున్న  పాత్రలో నెగెటివ్‌ యాంగిల్‌ ఒక్కసారిగా బయటకొస్తుంది. ‘సిటడెల్‌’ టీమ్‌లో ఉంటూ గురుకు సహకరించే వ్యక్తి ఎవరో బయటపడే ట్విస్ట్‌ అలరిస్తుంది. అప్పటిదాకా హైడ్‌ అండ్‌ సీక్‌ ఆడిన హనీ, బన్నీల చివరి ఎపిసోడ్‌కు వచ్చేసరికి యాక్షన్‌ మోడ్‌లోకి దిగిపోతారు. ఇక ఎండ్‌ కార్డ్‌ పడింది అనేకునేలోపు  కేడీ (షకీబ్‌ సలీమ్‌) పాత్రను దించి సిరీస్‌ను ఇంకా కొనసాగించినట్లు అనిపిస్తుంది. రాజమహల్‌లో జరిగే 20 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది.



నటీనటుల (Citadel Review) విషయానికొస్తే.. బన్నీ పాత్రలో వరుణ్‌ ధావన్‌ ఎప్పటిలాగే చక్కగా అభినయించాడు. అయితే ఈ సిరీస్‌కు ప్రాణం హనీ పాత్ర ఆ పాత్రకు సమంత పూర్తి న్యాయం చేశారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ సన్నివేశాల కంటే ఏజెంట్‌, మదర్‌ సీన్స్‌ చేసినప్పుడు సమంతలో మెచ్యూరిటీ కనిపించింది. ఫైట్స్‌ కోసం ఆమె పడిన కష్టం స్ర్కీన్‌ మీద కనిపిస్తుంది. సమంత, వరుణ్‌ మధ్య సన్నివేశాల్లో యాక్షన్‌ సీక్వెన్సుల్లో కెమిస్ర్టీ బావుంది. బాబాగా కేకే మీనన్‌ నటన బావుంది. సిమ్రాన్‌ కీలక పాత్ర చేశారు. సమంత కుమార్తెగా నటించిన ‘బేబీ’ కష్వీ మజుందార్‌ నటన క్యూట్‌గా ఉంది.  రుద్ర ప్రతాప్‌ పాత్రలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో యష్‌ పూరి, రఘు పాత్రలో తలైవాసల్‌ విజయ్‌ కనిపించారు. దర్శక ద్వయం సామ్‌ పై ఉంచిన నమ్మకం వమ్ము కాలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అయితే నిడివి కాస్త ఎక్కువే.  రివేంజ్‌ తరహా కథతో వచ్చిన ఈ సిరీస్‌ కొత్త కథ కాకపోయినా దర్శక ద్వయం తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఓటీటీ వీక్షకుల అభిరుచి బాగా తెలిసిన దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే. థ్రిల్‌తో భావోద్వేగాలను పంచుతారు. అయితే వారి గత సిరీస్‌లు కుటుంబ బంధాలు, భావోద్వేగాలను ఇచ్చిది ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జి సిరీస్‌లు తీసి విజయం అందుకున్నారు. ‘సిటాడెల్‌’ చూస్తే ఆ ఎలిమెంట్స్‌ మిస్‌ అయిన భావన కలిగింది. అయితే కుటుంబ సమేతంగా చూసే సిరీస్‌ ఇదని చెప్పొచ్చు. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ చిత్రాల నుంచి మిషన్‌ ఇంపాజిబుల్‌ వరకూ స్పై యాక్షన్‌ జానర్‌లో సినిమా అయినా, ఇప్పుడు అలరిస్తున్న వెబ్‌సిరీస్‌లైనా కథ ఒకటే ఉంటుంది. ప్రపంచాన్ని శాసించి, తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే నియంత. అందుకు అవసరమైన ఆయుధాలు, శక్తిని, డబ్బును వాటిని నియంత్రించడం ద్వారా తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటాడు. ఏజెంట్‌ అయిన కథానాయకుడు రంగంలోకి దిగి వారిపై యుద్థం చేయడంతో కథ ముగుస్తుంది. వాటిలో కథానాయకుడు లేదా నాయిక  చేేస యుద్ధం ఎంత ఉత్కంఠగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ‘సిటడెల్‌: హనీ బన్నీ’  జస్ట్‌ ఓకే అనిపించుకునేలా ఉంది. కథలో కొత్తదనవ లేకపోయినా తెరపైకి తీసుకురావడంలో రాజ్‌ అండ్‌ డీకే టీమ్‌ బాగానే కష్టపడింది.


ట్యాగ్‌లైన్‌: సిటడెల్‌ జస్ట్‌ యాక్షన్‌ అంతే..  

Updated Date - Nov 08 , 2024 | 03:13 AM