Utsavam Movie Review: రెజీనా నటించిన 'ఉత్సవం' ఎలా ఉందంటే..
ABN, Publish Date - Sep 14 , 2024 | 01:22 AM
కొంత గ్యాప్ తర్వాత రెజీనా నటించిన చిత్రం 'ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్ ప్రకాష్, రెజీనా, ప్రకాష్ రాజ్, నాజర్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రధారులు.
సినిమా రివ్యూ: ఉత్సవం (Utsavam)
విడుదల తేది: 13–9–2024
నటీనటులు: దిలీప్ ప్రకాష్, రెజీనా (Rejina), ప్రకాష్ రాజ్, నాజర్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, సుధ, ఆమని తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
సంగీతం: అనూప్ రూరబెన్స్
నిర్మాత: సురేష్ పాటిల్
రచన, దర్శకత్వం: అర్జున్ సాయి (Arjun Sai)
కొంత గ్యాప్ తర్వాత రెజీనా (Regina Cassandra) నటించిన చిత్రం 'ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్ ప్రకాష్, రెజీనా, ప్రకాష్ రాజ్, నాజర్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రధారులు. ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ: (Utsavam movie Review)
అభిమన్యు నారాయణ (ప్రకాశ్ రాజ్).. కనుమరుగవుతున్న సురభి నాటక మండలిలో ప్రసిద్థి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ (దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. రోజులు మారుతున్న కొద్దీ ఆ కళ అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్‌లో రంగస్థలనటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమా–కృష్ణ ప్రేమలో పడతారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలతో విడిపోతారు. మరోవైపు ఫ్రెండ్స్ అయిన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమాలకు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ విషయం తెలియకుండా రమా, కృష్ణ పెళ్లికి అంగీకరిస్తారు. కొన్ని గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు. ఎలాగైనా పెద్దలను వాళ్లను కలపాలని ప్రయత్నాలు చేస్తారు. అసలు కృష్ణ, రమ ఎలా ప్రేమలో పడ్డారు. విడిపోవడానికి కారణం ఏంటి? పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా ఇదేనని వాళ్లకు తెలిసిందా? ఇద్దరు ఒకటయ్యారా లేదా అన్నది కథ.
విశ్లేషణ:
అంతరించిపోతున్న నాటకరంగం, కళాకారుల నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఆదరణ కరువు అవుతున్న రంగస్థల కళాకారుల కష్టాలను చూపిస్తూనే చక్కని ప్రేమకథను చెప్పాలన్నది దర్శకుడి ఆలోచన. ఆయన రాసుకున్న పాయింట్ బాగున్నా.. తెరకెక్కించిన విధానంలో కాస్త తడబాటు కనిపించింది. స్ర్కీన్‌ప్లేని ఆసక్తికరంగా లేదు. ఓ సీన్ జరుగుతుంటే దానికి లింక్ లేని సన్నివేశం తెరపై ప్రత్యక్షమవుతుంది. కళాకారులు, వారి కష్టాలు అందులో నడిపే ప్రేమ కథ అన్నప్పుడు భావోద్వేగాలకు, సెంటిమెంట్‌కు మంచి స్కోప్ ఉంటుంది. కానీ ఇందులో భావోద్వేగాలు ఎక్కడా పలకలేదు. నాటక రంగానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూస్తే గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఇటీవల ప్రేక్షకాదరణ పొందిన 'రంగమార్తాండా' సినిమాలు గుర్తొస్తాయి. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీ మాత్రం బెటర్ అనిపించింది. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారుల ఒదిదొడుకులను చూపించారు. సెకండాఫ్‌లో నాటకాలకు గత వైభవాన్ని తీసుకురావడానికి హీరో పడే తపనను చూపించారు. రమా– కృష్ణ ఎలా విడిపోయారు అన్నది సింపుల్‌గా చెప్పారు. అయితే ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తదుపరి వచ్చిన సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఊహకు అందేలా ఉంది. పెద్దగా కొత్తదనమేమీలేదు. ఈ తరహా చిత్రాల్లో కమర్షియల్ అంశాలు జోడించడం కష్టం. అదే ఓ మైనస్ అనుకోవచ్చు. నటీనటుల విషయానికొస్తే... నటుడిగా దిలీప్‌కిది రెండో సినిమా. అయినా అనుభవం ఉన్న నటుడిగా అలరించాడు. భావోద్వేగ సన్నివేశాల్ వావ్ అనుపించాడు. తండ్రికి, అతని వృత్తికి విలువిచ్చే కొడుకుగా, మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయి నటించింది. అంతే కాదు తెరపై తన అందంతోనూ మెప్పించింది. అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించారనే చెప్పాలి. ఇలాంటి పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్‌లో శివుడిగా కనిపించి.. తనదైనశైలిలో పలికిన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్‌గా నాజర్ అద్భుతంగా పెర్‌ఫామ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతస్థాయిలో ఉంది. అనూప్ సంగీతం సినిమాకు ఎసెట్ అయింది. మంచి పాటలు, చక్కని బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగా కుదిరింది. ఎడిటర్ కాస్త కత్తెర వేసుంటే సీన్లు మరింత క్రిస్పీగా ఉండేది. ఫస్టాఫ్‌లో కథనం ఇంకాస్త ఆసక్తిగా మలిచి ఉంటే బావుండేది. సినిమాలో కీలక సన్నివేశాల్లో ఆ ప్రభావం కనిపించింది. కథపై కాస్త దృష్టి పెట్టుంటే అవుట్‌పుట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేది.
ట్యాగ్‌లైన్: మంచి ప్రయత్నమే కానీ..