Roti Kapda Romance Review: 'రోటి కపడా రొమాన్స్‌' ఎలా ఉందంటే

ABN, Publish Date - Nov 28 , 2024 | 05:47 PM

కథ, కథనం బావుండాలి కానీ సినిమా చిన్నదా, పెద్దదా అన్నది పెద్దగా పట్టించుకోవడం లేదు.. నేటి ప్రేక్షకులు. ఈ తరాన్ని టార్గెట్‌ చేసే చిత్రాలయితే యూత్‌ఫుల్‌గా ఉంటే చాలు... యువతరం బ్రహ్మరథం పడతారు. అలాంటి కంటెంట్‌తోనే 'రోటి కపడా రొమాన్స్‌’ చిత్రం తీశానని చెప్పారు దర్శకుడు విక్రమ్‌

సినిమా రివ్యూ: రోటి కపడా రొమాన్స్‌..(Roti Kapda Romance Review)
విడుదల తేది: 28-11-2024
నటీనటులు: హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగ, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు.
కెమెరా: సంతోష్‌ రెడ్డి
సంగీతం: సన్నీ ఎం.ఆర్‌, ఆర్‌ఆర్‌ ధ్రువన్‌, హర్షవర్శన్‌ రామేశ్వర్‌,
నిర్మాణ సంస్థ: లక్కీ మీడియా (Lucky media)
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌కుమార్‌ బొజ్జం
దర్శకత్వం: విక్రమ్‌ రెడ్డి  (Vikram Reddy)

 
కథ, కథనం బావుండాలి కానీ సినిమా చిన్నదా, పెద్దదా అన్నది పెద్దగా పట్టించుకోవడం లేదు.. నేటి ప్రేక్షకులు. ఈ తరాన్ని టార్గెట్‌ చేసే చిత్రాలయితే యూత్‌ఫుల్‌గా ఉంటే చాలు... యువతరం బ్రహ్మరథం పడతారు. అలాంటి కంటెంట్‌తోనే 'రోటి కపడా రొమాన్స్‌’ చిత్రం తీశానని చెప్పారు దర్శకుడు విక్రమ్‌ రెడ్డి. ఆయన జీవితంలో చూసిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ చిత్రం తీశారు. ట్రైలర్స్‌ యూత్‌కి విపరీతంగా కనెక్ట్‌ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకల్ని ఏమాత్రం ఆకట్టుకుంది అన్నది రివ్యూలో చూద్దాం.



కథ: (Roti Kapda Romance Review)

హర్ష (హర్ష నర్రా) ఓ ఈవెంట్‌ ఆర్గనైజర్‌. రాహుల్‌(సందీప్‌ సరోజ్‌) సాఫ్ట్‌వేర్‌, సూర్య(తరుణ్‌)ఆర్జే, విక్కీ (సుప్రజ్‌ రంగ) నలుగురు చిన్నన్నాటి స్నేహితులు. ఉద్యోగాల రీత్యా ఒకే ప్లాట్‌లో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా ఫ్రెండ్స్‌ సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్‌ చేస్తుంటారు. కూల్‌గా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. అభిమానిని అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ఫ్రెండ్‌గా ఉండి తన కోరికలు తీర్చాలని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి రుణపడి ఉంటాను అంటూ విక్కీతో శ్వేత (మేఘ లేఖ) పరిచయం చేసుకుంటారు. రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌) కథ వేరు. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్‌)ని ఇష్టపడతాడు. కానీ ఆమె పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిల ఎంట్రీతో వాళ్ల జీవితం ఎలా మారింది. ప్రేమ, రొమాన్స్‌ అంటూ తిరిగే వీళ్ళ జీవితాలు ఏ తీరానికి చేరాయి అన్నది తెరపైనే చూడాలి.



విశ్లేషణ:

