Bhale Unnade Review: రాజ్ తరుణ్ నటించిన 'భలే ఉన్నాడే' సినిమా ఎలా ఉందంటే

ABN, Publish Date - Sep 13 , 2024 | 05:43 PM

గత రెండు నెలలుగా రాజ్‌తరుణ్‌ వరుస చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'తిరగబడర సామీ’, 'పురుషోత్తముడు’ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. తాజాగా 'భలే ఉన్నాడే’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు రాజ్‌ తరుణ్‌.

Bhale Unnade Movie Poster

సినిమా రివ్యూ: భలే ఉన్నాడే (Bhale Unnade Movie Review)

విడుదల తేదీ: 13–09–2024

నటీనటులు: రాజ్‌ తరుణ్‌, మనీషా కంద్కూర్‌, అభిరామి, హైపర్‌ ఆది, సింగీతం శ్రీనివాస్‌, లీలా శాంసన్‌, గోపరాజు రమణ, వడ్లమాని సాయి శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కృష్ణ భగవాన్‌, వీటీవీ గణేష్‌, రచ్చ రవి తదితరులు

సాంకేతిక నిపుణులు:

సినిమటోగ్రఫీ: నగేష్‌ బానెల్లా

సంగీతం: శేఖర్‌ చంద్ర

నిర్మాత: కిరణ్‌ కుమార్‌

సమర్పణ: మారుతి

దర్శకత్వం: జె శివసాయి వర్థన్‌(J Siva sai vardhan)

గత రెండు నెలలుగా రాజ్‌తరుణ్‌ వరుస చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'తిరగబడర సామీ’, 'పురుషోత్తముడు’ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. తాజాగా 'భలే ఉన్నాడే’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు రాజ్‌ తరుణ్‌. ఈ చిత్రానికి మారుతి సమర్పకుడిగా వ్యవహరించడం, ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. 'గీత సుబ్రహ్మణ్యం’ సిరీస్‌తో ట్రెండ్‌ సృష్టించిన శివ సాయి వర్ధన్‌ వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరీ చిత్రం సినీ ప్రియులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ: (Bhale Unnade Movie Review)

రాధ..(రాజ్‌తరుణ్‌- Raj Tarun)) వైజాగ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. తల్లి గౌరి( అభిరామి) బ్యాంక్‌ ఉద్యోగి. రాధ వైజాగ్‌లో శారీ డ్రేపర్‌ (ఫంక్షన్‌లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తి) పని చేస్తుంటాడు. తల్లి గౌరికి అన్ని పనుల్లోనూ సాయం చేస్తుంటాడు. గౌరి పని చేసే బ్యాంకులోనే కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది కృష్ణ (మనీషా కంద్కూరు). ఆమె కాస్త మోడ్రన్‌ గర్ల్‌. ప్రేమ, పెళ్లి విషయాల్లో కొన్ని ఆలోచనలతో ఉంటుంది. రాధను చూడకుండా, ఎవరి అబ్బాయో తెలియకుండా శారీ డ్రేపర్‌గా ఉన్న పరిచయంతో రాధతో ప్రేమలో పడుతుంది. గౌరి లంచ్‌ బాక్స్‌ ద్వారా ఆమె పంపే లేఖలు చదువుతూ రాధ కూడా ప్రేమలో పడతాడు. అయితే ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యాక కృష్ణ అవకాశమిచ్చినా రాధ హద్దు మీరకుండా పద్దతిగా ఉంటాడు. వీళ్లిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్థమవ్వగా.. నిశ్చితార్థం సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విషయం చెబుతుంది. దీంతో కృష్ణకు రాధ వ్యక్తిత్వంపై అనుమానం ఏర్పడుతుంది. దీంతో రాధ పెళ్లి, సంసారానికి పనికొస్తాడా లేదా అని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏమైంది. పీటల దాకా వచ్చిన పెళ్లి ఎందుకు ఆగింది అనేది మిగతా కథ.

విశ్లేషణ...(Bhale Unnade Movie Review)

నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మగతనమా? ప్రేమించిన అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోవడం మగతనమా? అన్న విషయాలకు సరైన సమాధానమిచ్చే కథ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. కథ పరంగా నేటితరానికి బాగా కనెక్ట్‌ అవుతుంది. ఒక బోల్డ్‌ లైన్‌కు లవ్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి క్లీన్‌గా చెప్పారు. ఫస్టాప్‌ అంతా తల్లీకొడుకు మధ్య ప్రేమ, అనుబంధం, మరోవైపు హీరోహీరోయిన్‌లపై లవ్‌ ట్రాక్‌, టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌లా సరదాగా సాగుతుంది. రాధపై కృష్ణ ఎప్పుడైతే ప్రేమ పెంచుకుంటుందో అక్కడి నుంచే ఆమెలో రొమాంటిక్‌ యాంగిల్‌ మొదలవుతుంది. ఆ సన్నివేశాలు నవ్వులు పూయించినా ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. పెళ్లికి సిద్ధమైన సమయంలో స్నేహితురాలు చెప్పిన మాటలతో రాధపై కృష్ణకు అనుమానం కలగడం, అతనిని పరీక్షించే ప్రయత్నంతో కథ టర్న్‌ అవుతుంది. అమ్మాయిలు అతన్ని ఎంతగా కోరుకుంటున్నా.. ప్రేమించిన అమ్మాయి ముద్దులు, హగ్గుల కోసం తహతహలాడుతున్నా అతను ఎందుకు నిగ్రహంతో ఉంటాడు. అతనిలో మగతనం ఉందా? లేక ఇంకేదైనా సమస్య వెంటాడుతోందా? అనిపిస్తుంది. రాధ తల్లి గౌరి జీవితం వెనక బరువైన గతం ఉంది. ఆ కథలో భావోద్వేగం హృదయాన్ని హత్తుకుంటుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఆ ఫ్లాష్‌బ్యాక్‌ ఆకట్టుకుంది. అంతకుముందు వరకూ దర్శకుడు తడపడ్డ భావన కలుగుతుంది. (Bhale Unnade Movie Review)

నటీనటుల విషయానికొస్తే.. నటన, డైలాగ్‌ డెలివరీలో సూపర్‌ యాక్టివ్‌గా ఉండే రాజ్‌ తరుణ్‌ ఈ సినిమా కోసం తన ఎనర్జీని పక్కన పెట్టారు. రాధ పాత్రలో ఇన్నోసెంట్‌గా నటించి ఆకట్టుకున్నారు. నటన పరంగా ఎక్కడా వంక పెట్టేలా లేదు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన చిత్రాల్లో ఇది మంచి పాత్ర అని చెప్పొచ్చు. యాక్టింగ్‌లో స్కోపున్న క్యారెక్టర్‌ ఇది. లుక్‌ పరంగా కూడా బావుంది. అయితే క్లైమాక్స్‌లో తల్లి గతం గురించి మాట్లాడుతున్న సందర్భంలో భావోద్వేగాల్ని పలికించడంలో అతని నటన డల్‌గా అనిపించింది. కృష్ణ క్యారెక్టర్‌లో మనీషా గ్లామర్‌తో ఆకట్టుకుంది. రాజ్‌తరుణ్‌తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. గౌరి పాత్రలో అభిరామి సెటిల్డ్‌గా నటించింది. కథలో కీలకమైన ‘సింగితం’ శ్రీనివాసరావు, లీలా శాంసన్‌ ట్రాక్‌ నిడివి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. అయితే ఆ రెండు పాత్రలు ప్రభావం చూపిస్తాయి. గోపరాజు రమణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు నటన పరంగా ఓకే అనిపించారు. హైపర్‌ ఆది అక్కడక్కడా నవ్వించారు. శేఖర్‌ చంద్ర మరోసారి తన సత్తా చాటారు. చక్కని పాటలు నేపథ్య సంగీతం అందించారు. కెమెరా పనితీరు బావుంది. నిర్మాత ఎన్వీ కిరణ్‌ కుమార్‌ కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చు చేశారు.

ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ సెన్సిబుల్‌ కథ. ఎక్కడా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా తెరకెక్కించారు. అయితే కొన్ని సందర్భాల్లో డైరెక్షన్‌ మిస్‌ ఫైర్‌ అయినట్లు అనిపిస్తుంది. ఫస్టాప్‌తో పోలిస్తే సెకెండాఫ్‌ కాస్త స్లోగా సాగిన భావన కలుగుతుంది. రాధ, కృష్ణ విడిపోయిన తీరు.. ఆ తర్వాత రాధ పడే మానసిక వేదన వంటి సీన్స్‌ బాగానే రాశారు. అలాగే తెరకెక్కించారు కూడా. క్లైమాక్స్‌ బలంగా ఉంటుందని భావిస్తే సోసోగా తేల్చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... కథకు మెయిన్‌ హీరో పాత్ర. అతని పాత్ర అమ్మాయిలకు ఎందుకు దూరంగా ఉంటుందో క్లారిటీ ఇవ్వాలి. కానీ ఆ ప్లేస్‌లో తల్లి గొప్పదనం, తండ్రి లేని లోటు గురించి హీరోతో చెప్పించి అసలు విషయం పక్కన పెట్టేశారు. హీరో క్యారెక్టర్‌పై ఉన్న ప్రశ్నను ప్రేక్షకుల ఊహకు వదిలేశారు. దాంతో రొటీన్‌ అన్న భావన కలుగుతుంది. కానీ రాజ్‌తరుణ్‌ గత రెండు చిత్రాలతో కంపేర్‌ చేస్తే భలే ఉన్నాడే ఫర్వాలేదనిపిస్తుంది (Bhale Unnade Movie Review)

ట్యాగ్‌లైన్‌: 'భలే ఉన్నాడే'.. ఉన్నాడే అనిపిస్తాడు.. అంతే!

Updated Date - Sep 13 , 2024 | 06:26 PM