Pailam Pilaga: ‘పైలం పిలగా’ మూవీ రివ్యూ
ABN, Publish Date - Sep 21 , 2024 | 06:57 PM
ఈ వారం రెండు మూడు చిన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్‌ని పలకరించాయి. అందులో ఒకటి ‘పైలం పిలగా’. ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నటసింహం బాలయ్య హ్యాండ్ వేయడంతో.. ఒక్కసారిగా వార్తలలో నిలిచింది. మరి బాలయ్య ఆశీస్సులతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..
మూవీ పేరు: ‘పైలం పిలగా’(Pailam Pilaga)
విడుదల తేది: 20 సెప్టెంబర్, 2024
నటీనటులు: సాయి తేజ, పావని కరణం, డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు
సంగీతం: యశ్వంత్ నాగ్ (Yashwanth Nag)
కెమెరా: సందీప్ బద్దుల
ఎడిటింగ్: రవితేజ, శైలేష్ దరేకర్
నిర్మాతలు: రామకృష్ణ బొద్దుల, ఎస్.కె. శ్రీనివాస్
దర్శకత్వం: ఆనంద్ గుర్రం (Anand Gurram)
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. కంటెంట్ ప్రధానంగా వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘సరిపోదా శనివారం’ వంటి పెద్ద సినిమా తర్వాత చాలా చిన్న సినిమాలు వచ్చాయి.. మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఇక దసరా బరిలో రెండు మూడు పెద్ద సినిమాలు ఉండటంతో.. ఈ వారం రెండు మూడు చిన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్‌ని పలకరించాయి. అందులో ఒకటి ‘పైలం పిలగా’. ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నటసింహం బాలయ్య హ్యాండ్ వేయడంతో.. ఒక్కసారిగా వార్తలలో నిలిచింది. మరి బాలయ్య ఆశీస్సులతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా..
కథ:(Pailam Pilaga Review)
సాయి తేజ కల్వకోట (శివ) దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతని వాళ్ల నాన్నమ్మ శాంతి (డబ్బింగ్ జానకి) ఒక స్థలం ఉంది, దానిని అమ్మితే డబ్బు వస్తుంది.. నువ్వు దుబాయ్ వెళ్ళవచ్చు అని చెబుతుంది. శివ తన స్నేహితుడు ప్రణవ్ సోను (శ్రీను)తో కలిసి స్థలం అమ్ముదామని అనుకుంటాడు. ఆ స్థలం లిటికేషన్‌లో ఉంటుంది. ఆ లిటికేషన్ ఏంటి? చివరికి శివ దుబాయ్ వెళ్లాడా? దేవి (పావని) ఎవరు? వాళ్ల ప్రేమ కథ ఏంటి? ఆ ప్రేమకథకి, శివ దుబాయ్ ప్లాన్‌కి ఉన్న లింకేంటి? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నేటి ప్రపంచంలోని మనిషి ఆలోచనా విధానాన్ని చెప్పడమే ఈ సినిమా మెయిన్ ఉద్దేశ్యంగా దర్శకుడు కథను రాసుకున్నాడు. పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల.. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే కుర్రాడు, చెట్టు కింద చిన్న గూడు చాలనుకునే కుర్రది.. ఇలాంటి మనస్థత్వం కలిగిన ఇద్దరి మధ్య ప్రేమ కథని నడిపిస్తూనే.. పల్లెటూర్లలో భూ తగాదాలు ఎలా ఉంటాయనేది.. చాలా న్యాచురల్‌గా దర్శకుడు ఈ సినిమా ద్వారా చూపించాడు. ఎక్కడికైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించాలనే సగటు మానవుడి ఆలోచనా.. దేనికైనా దారితీస్తుందని ఇందులో చెప్పిన విధానం ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే.. ఈ తరహా చిత్రాలు టాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. దర్శకుడు ఆనంద్ గుర్రం తను రాసుకున్న కథను, వినోదాత్మకంగా తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. కాకపోతే.. కథలో కొత్తదనం కొరవడిందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉన్న పాయింట్ సినిమాల్లో ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. ఉన్నంతలో మాత్రం చాలా న్యాచురల్‌గా, పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ.. మంచి ఫీల్ ఇవ్వగలిగాడు. టైమ్ ఉంటే ఓసారి అలా ఓ లుక్కు వేయవచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ‘పిల్ల పిలగాడు’ వెబ్ సిరీస్‌తో హీరో సాయితేజ తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలుసు. ఈ సినిమాలోని నటనతో అతను ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గరవుతాడు. తన పాత్రకి ఏం కావాలో అది సాయితేజ ఇచ్చాడు. అలాగే హీరోయిన్ పావని కూడా అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. ఇంకా డబ్బింగ్ జానకికి ఇందులో మంచి పాత్ర పడింది. ఆమె పాత్ర కూడా చాలా న్యాచురల్‌గా ఉంటుంది. చిత్రం శ్రీను, ప్రణవ్ కిరణ్, మిర్చి కిరణ్ వంటి వాళ్లంతా వారి పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమాకు మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు. మిగతా విభాగాల్లో అంతగా చెప్పుకోవడానికి ఏం స్పెషల్ లేదు. కాకపోతే దర్శకుడి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న విషయాలను ఒక కాన్సెప్ట్‌గా చేర్చి, ఎటువంటి వల్గారిటీ లేకుండా తనకిచ్చిన బడ్జెట్‌లో మంచి ప్రయత్నమే చేశాడు కానీ.. ప్రేక్షకులను ఆ ప్రయత్నం ఎంతవరకు థియేటర్లకు రప్పించగలుగుతుందనేది చూడాలి.
ట్యాగ్‌లైన్: ఓకే.. పిలగా!