Veekshanam Review: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వీక్షణం ఎలా ఉందంటే..
ABN, Publish Date - Oct 18 , 2024 | 03:44 PM
ఈవారం భారీ చిత్రాల విడుదల లేకపోవడంతో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టాయి. ఈ శుక్రవారం విడుదలైన ఐదు చిత్రాల్లో రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం 'వీక్షణం' ఒకటి. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో నూతన నిర్మాతలు పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు
సినిమా రివ్యూ: వీక్షణం ((Veekshanam Review)
విడుదల తేదీ: 18–10–2024
నటీనటులు: రామ్ కార్తీక్ (Ram karthik), కశ్వి, బిందు, షైనింగ్ ఫణి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సాయిరామ్ ఉదయ్
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
సంగీతం: సమర్థ్ గొల్లపూడి
నిర్మాతలు: పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి
దర్శకత్వం: మనోజ్ పల్లేటి (Manoj Palleti)
ఈవారం భారీ చిత్రాల విడుదల లేకపోవడంతో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టాయి. ఈ శుక్రవారం విడుదలైన ఐదు చిత్రాల్లో రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం 'వీక్షణం' ఒకటి. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో నూతన నిర్మాతలు పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమేరకు థ్రిల్‌కు గురి చేసింది అన్నది చూద్దాం.
కథ : (Veekshanam Movie Review)
ఓ గేడెట్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్‌తో తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకునే హాబీ ఉంటుంది. అలా చూస్తున్న తరుణంలో ఓ రోజు నేహ(కశ్వి )ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయడానికి తన స్నేహితుడితో కలిసి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఏదోలా ఆ ప్రయత్నాలు ఫలించి నేహ అతని ప్రేమలో పడుతుంది. ఓ చిన్న కారణంతో ఆమెతో వివాదం. అదే సమయంలో బైనాక్యూలర్‌తో అలాగే మరో ఇంటిని పరిశీలిస్తుండగా ఓ అమ్మాయి రోజుకో వ్యక్తిని ఇంటికి తీసుకురావడం గమనిస్తాడు. తొలుత అంతగా పట్టించుకోకపోయినా ఆ అమ్మాయి ఏదో క్రైమ్ చేస్తుందనే అనుమానం రావడంతో ఆమెపై ఫోకస్ పెడతాడు. ఆమె హత్యలు చేస్తుందని తెలిసి ఆమె అంతరంగం ఏంటి? ఆమె ఎందుకు అలా చేస్తుందనే విషయంలో తెలుసుకోవాలనుకునే లోపు ఆమె చనిపోయిందని, అది జరిగి ఎనిమిది నెలలు అయిందని తెలుసుకుంటాడు ఆర్విన్. మరణించిన అమ్మాయి హత్యలు ఎలా చేస్తుంది? అసలు ఆ హత్యలు ఆమే చేసిందా? దాని వెనక ఇంకెవరైనా ఉన్నారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏమిటంటే 'మన పని మనం చూసుకోవడం’ అని విక్టరీ వెంకటేష్ చెప్పిన ఓ మాట నుంచి పుట్టుకొచ్చిన కథ ఈ సినిమా అని దర్శకుడు ప్రమోషన్స్‌లో చెప్పారు. మర్దర్ మిస్టరీ జానర్ కథలను థ్రిల్ చేసేలా తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అయితే తెరకెక్కించే విధానంలో డెప్త్, ఇంపాక్ట్ పక్కాగా ఉండాలి. దర్శకుడు ఆ సూత్రాన్ని బాగా నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించారనిపించింది. ప్రతి సన్నివేశాన్ని సింపుల్ గా చిత్రీకరించారు. పక్కవాడి లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవడం హాబీగా ఉన్న హీరో ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు అన్నది సస్పెన్స్ మిస్ కాకుండా చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఆ తర్వాత వారిద్దరి మధ్య చిన్న గొడవ జరగడం దూరం కావడం, దాంతో హీరో మరో అమ్మాయిని చూడటం ఇదంతా రొటీన్‌గానే అనిపించినా ఇంటర్వెల్ తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? అదెలా సాధ్యం అని హీరో అతని స్నేహితుల బృందం కనుగొనే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. స్ర్కీన్‌ప్లే కాస్త స్లోగా ఉన్నా చెప్పాలనుకున్న కథను నేరుగా దర్శకుడు చెప్పగలిగాడు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులం సమస్యను, విలన్ పాత్రను కులానిని ముడిపెట్టి చూపించిన తీరు బావుంది. అక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. కుల సమస్యను సున్నితంగా టచ్ చేసిన విధానం బావుంది. ముగింపు ఇంకాస్త డిఫరెండ్ ప్లాన్ చేసి ఉంటే పరిపూర్ణంగా ఉండేది.
నటీనటుల పనితీరు వస్తే.. అర్విన్ పాత్రలో రామ్ కార్తీక్ తన ప్రతిభ చూపించాడు. హీరోయిన్ కశ్వి గ్లామర్‌తో ఆకట్టుకుంది. చక్కని అభినయాన్ని ప్రదర్శించింది. మరో కీలక పాత్ఱధారిగా నటించిన బిందు నూతక్కికి నటనకు ఆస్కారమున్న పాత్ర దక్కింది. చనిపోయిన అమ్మాయి పాత్రలో ఆమె నటన బావుంది. షైనింగ్ ఫణి నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా ఆర్టిస్ట్‌లు పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ గ్రాండ్‌గా ఉంది. ఫస్టాప్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీతం సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. సమర్ద్ గొల్లపూడి చక్కని పాటలతోపాటు థ్రిల్లర్ సినిమాకు కావలసిన నేపథ్యం సంగీతం అందించారు. సీన్ డల్ అవుతున్న ప్రతి సందర్భంలో సంగీత దర్శకుడు తన ప్రతిభ చూపించాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నె సాంగ్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఓకే అనిపించాయి. మర్దర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. కథ, కథనం పరంగా సినిమా బాగానే ఉన్నా ఫస్టాఫ్‌లో సీన్ టు సీన్ గ్రిప్ మిస్ అయింది. థిల్లర్ ఎలిమెంట్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ సినిమా అలరిస్తుంది.
ట్యాగ్‌లైన్: థ్రిల్లర్ ప్రియులకు మాత్రమే...