Double ismart Review: పూరి, రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' ఎలా ఉందంటే..
ABN, Publish Date - Aug 15 , 2024 | 03:21 PM
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్టీటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత ఇద్దరికీ సరైన విజయం రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ సూపర్ హిట్‌కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’తో వచ్చిన వీరికి విజయం వరించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం..
సినిమా రివ్యూ: డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)
విడుదల తేది: 15–08–2024
నటీనటులు: రామ్ పోతినేని, కావ్యా థాపర్(Kavya thapar), సంజయ్ దత్, ప్రగతి, ఝాన్సీ, షాయాజి షిండే, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్‌పాండే, అలీ తదితరులు
కెమెరా: శ్యాం కె నాయుడు, జియాని జియాన్నెలి
ఎడిటింగ్: జునైద్
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి(Charmee kaur)
దర్శకత్వం: పూరి జగన్నాథ్(Puri Jagannadh)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్టీటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అందుకుంది. కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత రామ్‌కి, దర్శకుడు పూరి జగన్నాథ్ అందుకున్న భారీ విజయమిది. కలెక్షన్ల పరంగానూ మంచి రిజల్ట్ ఇచ్చింది. లవర్‌బాయ్ క్రేజ్ ఉన్న రామ్‌ని పూరి కొత్తగా చూపించారు. ఆ పాత్రకు రామ్ ఫర్పెక్ట్ అన్నట్లు తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా రెండో పార్ట్ ఉంటుందని పూరి అప్పట్లోనే వెల్లడించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఐదేళ్ల తర్వాత ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలైంది. నటీనటులు, సాంకేతిక నిఫుణుల విషయంలో చిన్నచిన్న మార్పులు చేసి మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాటలు, ట్రైలర్‌లు ఇస్మార్ట్ శంకర్ తరహాలో ఉన్నా.. మంచి బజ్ రావడంతో సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. మరి సక్సెస్ కిక్కు డబుల్ అయిందా? పూరి, రామ్ ఖాతాలో మరో హిట్ పడిందా? అనేది తెలుసుకుందాం..
కథ:
బిగ్ బుల్ (సంజయ్ దత్) అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన డాన్. తన సామ్రాజాన్ని మరింత విస్తరించడానికి భారీ ప్లాన్‌లు చేస్తుంటాడు. ఇంటెలిజెన్స్ ఏజెన్పీ అతని కోసం వేటాడుతుంటుంది. అనుకోకుండా తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, 3 నెలలు మించి బతకడని, దానికి చికిత్స లేదని డాక్టర్లు చెబుతారు. కానీ బతకడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ తరుణంలో అతనికి సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) కలుస్తాడు. మెమరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా మరణం లేకుండా జీవించవచ్చని చెబుతాడు. ఈ ప్రయోగం ఎవరి మీద చేసినా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సక్సెస్ అయిన ఇస్తార్ట్ శంకర్ (రామ్) హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుంటారు. ఇస్మార్ట్ శంకర్‌ను తీసుకొచ్చి మెమరీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఇస్మార్ట్ శంకర్... బిగ్ బుల్‌గా మారాడా? ఇంతకీ బిగ్ బుల్ ఎవరు? శంకర్ తల్లి పోచమ్మకి (ఝాన్సీ), బిగ్ బుల్‌కి సంబంధం ఏంటి? అన్నది కథ.