నలుగురు కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలు.. పరిచయం, స్నేహం, లవ్‌, ఫిజికల్‌ రిలేషన్‌; బ్రేకప్‌ ఈ తరహా కాన్సెప్ట్‌తో లెక్కలేనన్ని సినిమాలొచ్చాయి. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ దర్శకుడు యూత్‌ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గోవా ట్రిప్‌తో కథ మొదలవుతుంది. ఈ నలుగురు కుర్రాళ్ల జీవితాలు ఎక్కడ మొదలై, ఎక్కడకు చేరుకున్నాయి అన్నది ప్రేక్షకులు కన్విన్స్‌ అయ్యేలా చూపించాడు దర్శకుడు. ఒక్కొక్కరి లవ్‌ స్టోరీ రివీల్‌ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియా, లవ్‌స్టోరీలో రొమాన్స్‌ డోస్‌ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్‌-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్‌గా ఉంటుంది. విక్కీ- శ్వేత పెయిర్‌ అయితే ఫన్‌ పంచుతుంది. ఫస్టాఫ్‌ మొత్తం నలుగురు లవ్‌స్టోరీలు చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్‌ స్టోరీలను చెప్పాడు. అయితే ద్వితీయార్థంలో వద్దు అన్న అమ్మాయిల వెంట అలాగే తిరుగుతుంటే సన్నివేశాలు సినిమాకు కాస్త ల్యాగ్‌లా అనిపిస్తుంది. అయితే కథ రియాలిటీకి దగ్గరగా ఉంది. సొసైటీలో చూస్తుంటే దర్శకుడు కథగా మలచి సినిమా తీశారు. ఆ నలుగురు స్నేహితులు ఎంతగా ఫన్‌ పంచారో.. అలాగే- ఎమోషన్స్‌ని బాగా పండించారు. (Roti Kapda Romance Review)

అయితే సినిమాలో మైనస్‌లు అలాగే ఉన్నాయి. నాలుగు లవ్‌ట్రాక్స్‌లో రెండు మాత్రమే ఆకట్టుకున్నాయి. సోనియా, హర్ష, రాహుల్‌ -ప్రియల లవ్‌ట్రాక్‌ సిల్లీ, లాజిక్‌లెస్‌గా ఉంది. క్లారిటీ లేని ప్రేమతో సమయాన్ని తినేసిన ఫీలింగ్‌ కలిగిస్తుంది. అయితే ఫైనల్‌గా ఈ రెండు జంటలకు ఇచ్చిన ఫినిషింగ్‌ బావుంది. అలాగే లిప్‌ లాక్‌ సీన్స్‌, బోల్డ్‌ డైలాగ్‌లు, అక్కడక్కడా బూతులు కూడా వాడేశారు. నేటి యువత ప్రయాణం ఎలా ఉంది అన్నది దర్శకుడు చెప్పారు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే అనర్థాలు, ఎట్రాక్షన్‌తో వచ్చే లవ్‌ ఇష్యూలు, పెళ్లి విషయంలో యువతీ యువకుల ఆలోచన ఎలా ఉంటుంది? ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు దర్శకుడు. ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడం బావుంది. కానీ అక్కడక్కడా కథనం వీక్‌గా అనిపించింది. చివరి 15 నిమిషాలు ఎమోషనల్‌గా సాగుతుంది. ఇక నటీనటుల విషయానికొస్తే.. ఇందులో నటించిన నాలుగు జంటలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ట్రెండ్‌కు తగ్గట్టు కనిపించారు. ఇందులో విక్కీ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది.  


టెక్నికల్‌గా సినిమా బావుంది. సన్నీ ఎంఆర్‌, హర్షవర్థన్‌ రామేశ్వర్‌, ఆర్‌ఆర్‌ ధృవన్‌ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కూడా సందర్భానుసరంగా కుదిరాయి సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్‌ ఓకే. బెక్కెం వేణు గోపాల్‌ కథకు కావలసినట్లుగా ఖర్చుపెట్టారు. ప్రతి మనిషి జీవితంలోకి ఏదో ఒక సమయంలో ఆడది అడుగు పెడుతూనే ఉంటుంది. రావడంతోనే ఆనందాన్ని.. అనుభూతుల్ని.. సంతోషాన్ని ఇస్తుంది. అన్నీ సెట్‌ అయితే బాగానే ఉంటుంది. సెట్‌ కాకపోతే వెళ్లేటప్పుడు ఏడిపించి పోతుంది. తను నీకు ఇచ్చిన జ్ఞాపకాల్లో నువ్వేం గుర్తు పెట్టుకున్నావన్నదే ఇంపార్టెంట్‌. తను ఇచ్చిన మధుర క్షణాలను గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్లిపోతావా? లేదా ఏడిపించిన క్షణాలను గుర్తు పెట్టుకుని అక్కడే ఆగిపోతావా? జీవితం గురించి యూత్‌కి ఎలా చెబితే అర్థమవుతుంది.. చెప్పింది సింపుల్‌గా ఎక్కాలంటే ఏం చేయాలి అన్నదే  ‘రోటి కపడా రొమాన్స్‌’ సినిమా. యూత్‌ని బాగా అలరిస్తుంది. ఫ్యామిలీలకు డౌటే!!

ట్యాగ్‌ లైన్‌: యువతకు కిక్‌ ఇచ్చే సినిమా

Updated Date - Nov 28 , 2024 | 06:52 PM