Rewind Review: టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన 'రివైండ్‌’ రివ్యూ

ABN, Publish Date - Oct 18 , 2024 | 11:27 PM

సాయి రోనక్‌(Sai Ronak), అమృత చౌదరి జంటగా నటించిన చిత్రం 'రివైండ్‌’. క్రాస్‌ వైర్‌ క్రియేషన్స్‌ పై కళ్యాణ్‌ చక్రవర్తి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. శుక్రవారం సౌత్‌ ఇండియాలో మొత్తం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

rewind

సినిమా రివ్యూ: రివైండ్‌ (Rewind movie Review)
నటీనటులు: సాయిరోణక్‌, అమృత చౌదరి, సురేష్‌, కేఏ పాల్‌ రామ్‌, అభిషేక్‌ విశ్వకర్మ, ఫన్‌ బకెట్‌ రాజేష్‌,, భరత్‌ జబర్దస్త్‌ నాగి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: శివ రామ్‌ చరణ్‌
సంగీతం: ఆశీర్వాద్‌
స్ర్కీన్‌ప్లే – నిర్మాత – దర్శకత్వం: కళ్యాణ్‌ చక్రవర్తి

సాయి రోనక్‌(Sai Ronak), అమృత చౌదరి జంటగా నటించిన చిత్రం 'రివైండ్‌’. క్రాస్‌ వైర్‌ క్రియేషన్స్‌ పై కళ్యాణ్‌ చక్రవర్తి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. శుక్రవారం సౌత్‌ ఇండియాలో మొత్తం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉంది. వరుసగా విడుదలైన నాలుగు సినిమాల్లో ఈ సినిమా స్థానం ఎలా ఉంది? ఏ మేరకు ప్రేక్షకులను అలరించింది అన్నది చూద్దాం.  

కథ: (Rewind movie Review)
కార్తీక్‌ (సాయి రోణక్‌) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే నివశించే శాంతి(అమృత చౌదరి)ని చూసి  తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా అదే ఆఫీస్‌లో పని చేస్తుందని తెలిసి మరింత ఆనందిస్తాడు. తన ప్రేమ విషయం ఆమెకు చెప్పేలోపు ఆమెకు లవర్‌ ఉన్నాడనే విషయం తెలిసి షాక్‌ అవుతాడు. ఫిజిక్స్‌ లెక్చరర్‌ అయిన శాంతి తాతయ్య (సామ్రాట్‌) ఎంతో కష్టపడి టైమ్‌ ట్రావెల్‌ మెషీన్‌ తయారు చేస్తాడు. అందులో 1980 నుంచి 2019 వరకూ ట్రావెల్‌ చేసి వస్తాడు. ఆ టైమ్‌ ట్రావెల్‌ మెషీన్‌ కార్తీక్‌ తండ్రి సురేశ్‌కు దొరుకుతుంది. అక్కడి నుంచి కథ 2024లో మొదలవుతుంది. శాంతి, కార్తీక్‌ల ప్రేమకు ఈ టైం ట్రావెల్‌ మెషీన్‌ ఎలా ఉపయోగపడింది టైం ట్రావెల్‌ ద్వారా వెనక్కి వెళ్లిన కార్తీక్‌ గతాన్ని ఏమన్నా మార్చగలిగాడా? అసలు ఏం జరిగింది అన్నది మిగతా కథ.



విశ్లేషణ: (Rewind movie Review)
తెలుగుతోపాటు పలు భాషల్లో టైమ్‌ ట్రావెల్‌ చిత్రాలు చాలానే వచ్చాయి. వీటికి ఇన్స్‌పిరేషన్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’. ఈ చిత్రం విషయంలో రాసుకున్న కథకు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు కనెక్ట్‌ చేయడం బావుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది ప్రారంభంలోనే చెప్పేశాడు. సినిమా మొదలైన తర్వాత సామ్రాట్‌ తన కుటుంబాన్నివెతుక్కుంటూ రావడంతో ఆసక్తి మొదలవుతుంది. తర్వాత సామ్రాట్‌ మాయం అవ్వడం, కథలోకి కార్తీక్‌, శాంతి ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరి క్యూట్‌ లవ్‌ స్టోరీతో ప్రేక్షకులను బాగానే ఎంగేజ్‌ చేశాడు.  ఫస్టాప్‌ మొత్తం ప్రేక్షకుల బ్రెయిన్‌కు ఓ ఫజిల్‌ వదిలాడు. సెకండాఫ్‌లో ఆ పజిల్‌ను ఎలా పూర్తి చేసుకుంటూ వచ్చాడనేది ఆసక్తికరమైన విషయం. ఇలాంటి కథలకు స్ర్కీన్‌ప్లే, లాజిక్‌ అత్యంత ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు చాలా పకడ్భందీగా వ్యవహరించాడు. తన కథకు టైమ్‌ ట్రావెల్‌ లైన్‌ను పర్ఫెక్ట్‌గా అప్లై చేసి ఎగ్జిక్యూట్‌ చేశాడు. దానికి దర్శకత్వంపై అవగాహన, అనుభవం ఉండాలి. కళ్యాణ్‌ చక్రవర్తికి తొలి చిత్రమిది. తక్కువ తడబాటుతో తను అనుకున్నది చెప్పాడు. క్లైమాక్స్‌ మంచి కిక్‌ ఇస్తుంది. నటీనటుల విషయానికి వస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కార్తీక్‌ పాత్రలో సాయి రోనాక్‌  పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. శాంతి పాత్రలో అమృత చౌదరి ఒదిగిపోయింది. గ్లామర్‌గా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకుంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సురేష్‌, సామ్రాట్‌,  రాఘవ, కేఏ పాల్‌ రాము వంటి వాళ్లు తమ పాత్రల మేరకు నటించారు.  కెమెరా పనితనం బావుంది, పాటలు, నేపథ్య సంగీతం ప్లస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ పర్ఫెక్ట్‌గా ఉంది. అంతా కొత్తవారే అయినా నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకొచ్చింది. ఫస్టాఫ్‌లో కొన్ని బోరింగ్‌ సన్నివేశాలు, చిన్నచిన్న లాజిక్‌లు పక్కన పెడితే డీసెంట్‌ టైమ్‌ ట్రావెల్‌ జర్నీ ఇది. అయితే ఇదే కథను ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయిన ఆర్టిస్ట్‌లతో ప్లాన్‌ చేసి ఉంటే రిజల్ట్‌ ఇంపాక్ట్‌ బావుండేది.

ట్యాగ్‌ లైన్‌: థ్రిల్లింగ్‌ టైమ్‌ ట్రావెల్‌..

Updated Date - Oct 19 , 2024 | 02:42 PM