విశ్లేషణ
ఐదేళ్ల క్రితం పూరి, రామ్(Ram Pothineni) కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపునకు సరిపడే కథనే రాశారు పూరి. ఇస్మార్ట్ శంకర్‌లో హీరో ఒక లక్ష్యం లేనివాడు. కానీ ఇందులో హీరోకి లక్ష్యం ఉంది. దాన్ని బేస్ చేసుకుని హీరో బ్రెయిన్‌లోకి మెమరీ ట్రాన్స్‌ఫర్ జరగడం అనేది తొలి సినిమాతో పోల్చితే కొత్తగానే ఉంది. కథగా ఇది మంచి పాయింట్. పోచమ్మ పాత్ర తెరపైకి రావడంతో ఇదొక రివేంజ్ డ్రామా అని హీరో ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్నాడని, అక్కడే పూర్తి కథ అర్థమైపోతుంది. ఇస్మార్ట్ శంకర్‌లాంటి హైపర్ క్యారెక్టర్‌కు బలమైన ఎమోషన్ పడితే డ్రామా కూడా మంచిగా పండేది. ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలైన సినిమా, విలన్ ఎంట్రీ, ఫైట్స్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్... ఇలా మెల్లగా ముందుకు సాగుతుంది. తదుపరి హీరోహీరోయిన్‌ల లవ్ ట్రాక్. అది కూడా సోసోగానే ఉంటుంది. దాని తర్వాత ఒక్కో పాత్ర పరిచయమవుతుంటాయి. అయితే ఏ సీన్ రక్తి కట్టించేలా ఉండదు. బోకా పాత్రలో అలీ పరిచయం, కాస్త కామెడీ పంచినా సీన్ నడిచే కొద్దీ బోర్ కొడుతుంది. హీరో ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు? బిగ్ బుల్ భారత్ రావడం వెనకున్న కారణమేంటి అన్నది తప్ప సెకెండాఫ్‌లో కొత్త ఏమీ లేదు. అదొకటే ఆసక్తికరంగా సాగింది. మదర్ సెంటిమెంట్ కొంతలో కొంత పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ కాస్త వేగంగా ముందుకు సాగుతుంది. ఫస్టాఫ్ ల్యాగ్ అనిపించి సెకెండాఫ్‌లో ఏదన్నా ట్విస్ట్ ఉంటుందేమో అంటే అది కూడా మిస్ అయింది. బిగ్ బుల్, ఇస్మార్ట్ శంకర్‌లకు రెండు వేర్వేరు లక్ష్యాలు ఉంటాయి. వాటి గురించి ఫస్ట్ టైమ్ రివీల్ అయినప్పుడు ఆసక్తిని కలిగిస్తాయి. కానీ ఆ లక్ష్యాల కోసం వారు చేసిన జర్నీ ఆసక్తికరంగా మలచలేదు. ప్రగతి పాత్ర ద్వారా పండాలనుకున్న భావోద్వేగ సన్నివేశాలు బెడిసికొట్టాయి. సినిమా ప్రారంభంలోనే క్లైమాక్స్ ఎలా ఉంటుందో కూడా ఊహించే స్థాయిలో స్క్రీన్‌ప్లే ఉంది. దర్శకుడు పూరి జగన్నాథ్ రాసుకున్న కథ బావుంది. పాత్రలు, సన్నివేశాలు అవి నడిచిన తీరు చూస్తే పూరి ఎక్కడో ఫెయిల్ అయిన భావన కలుగుతుంది. (Double iSmart Review)
ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే సినిమాకు మేజర్ ఎసెట్ హీరో రామ్ పోతినేని. అతని పాత్రే సినిమాను ఆసక్తిగా ముందుకు తీసుకెళ్లింది. తనలోని ఎనర్జీ, ఈజ్‌ను పుష్కలంగా ఇచ్చాడు రామ్. మేనరిజమ్స్, డాన్స్, డైలాగ్ డెలివరీతో మరోసారి అలరించాడు. అతని పాత్ర వరకూ సెంటిమెంట్ కూడా వర్కవుట్ చేశాడు. కావ్య థాపర్ గ్లామర్‌గా కనిపించింది. డాన్స్, యాక్షన్‌లో పూరి తరహా హీరోయిన్ మార్క్ తెచ్చుకుంది. బిగ్‌బుల్‌గా సంజయ్ దత్ మాత్రమే చేయగల పాత్ర ఇదని పూరి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ తెరపై ఆ పాత్ర తేలిపోయింది. ఆ పాత్రలో చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఇంటర్నేషనల్ డాన్ పాత్ర అంటే ఆ పాత్రలోనే బలం, బరువు ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను, ఝాన్సీ, ప్రగతి తదితరులు పరిధి మేరకు నటించారు. పాటల చిత్రీకరణ బావుంది. జియాని గియాన్నెలి, శ్యామ్ కె.నాయుడు కెమెరా పని తీరు గ్రాండియర్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. జునైద్ ఎడిటింగ్ మైనస్. నిర్మాతలుగా పూరి, ఛార్మి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాకు కావలసిన అన్ని గ్రాండ్‌గా అరేంజ్ చేశారు. మణిశర్మ సంగీతం అందించిన పాటల్లో ‘స్టెప్పామార్’, ‘మార్ ముంతా చోడ్ చింతా’ పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మొదటి భాగంలో ఉన్నంత హైలో లేదు. నేపథ్య సంగీతంలో తన మార్క్ చూపించినా, ఆయన మ్యాజిక్ మిస్ అయిందనిపించింది. కథ బాగున్నా పూరి మార్క్ మిస్ అయిన భావన కలుగుతుంది. ఇస్మార్ట్ శంకర్ మళ్లీ వస్తాడు అనే హింట్ అయితే ఇచ్చారు. మొదటి పార్ట్ 'ఇస్మార్ట్ శంకర్'ను దృష్టిలో పెట్టుకుని, భారీ అంచనాలు పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే.. కాస్త ఎంటర్‌టైన్ కావచ్చు. లేదంటే నిరాశే!
Tagline: ఇస్మార్ట్ కాదు